Adani group: అదానీ గ్రూప్‌ షేర్లు బ్యాక్‌.. రెండు మినహా మిగిలినవన్నీ లాభాల్లో..

Adani group shares: స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌ షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. ఆ గ్రూప్‌నకు చెందిన 10 షేర్లలో 8 షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Updated : 08 Feb 2023 13:32 IST

దిల్లీ: అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదికతో (Hindenburg Research) అతలాకుతలం అయిన అదానీ గ్రూప్‌ (Adani group) షేర్లు మెల్లమెల్లగా కోలుకుంటున్నాయి. వరుసగా 10 ట్రేడింగ్‌ సెషన్లలో నష్టాలు మూటగట్టుకున్న ఆ గ్రూప్‌ షేర్లు.. బుధవారం నాటి ట్రేడింగ్‌లో లాభాల్లోకి వచ్చాయి. కేవలం రెండు షేర్లు మినహా ఆ గ్రూప్‌నకు చెందిన అన్ని షేర్లు మార్నింగ్‌ సెషన్‌లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

బుధవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ఏకంగా 13 శాతం మేర పెరిగి రూ.2038కి చేరింది. కంపెనీ మార్కెట్‌ విలువ సైతం రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ షేర్లు సైతం 7.24 శాతం పెరిగి రూ.593.35 వద్ద ట్రేడవుతోంది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ (5 శాతం), అదానీ పవర్‌ (4.99 శాతం), అదానీ విల్మర్‌ (4.99 శాతం) షేర్లు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

ఇటీవలే కొనుగోలు చేసిన ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ సైతం లాభాల్లో ఉన్నాయి. మార్నింగ్‌ సెషన్‌లో ఎన్డీటీవీ 3.94 శాతం, అంబుజా 1.15 శాతం, ఏసీసీ 0.43 శాతం లాభాల్లో కొసాగుతున్నాయి. అదానీ గ్రూప్‌నకే చెందిన అదానీ టోటల్‌ గ్యాస్‌ 5 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 1.59 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన మొత్తం 10 కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవ్వగా.. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో నాలుగు కంపెనీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌ 1,114 మిలియన్‌ డాలర్లు విలువైన రుణాలను ముందుగా చెల్లిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని