Twitter: కష్టపడతారా.. వెళ్లిపోతారా.. ఉద్యోగులకు మస్క్‌ అల్టిమేటం!

ఇప్పటికే కొంతమంది ఉద్యోగుల్ని తొలగించిన ఎలాన్‌ మస్క్‌.. ఉన్న ఉద్యోగులపై కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. కష్టపడి చేస్తామని ఉద్యోగుల నుంచి లిఖితపూర్వక హామీ కోరుతున్నట్లు తెలుస్తోంది.

Published : 17 Nov 2022 12:31 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులను తొలగించిన ట్విటర్‌ (Twitter) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీని లాభదాయకంగా మార్చేందుకు ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి నుంచి లిఖితపూర్వక హామీ కోరినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది.

ట్విటర్‌ (Twitter)లో మార్పులు చేసేందుకు మస్క్‌ (Elon Musk) సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల్ని తొలగించారు. మరోవైపు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పిన ఆయన.. కష్టపడి పనిచేస్తేనే కంపెనీ మనుగడ కొనసాగుతుందని స్పష్టం చేశారు. లేదంటే దివాలా కూడా తప్పకపోవచ్చునని ఇటీవల హెచ్చరించారు. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని.. రోజుకు 12 గంటలు సంస్థ కోసం వెచ్చించాలని కోరారు. దీనికి సంబంధించి వారి నుంచి హామీని కోరుతూ తాజాగా ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా ఓ ఫారం పంపినట్లు తెలుస్తోంది. అందులో కష్టపడి పనిచేస్తారా లేదా కంపెనీని వీడతారా అని అల్టిమేటం జారీ చేసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. అందులో ‘యెస్‌’ అనే బటన్‌పై నొక్కడం తప్ప ఉద్యోగులకు మరో ఆప్షన్‌ ఇవ్వలేదని సమాచారం. దీనికి సమ్మతించనివారు మూడు నెలల నోటీసు పీరియడ్‌తో సంస్థను వీడాలని మస్క్‌ (Elon Musk) చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఫారాన్ని పూర్తి చేసి సమర్పించడానికి అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారట! ఈ విషయంపై ఇప్పటి వరకు ట్విటర్‌ (Twitter) అధికారిక వర్గాలు స్పందించలేదు.

ఇలా మస్క్‌ (Elon Musk) హామీ కోరడంపై చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఒప్పందాన్ని అంగీకరించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని వాపోతున్నారు. చాలా మంది సాయం కోసం న్యాయనిపుణులను ఆశ్రయిస్తున్నారు. అయితే, మస్క్‌ (Elon Musk) ఇలా హామీ కోరడాన్ని కొన్ని స్వచ్ఛంద సంస్థలు తప్పుబడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగులు భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలను కోల్పోవాల్సి రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దివ్యాంగులకు వసతి, అనారోగ్యంపై సెలవు వంటి కనీస సదుపాయాల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని