Narayana Murthy: అందుకే.. ఉదయం 6:20 గంటలకే ఆఫీస్‌కు వెళ్లేవాడిని!

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సమయపాలన ఆవశ్యకతను వెల్లడించారు. ఒక వ్యాపారవేత్తగా అహర్నిశలు శ్రమించే క్రమంలో కొన్ని త్యాగాలు చేయాల్సివస్తుందన్నారు. 

Updated : 29 Dec 2022 17:01 IST

దిల్లీ: జీవితంలో ఎత్తుపల్లాలు చూసి, ఉన్నతస్థాయికి చేరుకున్న వ్యక్తుల మాటలు యువతకు స్ఫూర్తినిస్తుంటాయి.  ప్రముఖ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సమయపాలన, తన వృత్తి జీవితం గురించి వెల్లడించారు. 

‘ఇన్ఫోసిస్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నంత కాలం ఉదయం 6:20 గంటలకే కార్యాలయానికి వెళ్లేవాడిని. రాత్రి 8-9 గంటలకు వరకు అదే నా ప్రపంచం. మన సమయపాలన యువతపై చెరగని ముద్ర వేస్తుందని ఆ సమయంలో నేను గ్రహించాను. సంస్థ కోసం నేను వెచ్చించిన సమయం నా కుటుంబంపై ప్రభావం చూపింది. ఒక వ్యాపారవేత్తగా ఉండాలంటే ధైర్యం కావాలి. ఇందులో త్యాగాలు ఉంటాయి. ఇంతకుముందులేని దానిని సృష్టించాలంటే దానికి అంతులేని కృషి కావాలి. ఎంతో నిబద్ధత అవసరం. నేను గతంలో చెప్పినట్టుగా.. గొప్ప కీర్తి సంపాదించే దిశగా అడుగులు వేసే సమయంలో చిన్నచిన్న విజయాలు అమితమైన శక్తి, ఆత్మవిశ్వాసం, సంతోషాన్ని ఇస్తాయి. కానీ ఈ క్రమంలో ఒక రకంగా అసంతృప్తికి గురయ్యేవారు పిల్లలే’ అంటూ తన సంతానం అక్షత,రోహన్‌ గురించి ప్రస్తావించారు.   

‘చాలా అరుదుగా నేను ఇంటికి సరైన సమయానికి వెళ్లేవాడిని. అప్పటికే పిల్లలు హోం వర్క్ పూర్తిచేసుకొని ఉండేవారు. వారిని బయటకు తీసుకెళ్లి పిజ్జాలు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ఇంకా కోరుకున్నవి కొనిచ్చేవాళ్లం’ అని వారితో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఇతరుల భాగస్వామ్యంతో 1981లో నారాయణమూర్తి  భారత్‌ టెక్‌ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. ఇది గత ఏడాది మార్కెట్ విలువపరంగా 100 బిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరిన నాలుగో భారతీయ సంస్థగా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని