Elon Musk: 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం.. సంతోషంలో మస్క్ డ్యాన్స్‌

భారీ వేతన ప్యాకేజీకి ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపిన నేపథ్యంలో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంతోషంతో డ్యాన్స్ చేశారు. 

Published : 15 Jun 2024 19:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ (Elon Musk)కు 56 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సాధారణ వార్షిక సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడటంతో.. ఆయన సంపద భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. దీనితర్వాత మస్క్‌ సంతోషంతో డ్యాన్స్ చేస్తోన్న వీడియో ఎక్స్‌లో వైరల్‌ అయింది. ఆ క్లిప్‌లో వేదిక పైన ఆయన ఎంతో సంతోషంగా కనిపించారు. అక్కడున్నవారు మస్క్‌, మస్క్‌ అంటూ కేకలు వేస్తుంటే.. స్టేజ్‌పై కాలు కదిపారు.

ఎలాన్‌ మస్క్‌ 2018లో అన్నిరకాల ప్రయోజనాలు కలిపి 55 బిలియన్‌ డాలర్ల వార్షిక వేతనం అందుకున్నారు. కార్పొరేట్‌ చరిత్రలో ఇదే అత్యధిక పారితోషికం. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలిచారు. మస్క్‌కు మరీ అధిక వేతనం చెల్లించారంటూ, టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్‌ టోర్నెట్టా.. డెలావర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్‌ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామ’ని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. అంత వేతనానికి ఆయన అనర్హుడని ఆదేశాలు ఇచ్చింది. కొద్దినెలల క్రితం వచ్చిన ఆ తీర్పు నేపథ్యంలో అదే భారీ ప్యాకేజీని ఇచ్చేందుకు ఇప్పుడు ఇన్వెస్టర్లు ఆమోదించడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని