Twitter: ట్విటర్‌లో కొనసాగుతున్న లేఆఫ్‌లు.. మరో 4400 మంది తొలగింపు..!

ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ట్విటర్‌లో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌. తాజాగా ఔట్‌సోర్సింగ్‌ విభాగంలో పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ప్రకటించినట్లు తెలుస్తోంది.

Updated : 14 Nov 2022 12:24 IST

శాన్‌ ఫ్రాన్సిస్కో: కొత్త యజమాని ఎలాన్ మస్క్‌ నేతృత్వంలో ట్విటర్‌లో ఉద్యోగుల లేఆఫ్‌ కొనసాగుతోంది. ఈ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే ట్విటర్‌లో దాదాపు సగం మంది ఉద్యోగులకు మస్క్‌ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఔట్‌సోర్సింగ్‌ విభాగంలోనూ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులుండగా.. వీరిలో 4400 మందిని ట్విటర్‌ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించినట్లు సమాచారం. కంపెనీ ఇ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విటర్‌ ఆఫీసుల్లో ఈ లేఆఫ్‌లు ఉన్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. ట్విటర్‌కు చెందిన కంటెంట్‌ మాడరేషన్, రియల్‌ ఎస్టేట్‌, మార్కెటింగ్, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. వీరిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారట. అయితే తాజా కోతలపై ట్విటర్‌ నుంచి గానీ, ఎలాన్ మస్క్‌ నుంచి గానీ అధికారిక ప్రకటనేదీ రాలేదు.

సాధారణంగా ట్విటర్‌, ఇతర సోషల్‌మీడియా సంస్థలు తమ మాధ్యమంలో విద్వేష, ఇతర హానికర కంటెంట్‌ను కనిపెట్టి ట్రాక్‌ చేసేందుకు కాంట్రాక్టర్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. ఔట్‌సోర్సింగ్‌ విభాగాల ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కంటెంట్ మాడరేషన్ కోసం ఉద్యోగులను నియమించుకుంటాయి. దీంతో పాటు మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. అయితే తాజాగా కంటెంట్‌ మోడరేషన్‌లోనే ఎక్కువ మందిని తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ట్విటర్‌లో విద్వేష వ్యాప్తి పెరిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని