Twitter: ట్విటర్‌లో మరింత మంది ఉద్యోగులపై వేటు?

ట్విటర్‌ నుంచి ఇప్పటికే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించిన ఎలాన్‌ మస్క్‌.. మరింత మందిపై కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతువున్నట్లు సమాచారం.

Published : 20 Nov 2022 16:31 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్‌ నుంచి ఇప్పటికే సగానికి పైగా మంది ఉద్యోగుల్ని ఎలాన్‌ మస్క్ తొలగించారు. మరోవైపు ఇటీవల ఆయన జారీ చేసిన అల్టిమేటంతో దాదాపు మరో 1200 మంది రాజీనామా చేశారు. తాజాగా మరింత మందిని తొలగించేందుకు మస్క్‌ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

ట్విటర్‌లో మార్పులకు అనుగుణంగా కష్టపడి పనిచేయాలని మస్క్‌ ఇటీవల ఉద్యోగులకు సూచించారు. ఈ మేరకు లిఖితపూర్వక హామీని ఇవ్వాలని కోరారు. లేదంటే వెళ్లిపోవాలని ఆయన ఇటీవల అల్టిమేటం జారీ చేశారు. దీన్ని వ్యతిరేకించిన ఉద్యోగులు చాలా మంది రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వీరిలో చాలా మంది టెక్‌ విభాగం నుంచే ఉన్నట్లు సమాచారం. తాజాగా మస్క్‌ సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఆయా విభాగాధిపతుల సమ్మతి కోరుతూ మస్క్‌ లేఖ రాసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. కానీ, సేల్స్‌ విభాగాధిపతి రాబిన్‌ వీలర్‌, పార్ట్‌నర్‌షిప్స్‌ విభాగాధిపతి మ్యాగీ సునీవిక్‌.. మస్క్‌ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఫలితంగా వీరివురిని మస్క్‌ ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి వీలర్‌ గతనెలలోనే కంపెనీ వీడేందుకు సిద్ధమవ్వగా.. యాజమాన్యం ఆమెను బుజ్జగించి ఉండేందుకు ఒప్పించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ట్విటర్‌లో మార్పుల నేపథ్యంలో దూరమైన ప్రకటనదారులతో మాట్లాడేందుకు మస్క్‌కు వీలరే సహకరించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు