Elon Musk - Twitter: ‘సింక్‌’తో ట్విటర్‌ కార్యాలయానికి వెళ్లిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk - Twitter: ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను ఎలాన్‌ మస్క్‌ వేగవంతం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్‌ కార్యాలయానికి వెళ్లారు.

Updated : 27 Oct 2022 11:53 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఎట్టకేలకు ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టమవుతోంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయానికి బుధవారం ఆయన స్వయంగా వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. అలాగే తన ట్విటర్‌ బయోను ‘చీఫ్‌ ట్విట్‌’గా మార్చారు. ఈ రోజు ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు విధించిన గడువు రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.

ట్విటర్‌ కార్యాలయంలోకి మస్క్‌ ‘సింక్‌’తో ప్రవేశించడం గమనార్హం. లోపలికి వెళుతూనే నవ్వుతూ ‘‘లెట్‌ దట్‌ సింక్‌ ఇన్‌’’ అని వ్యాఖ్యానించారు. ఇక ట్విటర్‌తో కలిసిపోతున్నానని సింబాలిక్‌గా చెప్పడం కోసమే సరదాగా ఆయన అలా చేసి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం నాటికి ట్విటర్‌ కొనుగోలును పూర్తి చేస్తానని బ్యాంకర్లకు ఎలాన్‌ మస్క్‌ తెలిపినట్లు బుధవారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ట్విటర్‌ను సొంతం చేసుకోవడం కోసం బ్యాంకర్ల నుంచి మస్క్‌ 13 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకుంటున్నారు.

ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు గతంలో మస్క్‌ ప్రకటించడంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మస్క్‌పై ట్విటర్‌ కోర్టుకు వెళ్లింది. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉండగానే.. మస్క్‌ మళ్లీ మనసు మార్చుకొని కొనుగోలును పూర్తిచేస్తానని గతవారం ప్రకటించారు. దీంతో అక్టోబరు 28లోగా ఇరు వర్గాలు ఒక అవగాహనకు రావాలని కోర్టు ఆదేశించింది. లేదంటే కేసును విచారణకు స్వీకరిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియను మస్క్‌ వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొనుగోలు స్వరూపం ఇదీ..

  • కొనుగోలు ఆఫర్‌ ధర: 44 బిలియన్‌ డాలర్లు (షేరుకు 54.20 డాలర్లు)
  • దీని కోసం సిద్ధం చేసుకుంది: 46.5 బిలియన్‌ డాలర్లు (ఈక్విటీ, రుణాల రూపంలో)
  • మోర్గాన్‌ స్టాన్లీ వంటి బ్యాంకుల రుణాలు: 13 బిలియన్‌ డాలర్లు
  • ఈక్విటీ పెట్టుబడిదార్లు ఇచ్చేది: 7.1 బి. డాలర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని