Updated : 17 May 2022 13:01 IST

Twitter Takeover: ట్విటర్‌ కొనుగోలుపై మరో బాంబ్‌ పేల్చిన మస్క్‌!

తక్కువ ధరకు కొంటానని సంకేతాలు

వాషింగ్టన్‌: ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం (Twitter Takeover) ఖరారు తర్వాత రోజుకో అప్‌డేట్‌తో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మంగళవారం చేసిన ఓ ట్వీట్‌ వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కో ట్విటర్‌ (Twitter) షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని ఒప్పందంలో పేర్కొన్న ఆయన.. తాజాగా దాన్ని తగ్గించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఒప్పుకున్న 44 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ చెల్లించి ట్విటర్‌ను కొనుగోలు (Twitter Takeover) చేయాలనుకుంటున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు.

మరోవైపు ట్విటర్‌ (Twitter)లో నకిలీ ఖాతాల సంఖ్య.. సంస్థ వెల్లడించిన దానికంటే చాలా ఎక్కువే ఉంటుందని మస్క్‌ (Elon Musk) అభిప్రాయపడినట్లు సమాచారం. దాదాపు 20 శాతం అంటే 229 మిలియన్ల స్పామ్‌ ఖాతాలు ఉంటాయని ఆయన అంచనా వేశారు. నకిలీ ఖాతాలు 5 శాతం కంటే తక్కువే ఉంటాయని సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ సోమవారం వరుస ట్వీట్ల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న మస్క్‌.. పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్‌ (Elon Musk) కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉండి ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. లేదా ఇటీవల ట్విటర్‌ (Twitter) షేరు భారీగా పడిపోయిన నేపథ్యంలో తక్కువ ధరకైనా కొనుగోలు చేయాలని భావిస్తూ ఉండి ఉండాలని విశ్లేషిస్తున్నారు. ట్విటర్‌ కొనుగోలు (Twitter Takeover)కు కావాల్సిన 44 బిలియన్ డాలర్లలో కొంత మొత్తాన్ని ఆయన సొంతంగా భరిస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారాన్ని తగ్గించుకునే యోచనలో ఉండి ఉండొచ్చని చెబుతున్నారు.

ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించి మస్క్‌ (Elon Musk) ట్విటర్‌ను కొనుగోలు (Twitter Takeover) చేసేందుకు ఏప్రిల్‌ 14న ఒప్పందం ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ, నకిలీ ఖాతాల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అప్పటి నుంచి షేరు ధర పడిపోతూ వస్తోంది. సోమవారం 8 శాతం నష్టంతో 37.39 డాలర్ల వద్ద స్థిరపడింది.

చైనాతో చెలిమి డీల్‌కు అడ్డంకా?

టెస్లా (Tesla) సీఈఓ హోదాలో మస్క్‌ (Elon Musk)కు చైనాతో ఉన్న సంబంధాలు ట్విటర్‌ డీల్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. టెస్లా కార్లకు చైనాలో మంచి గిరాకీ ఉంది. గత ఏడాది ఈ విద్యుత్తు కార్ల విక్రయాల్లో సగానికి పైగా డ్రాగన్‌ దేశంలోనే జరిగాయి. షాంఘైలోని తయారీ కేంద్రం టెస్లా (Tesla) కార్ల ఎగుమతికి అడ్డాగా ఉంది. అనేక షరతుల మధ్య విదేశీ కంపెనీలను అనుమతించే చైనా ట్విటర్‌ (Twitter) విషయంలోనూ ఇదే పంథాను కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం చైనాలో ట్విటర్‌ (Twitter)కు అనుమతి లేదు. అయినప్పటికీ.. ఆ దేశం తమ వ్యతిరేక వర్గాలపై దుష్ప్రచారాల కోసం ఈ సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో టెస్లా (Tesla) మనుగడకు ఎలాంటి అడ్డంకులు ఉండొద్దంటే.. ట్విటర్‌ (Twitter)లో చైనాపై ఇతర దేశాల ఆరోపణల్ని నిలువరించాలని షరతు విధించే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం. తైవాన్, హాంకాంగ్‌ విషయంలో తమ వైఖరికి మద్దతు పలకడమో లేక నోరు మెదపకుండా ఉంటామని హామీ ఇచ్చిన విదేశీ కంపెనీలే ఇప్పుడు చైనాలో మనుగడ సాగిస్తున్నాయి. ఇలా ట్విటర్‌ విషయంలోనూ తమ పరపతిని ఉపయోగించి మస్క్‌పై చైనా ఒత్తిడి తీసుకురావొచ్చని ఓ వర్గం వాదన. అదే జరిగితే.. మస్క్‌ తొలినుంచీ పట్టుబడుతున్న వాక్‌స్వేచ్ఛకు అర్థమే లేకుండా పోతుందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీల్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో మస్క్‌ ఉన్నారని మరికొంతమంది అంచనా!

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని