Elon Musk: మస్క్‌ అలిగాడు.. మార్పులు చేశారు..ట్వీట్లకు ఎంగేజ్‌మెంట్‌ వచ్చింది..

Elon Musk: బైడెన్‌ చేసిన ట్వీట్‌ కంటే తన ట్వీట్‌కు తక్కువ ఆదరణ రావడాన్ని మస్క్‌ జీర్ణించుకోలేపోయారట! వెంటనే తన ట్వీట్లకు ఎక్కువ ఎంగేజ్‌మెంట్లు వచ్చేలా మార్పులు చేయించారని సమాచారం. 

Published : 15 Feb 2023 15:03 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: తన ట్వీట్లకు పెద్దగా ఆదరణ దక్కడం లేదని ట్విటర్‌ (Twitter) అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గుర్రుగా ఉన్నారట! ఈ మేరకు తన ట్వీట్లకు ప్రాధాన్యం దక్కేలా ఏకంగా కోడింగ్‌, ఆల్గరిథమ్‌లో మార్పు చేయాలని ట్విటర్‌ (Twitter) ఇంజినీర్లను కోరారని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ ‘ప్లాట్‌ఫార్మర్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది.

అసలేం జరిగిందంటే..

ఆదివారం ఫిలడెల్ఫియా ఈగిల్స్, కాన్సాస్‌ సిటీ చీఫ్స్‌ ఫుట్‌బాల్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. మస్క్‌ (Elon Musk) ఈగిల్స్‌ను సపోర్ట్‌ చేస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌ (Biden) సైతం ఈగిల్స్‌ జట్టుకే మద్దతు పలుకుతూ ట్వీట్‌ చేశారు. మస్క్‌ (Elon Musk) ట్వీట్‌కు 90 లక్షల ఎంగేజ్‌మెంట్లు రాగా.. బైడెన్‌ (Biden) ట్వీట్‌కు ఏకంగా 2.90 కోట్ల ఎంగేజ్‌మెంట్లు వచ్చాయి. దీన్ని మస్క్‌ (Elon Musk) జీర్ణించుకోలేకపోయారట!

ఏం చేశారంటే..

వెంటనే శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఇంజినీర్లతో మస్క్‌ మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ ప్లాట్‌ఫార్మర్‌ తెలిపింది. తన ట్వీట్లకు ఎక్కువ ఎంగేజ్‌మెంట్లు వచ్చేలా వెంటనే మార్పులు చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. లేదంటే ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని హెచ్చరించారట! దీంతో ఎలాన్‌ మస్క్‌కు వరుసకు సోదరుడైన జేమ్స్‌ మస్క్‌ ఆదివారం- సోమవారం మధ్యరాత్రి 2:36 గంటలకు ఇంజినీర్లను అలర్ట్‌ చేశారని ప్లాట్‌ఫార్మర్‌ తెలిపింది. వెంటనే మస్క్‌ ట్వీట్లకు తక్కువ ఎంగేజ్‌మెంట్‌ రావడమనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని సమాచారం.

చివరకు ఎలాన్‌ మస్క్‌ ట్వీట్లకు అందరి కంటే ఎక్కువ ఎంగేజ్‌మెంట్‌ వచ్చేలా సోమవారం మధ్యాహ్నానికి కోడింగ్‌, ఆల్గరిథమ్‌లో తగు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై దాదాపు 80 మంది ఇంజినీర్లు పనిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మస్క్‌ ట్వీట్లు ఈ మధ్య ట్విటర్‌లో అధికంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త సీఈఓ అప్పుడే..

ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్‌ మస్కే సంస్థను ముందుండి నడిపిస్తున్నారు. దీనిపై ఓ దశలో విమర్శలొచ్చాయి. ఆయన దృష్టి మొత్తం ట్విటర్‌పైనే కేంద్రీకరిస్తున్నారని టెస్లా ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టారు. దీంతో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి కూడా. మరోవైపు మస్క్‌ తన విధానాలతో ట్విటర్‌ను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలూ వచ్చాయి. దీంతో కొన్ని కంపెనీలు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడానికి వెనుకాడాయి. ట్విటర్‌కు కొత్త సీఈఓను నియమిస్తే సమస్యలు సద్దుమణగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ.. మస్కే ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. తాజాగా ట్విటర్‌కు కొత్త అధిపతిని ఎప్పుడు తీసుకురానున్నారో మస్క్‌ చెప్పారు.

ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్విటర్‌లో 2023 చివరకు పరిస్థితులు చక్కబడతాయని మస్క్‌ అంచనా వేశారు. కొత్త సీఈఓకు బాధ్యతలు అప్పగించడానికి అదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అప్పటికి కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికలను సైతం సిద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. గత డిసెంబరులో ట్విటర్‌ను నడిపే తెలివితక్కువ వ్యక్తి దొరికే వరకు తానే సీఈఓ పదవిలో కొనసాగుతానని మస్క్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే తాను ట్విటర్‌ సీఈఓగా వైదొలగాలా? అని ట్విటర్‌ పోల్‌ కూడా నిర్వహించారు. దీనికి మెజారిటీ యూజర్లు వైదొలగాలని సమాధానం ఇవ్వడం గమనార్హం.

మరోవైపు కుర్చీలో కూర్చున్న ఓ శునకం ఫొటోను పోస్ట్‌ చేస్తూ ట్విటర్‌ కొత్త సీఈఓ ఇదేనని మస్క్‌ బుధవారం ట్వీట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని