Mukesh Ambani: వారసులకు ముకేశ్‌ అంబానీ ఇచ్చిన టార్గెట్‌లు ఇవే..!

తన వారసులకు వ్యాపార బాధ్యతలను అప్పగించిన ముకేశ్‌ అంబానీ.. తాజాగా ఆయా రంగాల్లోని లక్ష్యాలు, అవకాశాలను వారికి గుర్తుచేశారు.

Published : 29 Dec 2022 18:10 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 2023 చివరినాటికి జియో 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు రిలయన్స్‌ (Reliance) అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) తెలిపారు. అలాగే రిటైల్‌ రంగంలో వస్తున్న అవకాశాల్ని అందింపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ ఇంధన రంగంలోనూ గణనీయ పురోగతి సాధించాలని నిర్దేశించుకున్నారు. ఇలా ముకేశ్‌ (Mukesh Ambani) తన ముగ్గురు వారసులకు లక్ష్యాలను నిర్దేశించారు. ధీరూభాయ్‌ జయంతి సందర్భంగా బుధవారం జరిగిన ‘రిలయన్స్‌ ఫ్యామిలీ డే’లో ముకేశ్‌ (Mukesh Ambani) ఈ వ్యాఖ్యలు చేశారు.

‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్’ సమగ్ర స్వీయ-పరివర్తన ప్రయాణం ప్రారంభమైందని ముకేశ్‌ అన్నారు. 2021లో జరిగిన ‘ఫ్యామిలీ డే’లో ముకేశ్‌ తొలిసారి తన వారసత్వ ప్రణాళిక గురించి ప్రస్తావించారు. తన వ్యాపారాన్ని మూడు భాగాలుగా గుర్తించి.. టెలికాం, డిజిటల్‌ను పెద్ద కొడుకు ఆకాశ్‌కు; రిటైల్‌ను కూతురు ఈశాకు; స్వచ్ఛ ఇంధన వ్యాపారాన్ని చిన్న కొడుకు అనంత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. తాజా ఫ్యామిలీ డే సందర్భంగా ఈ మూడు విభాగాల్లో సాధించాల్సిన లక్ష్యాలను ముకేశ్‌ తన వారసుల ముందుంచారు.

‘‘సంవత్సరాలు వెళ్లిపోతాయి. దశాబ్దాలు గడిచిపోతాయి. మర్రి చెట్టు లాగా రిలయన్స్ ఇంకా పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. దాని కొమ్మలు విశాలంగా విస్తరిస్తాయి. వేర్లు మరింత లోతుకు వెళ్తాయి. నానాటికీ పెరుగుతున్న భారతీయుల జీవితాలను స్పృశిస్తూ, సుసంపన్నం చేస్తూ రిలయన్స్‌ వారిని మరింత శక్తిమంతంగా మారుస్తుంది’’ అని ముకేశ్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రిలయన్స్‌ 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుందని గుర్తుచేశారు.

ఆకాశ్‌కు గొప్ప అవకాశం..

‘‘ఆకాశ్‌ నేతృత్వంలో జియో ప్రపంచంలోని అత్యుత్తమ 5G నెట్‌వర్క్‌ను భారతదేశం అంతటా విస్తరిస్తోంది. ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా అమలవుతోంది. 2023లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే, భారత్‌లో రాబోతున్న మరో అతిపెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి జియో ప్లాట్‌ఫామ్స్‌ సిద్ధం కావాల్సి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ప్రత్యేకమైన డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను అందించాల్సిన అవసరం ఉంది’’ అని టెలికాం, డిజిటల్‌ విభాగం సాధించాల్సిన లక్ష్యాలను ముకేశ్‌ నిర్దేశించారు. దేశంలో ప్రతి గ్రామం 5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానం కానుంనదని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవల్ని అందించాలన్నారు. తద్వారా పట్టణ- గ్రామీణ ప్రాంతాల మధ్యనున్న అంతరాన్ని తగ్గించడానికి ఇదే గొప్ప అవకాశం అన్నారు. ఈ రకంగా భారత్‌ సమగ్రాభివృద్ధిని మరింత వేగంగా సాధించడంలో జియో భాగమయ్యే అవకాశం ఉందన్నారు.

ఈశా టార్గెట్‌ ఇదే..

మరోవైపు ఈశా నేతృత్వంలో రిటైల్‌ బిజినెస్‌ దేశవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటోందన్నారు. ఈ రంగంలో ఉన్న మరిన్ని అవకాశాల్ని అందిపుచ్చుకోగల సామర్థ్యం, సమర్థత రిలయన్స్‌ రిటైల్‌ బృందానికి ఉందని చెప్పారు. జియో తరహాలోనే రిటైల్ వ్యాపార వృద్ధి సైతం భారతదేశ సమగ్ర అభివృద్ధిపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఉత్పాదకతను పెంచడం సహా వ్యాపారులను సుభిక్షంగా మార్చగలదన్నారు.

అనంత్‌కు ‘హరిత’ లక్ష్యం..

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం గిగా ఫ్యాక్టరీలను నిర్మించడంతోపాటు హైడ్రోజన్ వ్యాపారంలోకి ప్రవేశించడం వరకు విస్తరించిన ‘కొత్త ఇంధన’ వ్యాపారానికి.. రిలయన్స్‌ రూపురేఖలనే మార్చగల సామర్థ్యం ఉందని ముకేశ్‌ అన్నారు. అనంత్‌ నేతృత్వంలోని ఈ కొత్త తరం వ్యాపారం.. జామ్‌నగర్‌ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుతో వేగంగా విస్తరించనుదన్నారు. భారత్‌లో అతిపెద్ద, అత్యంత విలువైన కంపెనీగా ఉన్న రిలయన్స్‌.. రానున్న రోజుల్లో ‘గ్రీనెస్ట్‌ కార్పొరేట్‌’గా అవతరించే దిశగా దూసుకెళ్తోంద్నారు. భారత్‌ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను అందుకోవడం, స్వయం సమృద్ధిని సాధించేలా చూడడమే రిలయన్స్‌ న్యూ ఎనర్జీ బినిసెస్‌ ముందున్న స్పష్టమైన లక్ష్యమని తెలిపారు. చురుగ్గా ఉంటూ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటేనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

టీమ్‌వర్క్‌, నాయకత్వంతోనే వ్యాపారంలో విజయం సాధ్యమవుతుందని అంబానీ అన్నారు. అందుకు ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్ గెలిచిన ఉదంతాన్ని ప్రస్తావించారు. జట్టు సహకారం లేకపోతే మెస్సి ఒక్కడే కప్‌ను గెలవడం సాధ్యమయ్యేది కాదన్నారు. అలాగే మెస్సి స్ఫూర్తిమంతమైన నాయకత్వం లేకుండా అర్జెంటీనాకు విజయం అంత సులభమై ఉండేది కాదన్నారు. తొలి మ్యాచ్‌లో తడబడినా.. విజయాన్ని ముద్దాడే వరకు అర్జెంటీనా పోరాటం ఆపలేదన్నారు. చివరి పెనాల్టీ షాట్‌ వరకు వారి దృష్టంతా విజయంపైనే ఉందని కొనియాడారు. రిలయన్స్‌ను సైతం ధీరూభాయ్‌ అంబానీ అదే తరహాలో నిర్మించారని తెలిపారు. తన తండ్రితో పాటు స్వామి వివేకానంద కూడా తనలో ఎంతో స్ఫూర్తి నింపారని ముకేశ్‌ తెలిపారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. నిరంతరం దానికోసమే తపించాలన్న స్వామీజీ మాటల్ని గుర్తుచేశారు. అందరూ దీన్ని పాటించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు