Job Opportunities: జాబ్‌ మారతాం.. భారత్‌లో మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం ఇదే!

Job Opportunities: భారత్‌లో మైకేల్‌ పేజ్‌ నిర్వహించిన ఓ సర్వేలో ఉద్యోగులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. చాలా మంది కొత్త అవకాశాల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.

Published : 19 May 2023 18:32 IST

దిల్లీ: భారత్‌లో చాలా మంది ఉద్యోగులు జాబ్‌ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. ప్రతి పది మందిలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రస్తుతం తాము చేస్తున్న కంపెనీలో ఉండడానికి ఇష్టపడుతున్నారని పేర్కొంది. మంచి వేతనం, పనిచేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించే కంపెనీలకు మారడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు గ్లోబల్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థ మైకేల్‌ పేజ్‌ శుక్రవారం నివేదికను వెలువరించింది. దాదాపు 98 శాతం మంది ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది.

మైకేల్‌ పేజ్‌ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70 వేల మంది ఉద్యోగులను సర్వే చేసింది. వీరిలో 4,000 మంది భారతీయులు. గత 12- 18 నెలల్లో పని ప్రదేశాల్లో గణనీయ మార్పు వచ్చినట్లు నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 75 శాతం మంది కొత్త ఉద్యోగం కోసం ప్రస్తుతం యాక్టివ్‌గా వెతుకుతున్నారు. మరో 11 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో కొత్త జాబ్‌లోకి మారాలనుకుంటున్నారు. మిగిలిన 23 శాతం మంది మంచి అవకాశం కోసం వేచి చూస్తున్నారు. 2022లో ఉద్యోగం మారిన వారిలోనూ 63 శాతం మంది మళ్లీ మరో కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

మార్కెట్‌లో టాలెంట్‌కు అపార అవకాశాలున్నాయని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జాబ్‌ మారే విషయంలో రిస్క్‌ తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదని తెలిపారు. కేవలం ఉద్యోగంలో సంతృప్తి మాత్రమే కాకుండా వేతనం, భవిష్యత్‌లో వృద్ధి అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని