Mutual Funds: మార్కెట్ల హెచ్చుత‌గ్గుల స‌మ‌యంలో పెట్టుబ‌డులు వెన‌క్కి తీసుకోవ‌చ్చా?

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబడుల ముందు మ‌దుపుర్లు ప్ర‌ధానంగా వారి రిస్క్ ప్రొఫైల్‌పై దృష్టి పెట్టాలి.  

Updated : 26 Feb 2022 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోన‌వ‌తున్నాయి. మ‌రికొన్ని రోజులు ఈ ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి వార్త‌లు విన్న‌ప్పుడు అనుభ‌వం లేని మ‌దుప‌ర్లు ఎక్కువ‌గా ఆందోళ‌న చెంది తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల‌తో పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుని ఎక్కువ‌గా న‌ష్ట‌పోతుంటారు.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో కొత్త‌గా పెట్టుబ‌డులు ప్రారంభించిన వారికి ఈక్విటీ ఫండ్ల గురించి ప్రాథ‌మిక అవ‌గాహ‌న ఉండాలి. లేదంటే మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు ఒక పీడ‌క‌ల‌గా మిగిలిపోయే ప్ర‌మాదం ఉంది. మ్యూచ్‌వ‌ల్ ఫండ్లు మార్కెట్ రిస్కుల‌కు లోబ‌డి ఉంటాయి. అందువ‌ల్ల మదుప‌రులు ముందుగా వారి వారి రిస్క్ ప్రొఫైల్‌ను తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. దీంతో పాటు స‌రైన ఆస్తి కేటాయింపు (ఎసెట్ అలోకేష‌న్‌), ప‌రిమితంగా పోర్ట్‌ఫోలియో స‌మీక్షించ‌డం, పెట్టుబ‌డుల‌లో క్ర‌మ‌శిక్ష‌ణ వంటివి అవ‌స‌రం. మ్యూచ్‌వ‌ల్ ఫండ్ల విష‌యంలో ఇత‌రుల‌ను అనుస‌రించాలని అనుకోవ‌డం మంచిది కాద‌ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసే వారు పెట్టుబ‌డుల‌కు ముందు కొన్ని నియ‌మాల‌ను అర్థం చేసుకోవాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డికి సంబంధించిన నిర్ణ‌యం తీసుకునే ముందు మ‌దుపర్లు ప్ర‌ధానంగా వారి రిస్క్ ప్రొఫైల్‌పై దృష్టిపెట్టాలి. న‌ష్ట‌భ‌యం వేరు వేరు వ్య‌క్తుల‌కు వేరు వేరుగా ఉంటుంది. కొంద‌రు అధిక రిస్క్ తీసుకోగ‌లిగితే, మ‌రికొంద‌రు మ‌ధ్య‌స్థంగా, ఇంకొంద‌రు త‌క్కువగా రిస్క్ తీసుకోగ‌లుగుతారు. ఇది మ‌దుప‌ర్ల ఆర్థిక స్థితి, ల‌క్ష్యం, వయసు, కుటుంబ బాధ్యతలు, ఆదాయం, పెట్టుబడులతో ఉన్న అనుభవం, రాబడులను అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయం తీసుకోగల నేర్పు, భావోద్వేగాలు వంటి ప‌లు అంశాల‌తో ముడిపడి ఉంటుంది. మ‌దుప‌రి ఒక్క‌సారి తన రిస్క్ సామ‌ర్థ్యం గురించి తెలుసుకుంటే పెట్టుబ‌డులు ఎక్క‌డెక్క‌డ పెట్ట‌చ్చో ఒక అవ‌గాహ‌నకు రావ‌చ్చు. దీన్ని ఆస్తి కేటాయింపు (ఎసెట్ అలోకేష‌న్‌) అంటారు. ఈక్విటీ మ్యూచ్‌వ‌ల్ ఫండ్స్‌లో స్మాల్ - క్యాప్‌, మిడ్ - క్యాప్‌, లార్జ్ - క్యాప్‌ మొదలైన కేటగిరీలు ఉంటాయి. మ‌దుప‌రి తన రిస్క్ సామ‌ర్థ్యం ఆధారంగా వైవిధ్య‌భ‌రితంగా ఆస్తి కేటాయింపులు చేయాలి.

హెచ్చుత‌గ్గుల స‌మ‌యంలో పెట్టుబ‌డులు వ్యూహం ఎలా ఉండాలి?
మార్కెట్లో హెచ్చుత‌గ్గులు స‌ర్వ‌సాధారణం. స్మాల్ క్యాప్ ఫండ్లు బుల్‌, బేర్ మార్కెట్లు రెండింటిలోనూ అధిక అస్థిరత‌తో ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్ల‌లో అస్థిర‌త త‌క్కువ‌గా ఉంటుంది. మార్కెట్లో బుల్‌, బేర్ క‌ద‌లిక‌ల‌ను అనుస‌రించి స్మాల్ క్యాప్‌, లార్జ్ క్యాప్ పెట్టుబడులను పెంచ‌వ‌చ్చు లేదా త‌గ్గించ‌వ‌చ్చు.

సిప్ ద్వారా ప్ర‌తి నెలా కొంత మొత్తం కేటాయిస్తే బుల్ మార్కెట్లో ఎక్కువ ధ‌ర వ‌ల్ల త‌క్కువ యూనిట్లు, బేర్ మార్కెట్లో త‌క్కువ ధ‌ర వ‌ల్ల ఎక్కువ యూనిట్లు పొందుతారు. దీంతో న‌ష్ట భ‌యాన్ని త‌గ్గించుకుని దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్లలో సిప్‌ ద్వారా పెట్టుబ‌డి పెట్టేవారు 15- 15- 15 రూల్‌ని అనుస‌రించ‌డం ద్వారా రూ.కోటి సంప‌ద‌ను కూడ‌బెట్టొచ్చు.

ఏమిటీ 15-15-15 రూల్‌?
ఈ రూల్‌లో ‘15’ను మూడు సార్లు ఉప‌యోగిస్తున్నాం. ఇది వృద్ధి రేటు, కాల‌వ్యవధి, నెలవారీ మనం చేయాల్సిన పొద‌పు మొత్తాన్ని సూచిస్తుంది. 15 శాతం రాబ‌డి అంచ‌నాతో 15 సంవ‌త్సరాల్లో (180 నెల‌లు) రూ.1 కోటి స‌మ‌కూర్చుకునేందుకు ప్రతి నెలా రూ. 15000 ఆదా చేయాల్సి ఉంటుంది. మ‌రోవిధంగా చెప్పాలంటే.. ప్రతి నెలా మీరు రూ. 15000 పెట్టుబ‌డి పెట్టగలిగితే.. 15 సంవత్సరాల్లో 15 శాతం రాబ‌డి అంచ‌నాతో కోటి రూపాయ‌ల ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లుగుతారు. 

  • కావ‌ల‌సిన సంప‌ద‌: రూ.1 కోటి
  • 15 సంవత్సరాల్లో మీరు మదుపు చేసే మొత్తం: రూ.27,00,000
  • రాబ‌డి (15 శాతం వార్షిక అంచ‌నాతో): రూ.74,52,946
  • మొత్తం: రూ.1,01,52,946

ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం దీర్ఘకాలం పాటు పొదుపు చేసేందుకు ఈ నియ‌మం పనికొస్తుంది. మీరు 12 శాతం వార్షిక రాబ‌డి అంచ‌నాను కూడా తీసుకోవ‌చ్చు. అయితే, పెద్ద మొత్తంలో కార్పస్‌ ఏర్పాటు చేసేందుకు స్టెప్‌- అప్ సిప్‌ విధానాన్ని అనుస‌రించాల్సి ఉంటుంది. అంటే, 12 శాతం సగటు రాబడి అంచనా ప్రకారం రూ.15 వేలతో సిప్ ప్రారంభించి ఏటా 7 శాతం చొప్పున పెంచుతూ వెళితే 15 ఏళ్లకు రూ.కోటి సమకూర్చుకోవచ్చు. ఒక ల‌క్ష్యం కోసం మ‌దుపు చేసేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని కావలిసిన మొత్తాన్ని లెక్కించాలి. దాని ప్రకారమే మదుపు చేయడం ప్రారంభించాలి. 15-15-15 రూల్ అనుస‌రించ‌డం ద్వారా పొదుపు అల‌వాటును పెంచుకుంటారు. అలాగే, సిప్‌తో పాటు మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు కొంత అద‌న‌పు మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం వల్ల అధిక యూనిట్స్ సమకూర్చుకోవచ్చు.

పెట్టుబ‌డుల క్ర‌మ‌శిక్ష‌ణ‌, స‌మీక్ష‌..
రిస్క్ తీసుకోగ‌ల‌ సామ‌ర్థ్యం తెలుసుకుని దానికి త‌గిన‌ట్లు ఆస్తి కేటాయింపులు చేయ‌డం ఎంత ముఖ్య‌మో, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గ‌డం, పెట్టుబ‌డుల పునః స‌మీక్ష కూడా అంతే కీల‌కం. క్ర‌మానుగ‌త స‌మీక్ష అవ‌స‌రం అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌తి రోజూ స‌మీక్షించ‌డం స‌రికాద‌ని నిపుణులు సూచిస్తున్నారు. 3 నెల‌ల‌కు, 6 నెల‌ల‌కు ఒక‌సారి స‌మీక్షించుకోవ‌చ్చు. కాలంతో పాటు వృద్ధి చెంద‌ని పెట్టుబ‌డుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కొత్త పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌చ్చు. అలాగే, మార్కెట్లు లాభాల్లో ఉన్నా, న‌ష్టాల్లో ఉన్నా క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టాలి. ఒకరి పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తున్నప్పుడు, బెంచ్ మార్క్‌తో పోల్చి చూడడం మంచిది. బెంచ్ మార్క్ సూచీ కంటే తక్కువ రాబడి ఉన్న వాటి నుంచి వైదొలగడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని