Mutual funds: మదుపర్లకు అలర్ట్‌.. అందుకు మార్చి 31 ఆఖరు తేదీ

Mutual funds: మార్చి 31 పూర్తయ్యే నాటికి మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేయాలి. లేదంటే ఖాతాలు స్తంభించిపోతాయి.

Published : 26 Mar 2023 14:08 IST

దిల్లీ: మార్చి 31 పూర్తయ్యే నాటికి మ్యూచువల్‌ ఫండ్‌ మదుపర్లు నామినీని తప్పనిసరిగా ఎంపిక చేయాలి. లేదా నామినీ అవసరం లేదనైనా డిక్లషరేషన్‌ సమర్పించాలి. లేదంటే వారి ఖాతాలు స్తంభించిపోతాయి. ఫలితంగా అప్పటి వరకు చేసిన పెట్టుబడి, దానిపై వచ్చే రాబడిని తిరిగి పొందడం కుదరదు.

గత ఏడాది జూన్‌ 15నే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. నామినీని ఎంపిక చేయడం లేదా అవసరం లేదనైనా డిక్లరేషన్‌ సమర్పించాలని సూచించింది. దీనికి 2022 ఆగస్టు 1వ తేదీని గడువుగా విధించింది. తర్వాత రెండు దఫాల్లో ఈ గడువును 2023 మార్చి 31 వరకు పొడిగించింది.

గతంలో ఎంఎఫ్‌ ఖాతాలను తెరిచేటప్పుడు చాలా మంది నామినీలను ఎంపిక చేయలేదని ఆనంద్‌ రాఠీ వెల్త్‌ లిమిటెడ్‌ సీఓఓ నిరంజన్‌ బాబు తెలిపారు. ఫలితంగా వారికి ఏమైనా అయితే, సొమ్మును క్లెయిం చేసుకోవడానికి వారి చట్టబద్ధమైన వారసులకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని వివరించారు. కొంత మంది అసలు తాము ఎంఎఫ్‌ ఖాతాలు తెరిచినట్లు కూడా ఇంట్లో చెప్పడం లేదని పేర్కొన్నారు. ఈ కారణాల వల్లే పెద్ద మొత్తంలో నిధులు పేరుకుపోతున్నాయని వివరించారు. దీనికి పరిష్కారంగానే నామినీని తప్పనిసరి చేస్తూ సెబీ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

నామినీలను ఎంపిక లేదా అవసరం లేదని డిక్లరేషన్‌ సమర్పించడానికి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు తమ కస్టమర్లకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సెబీ ఆదేశించింది. ఆన్‌లైన్‌ లేదా నేరుగా వచ్చి సంబంధిత పత్రాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని సూచించింది. ఒకవేళ ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించే వారి గోప్యతను రక్షించాల్సిన బాధ్యత కంపెనీలదేనని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని