Twitter: 62,000 ట్విటర్‌ ఖాతాల పునరుద్ధరణకు మస్క్‌ శ్రీకారం!

Twitter: ట్విటర్‌లో మస్క్‌ తాజాగా చేపట్టిన మరో కార్యక్రమం మరింత గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నిషేధించిన దాదాపు 62 వేల ఖాతాలను పునరుద్ధరించాలని మస్క్‌ ఆదేశించారు. సిబ్బంది కొరత వల్ల ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని సమాచారం.

Published : 30 Nov 2022 18:24 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: గతంలో నిషేధించిన ట్విటర్‌ ఖాతాల పునరుద్ధరణకు మస్క్‌ శ్రీకారం చుట్టారు. దాదాపు 62 వేల ఖాతాలను ఆయన తిరిగి క్రియాశీలకంగా మార్చనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, కనీసం 10 వేల ఫాలోయర్లు ఉన్న ఖాతాలను మాత్రమే పునరుద్ధరిస్తున్నారని సమాచారం. వీటిలో ఒక ఖాతాకు 5 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారని తెలుస్తోంది. అలాగే 75 శాతం ఖాతాలకు 1 మిలియన్‌ కంటే ఎక్కువ ఫాలోయర్లు ఉన్నారట. ఇంత భారీ సంఖ్యలో ఖాతాలను పునరుద్ధరిస్తున్న ఈ ప్రక్రియను ట్విటర్‌ ఉద్యోగులు ‘బిగ్‌బ్యాంగ్‌’గా వ్యవహరిస్తున్నారని సమాచారం.

అయితే, ఈ పునరుద్ధరణ కార్యక్రమంతో ట్విటర్‌లో మరింత గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మస్క్‌ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఖాతాలను యాక్టివేట్‌ చేయడానికి చాలా మంది సిబ్బంది అవసరమవుతారని తెలుస్తోంది. యాక్టివేట్‌ చేయబోయే ఖాతాలు, వాటిని ఫాలో అవుతున్న ఖాతాలు.. ఇలా అన్నింటిలో సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుందని ఉద్యోగులు తెలిపారు. ఉదాహరణకు ఇటీవల ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఆయనకు దాదాపు 88 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. అలాంటప్పుడు 88 మిలియన్ల లిస్ట్‌లను అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం ఉంటుందని టెక్‌ నిపుణులు తెలిపారు. ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియన అని.. దీనికి పెద్దఎత్తున మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ట్విటర్‌లో నిషేధానికి గురైన ఖాతాలకు క్షమాభిక్ష మంజూరు చేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఓటింగ్‌ నిర్వహించగా.. ఎక్కువ మంది ఖాతాల్ని పునరుద్ధరించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి అనుగుణంగానే తాను ఖాతాల్ని తిరిగి యాక్టివేట్‌ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఖాతాల పునరుద్ధరణపై ప్రకటనదారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ట్విటర్‌కు ముప్పు ఉన్న ఖాతాలనే గతంలో తొలగించారని గుర్తుచేస్తున్నారు. తిరిగి వారిని ఆహ్వానించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పైగా ప్రకటనలు సైతం నిలిపివేసేందుకు సిద్ధపడుతున్నారు. ఏటా దాదాపు 100 మిలియన్‌ డాలర్ల ప్రకటనలు ఇచ్చే యాపిల్‌ సైతం ట్విటర్‌కు దూరం జరిగినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని