Updated : 03 May 2022 10:47 IST

Parag Agrawal: పరాగ్‌ను పంపించేయనున్న ఎలాన్‌ మస్క్‌?

ట్విటర్‌కు కొత్త సీఈఓ రానున్నట్లు స్పష్టమైన సంకేతాలు

వాషింగ్టన్‌: ట్విటర్‌ (Twitter)ను 44 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. కొత్త సీఈఓను ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ (parag agrawal)ను ఆయన తొలగించే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ట్విటర్‌ (Twitter) ఛైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌తో ఇటీవల భేటీ అయిన మస్క్ (Elon Musk) ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటార్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం యాజమాన్యంపై తనకు ఏమాత్రం విశ్వాసం లేదని మస్క్‌ తెలిపినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు.

పరిహారంపైనా అసంతృప్తి..

గత నవంబరులో జాక్‌ డోర్సే స్థానంలో సీఈఓ బాధ్యతలు స్వీకరించిన పరాగ్‌ అగర్వాల్‌ (parag agrawal).. మస్క్‌కు కంపెనీని అధికారికంగా అప్పగించే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఒకవేళ పరాగ్‌ను సీఈఓ బాధ్యతల నుంచి 12 నెలల్లోగా తీసివేస్తే 42 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కూడా మస్క్‌ (Elon Musk) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బోర్డులోని ఇతర సభ్యుల పరిహారంపైనా మస్క్‌ (Elon Musk) అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా పరిహారాలు, వేతనాల్లో కోత ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. అయితే, పరాగ్‌ (parag agrawal) స్థానంలో ఆయన ఎవరిని నియమించనున్నారనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

విజయ గద్దెకూ ఉద్వాసన?

పరాగ్‌ (parag agrawal)తో పాటు ట్విటర్‌ లీగల్‌ హెడ్‌గా ఉన్న విజయ గద్దె (Vijaya Gadde)ను సైతం మస్క్‌ (Elon Musk) తొలగిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ తొలగిస్తే కంపెనీ ఆమెకు 12.5 మిలియన్‌ డాలర్ల పరిహారంతో పాటు షేర్లను కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో విజయ ఒకరు. అభ్యంతరకరమైన పదాలు, పోస్టులు, వాక్‌ స్వాతంత్ర్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సమయంలో విజయ (Vijaya Gadde) ట్విటర్‌ను ఓ గాడిన పెట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కీలక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు వివాదాస్పద ట్వీట్లతో ప్రజల అసహనానికి కారణమవుతున్న వారిని వేదిక నుంచి నిషేధించేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. అలా ట్విటర్‌ (Twitter) నుంచి బహిష్కరణకు గురైన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముఖ్యులు. ఇటీవల విజయ (Vijaya Gadde) ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. కంపెనీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.

ఉద్యోగుల ఆందోళన..

ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒప్పందం ఖరారైన దగ్గరి నుంచీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవితవ్యం ఏంటని పరాగ్‌ (parag agrawal)ను ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ ఉద్యోగ భద్రతపై నిలదీస్తున్నారు. అగర్వాల్ మాత్రం ఒప్పందం అధికారికంగా పూర్తయ్యే వరకు ఉద్యోగుల తొలగింపు ఉండదని హామీ ఇచ్చారు. తర్వాత కంపెనీ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఉద్యోగుల తొలగింపు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విటర్‌ యూజర్లపై ఎలాంటి ప్రభావం పడనుందనే విషయాన్ని మాత్రం కొత్త యాజమాన్యం దృష్టిలో ఉంచుకుంటుందని భావిస్తున్నానన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని