Elon Musk: చేతిలో చాలా పనుంది.. 24X7 కష్టపడుతున్నా: ఎలాన్‌ మస్క్‌

Elon Musk: ట్విటర్‌లో చాలా మార్పులు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు ఎలాన్‌ మస్క్‌. ఈ క్రమంలో ఉద్యోగులను కష్టపడి పనిచేయాలని చెప్పిన ఆయన.. తాను కూడా 24x7 పనిచేస్తున్నట్లు తెలిపారు.

Published : 14 Nov 2022 11:48 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇటీవల ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌.. దాంట్లో సమూలంగా మార్పు తీసుకురావడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయం పెంచుకోవడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరూ కష్టపడి పనిచేయాలని.. అలాగైతేనే కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఉద్యోగులకు సూచించారు. రోజుకి 12 గంటల వరకు పనిచేయాలని కోరారు. అయితే, వారికి చెప్పడమే కాదు.. తానూ కష్టపడి పనిచేస్తున్నానంటున్నాడు ఈ ప్రపంచ కుబేరుడు.

బాలిలో జరగనున్న జీ20 సదస్సు నేపథ్యంలో అక్కడ జరిగిన ఓ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ కోసం మాట్లాడుతూ.. తన చేతిలో ఇప్పుడు చాలా పని ఉందని చెప్పారు. మాట్లాడుతున్న సమయంలో తాను ఉన్న ప్రదేశంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. ఆయన కొవ్వొత్తుల వెలుతురులో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపించిందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వారంలో ఏడు రోజులు.. ఉదయం నుంచి రాత్రి వరకు విరామం లేకుండా పనిచేస్తున్నట్లు మస్క్‌ తెలిపారు.

టెస్లాకు కూడా సీఈఓగా వ్యవహరిస్తున్న ఎలాన్ మస్క్‌.. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ట్విటర్‌ కోసమే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టెస్లా షేర్‌హోల్డర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. మస్క్‌ ట్విటర్‌ ధ్యాసలో పడి టెస్లాను ఏమైనా నిర్లక్ష్యం చేస్తారేమోనని ఇన్వెస్టర్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బాలిలో జీ20 సదస్సులో టెస్లా, స్పేస్‌ఎక్స్‌తో ఇండోనేసియా పలు ఒప్పందాలు చేసుకునే యోచనలో ఉంది.

క్షమాపణ చెప్పిన మస్క్‌..

కొన్ని దేశాల్లో ట్విటర్‌ చాలా నెమ్మదిగా పనిచేస్తోందని ఎలాన్‌ మస్క్‌ స్వయంగా తెలిపారు. అందుకు ఆయన యూజర్లను క్షమాపణ కోరారు. మరోవైపు ‘ట్విటర్‌ బ్లూ’ని తిరిగి పునరుద్ధరించడంలో భాగంగా కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు మస్క్‌ తెలిపారు. ఏయే ఇతర ట్విటర్‌ ఖాతాలు తమతో అసోసియేట్‌ అయి ఉన్నాయో గుర్తించేలా కంపెనీలు, సంస్థలకు అధికారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని