Elon Musk: అంతా నాన్సెన్స్‌..అదో బూటకపు కథనమంటూ మండిపడిన మస్క్‌..!

తన ట్వీట్లు ఎక్కువ మందికి చేరువయ్యేలా ఎలాన్‌ మస్క్‌(Elon Musk) కోడింగ్‌లో మార్పులు చేయించారంటూ ఓ కథనం వెలువడింది. దానిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 18 Feb 2023 16:27 IST

శాన్‌ఫ్రాన్సిస్కో:తన ట్వీట్లకు పెద్దగా ఆదరణ దక్కడం లేదని ట్విటర్‌ (Twitter) అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గుర్రుగా ఉన్నారని, ఆ మేరకు తన ట్వీట్లకు ప్రాధాన్యం దక్కేలా ఏకంగా కోడింగ్‌, ఆల్గరిథమ్‌లో మార్పులు చేయాలని ఇంజినీర్లకు సూచించారని ఇటీవల వార్తలు వచ్చాయి. కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ.. ‘ప్లాట్‌ఫార్మర్‌’ వెబ్‌సైట్‌ ఈ కథనాన్ని ప్రచురించింది. దీనిపై మస్క్ తాజాగా స్పందిస్తూ.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఆ నకిలీ ‘ప్లాట్‌ఫార్మర్‌’ ఒక అసంతృప్తి ఉద్యోగి చెప్పిన మాటలు బట్టి కథనం రాసింది. త్వరలో గూగుల్‌లో చేరనున్నాడు. కొద్ది నెలలుగా వేతనంతో కూడిన సెలవులో ఉన్నాడు. సంస్థ నుంచి బయటకు వెళ్లేముందు ఇక్కడ వాతావరణాన్ని విషపూరితం చేయాలనుకున్నాడు. ట్విటర్ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది’ అని ట్విటర్ వేదికగా మస్క్‌ మండిపడ్డారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఆదివారం ఫిలడెల్ఫియా ఈగిల్స్, కాన్సాస్‌ సిటీ చీఫ్స్‌ ఫుట్‌బాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. మస్క్‌ (Elon Musk) ఈగిల్స్‌ను సపోర్ట్‌ చేస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ (Biden) సైతం ఈగిల్స్‌ జట్టుకే మద్దతు పలుకుతూ ట్వీట్‌ చేశారు. మస్క్‌ (Elon Musk) ట్వీట్‌కు 90 లక్షల ఎంగేజ్‌మెంట్లు రాగా.. బైడెన్‌ (Biden) ట్వీట్‌కు ఏకంగా 2.90 కోట్ల ఎంగేజ్‌మెంట్లు వచ్చాయి. దీన్ని మస్క్‌ (Elon Musk) జీర్ణించుకోలేకపోయారని ‘ప్లాట్‌ఫార్మర్‌’ కథనం సారాంశం.

దాంతో వెంటనే శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఇంజినీర్లతో మస్క్‌ మాట్లాడారని, తన ట్వీట్లకు అందరి కంటే ఎక్కువ ఎంగేజ్‌మెంట్‌ వచ్చేలా సోమవారం మధ్యాహ్నానికి కోడింగ్‌, ఆల్గరిథమ్‌లో తగు మార్పులు చేసినట్లు ఆ కథనం పేర్కొంది.  దీనిపై దాదాపు 80 మంది ఇంజినీర్లు పనిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మస్క్‌ ట్వీట్లు ఈ మధ్య ట్విటర్‌లో అధికంగా కనిపిస్తున్నట్లు కథనంలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని