Income Tax: ఈ ప‌న్ను మిన‌హాయింపుల గురించి మీకు తెలుసా?

ప‌న్ను చెల్లింపుదారులు తమ‌కు అర్హ‌త ఉన్న మిన‌హాయింపులను తెలుసుకుని ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేస్తే.. చాలా వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

Updated : 15 Aug 2022 11:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొన్ని మినహాయింపులు ఇస్తోంది. సెక్ష‌న్ 80సి కింద గృహ రుణ (అస‌లు) చెల్లింపులు, జీవిత బీమా ప్రీమియం; సెక్ష‌న్ 80డి కింద‌ ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపులను అందిస్తోంది. వీటి గురించి ప‌న్ను చెల్లింపుదారుల్లో చాలా మందికి అవ‌గాహ‌న ఉంటుంది. ఇవే సెక్ష‌న్ల కింద‌ మరికొన్ని పన్ను మినహాయింపులు పొందే అవకాశాన్ని ఐటీ శాఖ కల్పిస్తోంది. వీటి గురించి కొద్ది మందికి మాత్ర‌మే అవగాహన ఉంది. ఆ మిన‌హాయింపుల గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం..

సెక్ష‌న్ 80సీ..
స్టాంప్ డ్యూటీపై: గృహ రుణం కోసం చెల్లించే ఈఎంఐలో అస‌లు, వ‌డ్డీ రెండూ ఉంటాయి. అస‌లు చెల్లింపుల‌పై సెక్ష‌న్ 80సి కింద రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు, వ‌డ్డీ చెల్లింపులై సెక్ష‌న్ 24 (బి) కింద రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందొచ్చ‌ని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే, ఇల్లు కొనుగోలు చేసిన‌ప్పుడు రిజిస్ట్రేష‌న్ కోసం చెల్లించే స్టాంప్‌డ్యూటీపై కూడా మిన‌హాయింపు పొందొచ్చు. సెక్ష‌న్ 80సి కింద స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఈ సెక్ష‌న్ కింద‌కి వ‌చ్చే రూ. 1.50 ల‌క్ష‌ల ప‌రిమితి వ‌ర‌కు మాత్ర‌మే మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా ఖ‌ర్చు చేసిన ఆర్థిక సంవ‌త్స‌రంలో మాత్ర‌మే ఇవి క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. 

జాతీయ పొదుపు ప‌త్రాలు (ఎన్ఎస్‌సీ): సెక్ష‌న్ 80సి కింద ఎన్ఎస్‌సీలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తానికి మాత్ర‌మే చాలా మంది మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకుంటారు. అయితే తిరిగి పెట్టుబ‌డి పెట్టే వ‌డ్డీ మొత్తానికి మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోరు. ఎన్ఎస్‌సీలో మెచ్యూరిటీకి 5 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటుంది. ఈ కాల‌వ్య‌వ‌ధిలో ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌చ్చే వ‌డ్డీని తిరిగి పెట్టుబ‌డి పెడుతుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు మొద‌టి సంవ‌త్స‌రం మీరు రూ.1,00,000 పెట్టుబ‌డి పెడితే.. అంతే మొత్తంపై మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే రెండో సంవ‌త్స‌రం వ‌చ్చేస‌రికి రూ.1,00,000పై వచ్చిన వ‌డ్డీ రూ.6800ని తిరిగి పెట్టుబ‌డి పెడ‌తారు. కాబ‌ట్టి రెండో సంవ‌త్స‌రం రూ.1,06,800పై మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అలాగే, మూడో సంవ‌త్స‌రం రూ.1,14,062 ఇలా మిన‌హాయింపు పొందొచ్చు. అయితే, సెక్ష‌న్ 80సి కింద ఉన్న ప‌రిమితి రూ.1.50 ల‌క్ష‌లను మించ‌కూడ‌దు.

సెక్ష‌న్ 80డి..
ముంద‌స్తు వైద్య ప‌రీక్ష‌లు: ఆరోగ్య బీమా కోసం..60ఏళ్ల లోపు వ‌య‌సు వారి పాల‌సీ ప్రీమియంపై రూ.25 వేలు, 60 ఏళ్ల పైబ‌డిన వారికి చెల్లించే ప్రీమియంల‌పై రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిసిందే. అయితే ముంద‌స్తు వైద్య ప‌రీక్ష‌ల‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను కూడా రూ.5 వేల వ‌ర‌కు (న‌గ‌దు రూపంలో చెల్లించిన‌ప్ప‌టికీ) ఇదే సెక్ష‌న్ కింద క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే, మొత్తం మిన‌హాయింపు సెక్ష‌న్ 80డి కిందకి వ‌చ్చే ప‌రిమితిలోపే ఉండాలి.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు. ఆరోగ్య బీమా ప్రీమియం రూ.22 వేలు చెల్లిస్తున్నాడు. అలాగే త‌న‌తో పాటు భార్య పిల్ల‌ల ఆరోగ్య ప‌రీక్ష‌ల కోసం అతడికి రూ.5 వేలు ఖ‌ర్చయ్యింది అనుకుంటే.. ఈ సంద‌ర్భంలో అత‌డు మొత్తం అందుబాటులో ఉన్న రూ.25 వేల వ‌ర‌కు త‌గ్గింపును క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

త‌ల్లిదండ్రుల వైద్య ఖ‌ర్చులు: 60 సంవ‌త్సరాలు, అంత‌కంటే ఎక్కువ వ‌యసున్న త‌ల్లిదండ్రులు ఆరోగ్య బీమా క‌వ‌రేజ్ లేన‌ప్పుడు, వైద్య బిల్లుల‌కు చేసే ఖర్చుల‌ను సెక్ష‌న్ 80డి కింద రూ.50 వేల వ‌ర‌కు ప‌న్నుచెల్లింపుదారులు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే, న‌గ‌దు రూపంలో చెల్లిస్తే త‌గిన ఆధారాల‌ను చూపించాల్సి ఉంటుంది.

సెక్ష‌న్ 80ఈ (విద్యారుణం)..
ప‌న్ను చెల్లింపుదారులు, త‌మ కోసం, భార్య పిల్లల చ‌దువు కోసం రుణం తీసుకుని ఉంటే.. రుణ వ‌డ్డీ చెల్లింపుల‌పై సెక్ష‌న్ 80ఈ కింద ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. దీనిపై గ‌రిష్ఠ ప‌రిమితి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని