Reliance Retail: రిలయన్స్‌ రిటైల్‌ రారాణిగా ఈశా అంబానీ?

ఈశా అంబానీ (Isha Ambani)కి రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) బాధ్యతలు బదిలీ చేయనున్నట్లు రిలయన్స్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది....

Updated : 29 Jun 2022 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధినేత ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) తన వారసులకు నాయకత్వ బదిలీ విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన సోదరుడు అనిల్‌ అంబానీ, తనకు మధ్య తలెత్తిన వివాదాల తరహాలో తన పిల్లల మధ్య ఎలాంటి తగువూ లేకుండా పటిష్ఠమైన వ్యూహం అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే మంగళవారం టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియో (Reliance Jio) ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ బాధ్యతలను తన పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ (Akash Ambani)కి అప్పగించారు. అదే క్రమంలో తన కూతురు ఈశా అంబానీ (Isha Ambani)కి రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) బాధ్యతలు బదిలీ చేయనున్నట్లు రిలయన్స్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ ఈశా ప్రస్థానం..

ముంబయిలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తిచేసిన ఈశా అంబానీ (Isha Ambani) తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్లారు. యేల్‌ యూనివర్శిటీ నుంచి సైకాలజీ, సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. కొన్ని నెలల పాటు మెకిన్సీ అండ్‌ కంపెనీలో బిజినెస్‌ అనలిస్ట్‌గా పనిచేశారు.

తర్వాత భారత్‌కు తిరిగొచ్చిన ఈశా (Isha Ambani) రిలయన్స్‌ వ్యాపారంలోకి ప్రవేశించారు. సూపర్‌ మార్కెట్లు నిర్వహించే రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌), టెలికాం సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ (జేపీఎల్‌) బోర్డుల్లో 2014 నుంచి డైరెక్టరుగా కొనసాగుతున్నారు. 2016లో రిలయన్స్‌ రిటైల్‌కు అనుంబంధంగా అజియో (Ajio) అనే ఫ్యాషన్‌ ఆన్‌లైన్‌ రిటైల్‌ను ప్రారంభించారు. 2018 డిసెంబరులో ఆనంద్‌ పిరమాల్‌ను వివాహం చేసుకున్నారు. పిరమాల్‌ గ్రూపు అధినేత అజయ్‌, స్వాతి పిరమాల్‌ల కుమారుడే ఆనంద్‌. 

రిలయన్స్‌ రిటైల్‌ గురించి..

  • రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) బిజినెస్‌ కింద రిలయన్స్‌ ఫ్రెష్‌, రిలయన్స్‌ స్మార్ట్‌, రిలయన్స్‌ స్మార్ట్‌ పాయింట్, జియో మార్ట్‌, రిలయన్స్‌ డిజిటల్‌, జియో స్టోర్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌, ప్రాజెక్ట్‌ ఈవ్‌, ట్రెండ్స్‌ ఫుట్‌వేర్‌, రిలయన్స్‌ జువెల్స్‌, హామ్లేస్‌, రిలయన్స్‌ బ్రాండ్స్‌, రిలయన్స్‌ కన్జ్యూమర్‌ బ్రాండ్స్‌, 7-ఇలెవన్‌ వంటి బ్రాండ్లు ఉన్నాయి.
  • 2021 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం రూ.1.57 లక్షల కోట్లు.
  • దేశవ్యాప్తంగా 12,711 రిటైల్‌ స్టోర్లు ఉన్నాయి.
  • 7000కు పైగా పట్టణాలకు రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లు విస్తరించాయి.
  • ప్రతి వారం 50 లక్షల వినియోగదారులకు సేవలందిస్తోంది.
  • రెండు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
  • రోజుకి 500 మెట్రిక్‌ టన్నులకు పైగా కూరగాయలు, పండ్లు అమ్ముడవుతాయి.
  • ఏటా 1.4 కోట్ల లీటర్ల పాలు విక్రయిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని