National Mathematics Day:  పెట్టుబ‌డుల‌లో ఈ లెక్క‌లు అవ‌స‌రం. 

సంపాద‌న మొదలైన‌ప్ప‌టి నుంచే పెట్టుబడులు పెట్ట‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలం స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి మంచి రాబ‌డిని సాధించ‌వ‌చ్చు.

Published : 22 Dec 2021 16:27 IST

సంపద సృష్టించాలంటే.. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ఒక్కటే మార్గం. సంపాద‌న మొదలైన‌ప్ప‌టి నుంచే పెట్టుబడులు పెట్ట‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలం స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి మంచి రాబ‌డిని సాధించ‌వ‌చ్చు. కొంత‌ ఆల‌స్యంగా పెట్టుబ‌డులు మొద‌లు పెట్టిన‌ప్ప‌టికీ ల‌క్ష్యాల‌ను సాధించ‌వ‌చ్చు. అయితే, పెట్టుబ‌డుల విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మ‌దుపు చేసేముందు ఈ కింది అంశాల‌ను లెక్కిస్తే, మ‌రింత స‌మ‌ర్థవంతంగా పెట్టుబ‌డ‌ల ప్ర‌ణాళికను రూపొందించే అవ‌కాశం ఉంటుంది. 

కాంపౌండ్ ఇంట్రెస్ట్..
డ‌బ్బుకు సంబంధించిన విష‌యాల‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఎక్కువ‌గా వింటుంటాం. పెట్టుబ‌డుల విష‌యంలో చ‌క్ర‌వ‌డ్డీ మీ బెస్ట్ ఫ్రండ్ లాంటిది. ఇది పెట్టుబ‌డుల‌ను త్వ‌ర‌గా వృద్ధి చేస్తుంది. పెట్టుబ‌డుల‌పై కాంపౌండ్ పిరియ‌డ్ చివ‌రిన వ‌చ్చే రాబ‌డిపై రాబ‌డిని తెచ్చిపెడుతుంది. అందువ‌ల్ల దీనిని “మిరాకిల్ ఆఫ్ కాంపౌండింగ్” అని కూడా పిలుస్తారు. రోజువారి, నెల‌వారి, త్రైమాసికంగా, అర్థ‌మాసికంగా, వార్షికంగా ఇలా కాంపౌండింగ్ పిరియ‌డ్‌లు ఉంటాయి. ఎంత త‌క్కువ కాంపౌండింగ్ పిరియ‌డ్ ఉంటే అంత ఎక్కువ రాబ‌డిని పొందే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌ను ఎంచుకునేట‌ప్పుడు కాంపౌండింగ్ ఉన్న వాటిని ఎంచుకునేందుకు ప్ర‌య‌త్నించండి. ఉదాహ‌ర‌ణ‌కి మీరు రూ. 1 ల‌క్ష రూపాయ‌ల‌ను 10 శాతం వ‌డ్డీతో 5 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి పెట్టారనుకుందాం. దీంతో సాధార‌ణ వ‌డ్డీతో రూ. 50 వేలు రాబ‌డి వ‌స్తుంది. అదే వార్షిక కాంపౌండ్‌తో పెట్టుబ‌డి పెడితే 5 సంవ‌త్స‌రాల‌కు రూ. 61,051 వ‌డ్డీ వ‌స్తుంది. 

ద్రవ్యోల్బణం..
ఆర్థిక ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు మ‌దుప‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన ముఖ్య‌మైన అంశం ద్రవ్యోల్బణం. ఇది రూపాయి విలువ‌ను త‌గ్గిస్తుంది. 10 సంవ‌త్స‌రాల క్రితం వ‌స్తువును ఇప్పుడు అదే ధ‌ర‌కు కొన‌లేక‌పోవ‌డానికి కార‌ణం ద్రవ్యోల్బణం. ఉదాహ‌ర‌ణ‌కి, మీ కుటుంబ‌ నెల‌వారి అవ‌స‌రాల‌కు ఇప్పుడు రూ. 25000 కావాల్సి వ‌స్తే ఇదే నెల‌వారి అవ‌స‌రాల‌కు 20 సంవ‌త్స‌రాల త‌రువాత దాదాపు రూ.80,000 (ద్రవ్యోల్బణం 6 శాతం తీసుకుంటే) అవ‌స‌రమ‌వుతాయి. అలాగే రాబోయే కాలంలో విద్యా ద్ర‌వ్యోల్భ‌ణం 8-10 శాతం వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. అందువ‌ల్ల దీర్ఘ‌కాల ఆర్ధిక ల‌క్ష్యాల‌కు ప్ర‌ణాళిక చేసేప్పుడు భ‌విష్య‌త్తు ద్రవ్యోల్బణం లెక్కించి, భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు స‌రిపోయే విధంగా ఆర్ధిక ప్ర‌ణాళిక ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆర్థిక ల‌క్ష్యాన్ని బ‌ట్టి ద్రవ్యోల్బణాన్ని లెక్కించాలి. 

రుణ ఈఎమ్ఐ..
ఈ రోజుల్లో చాలా మంది విలువైన వ‌స్తువుల‌ను ఈఎమ్ఐలోనే కొనుగోలు చేస్తున్నారు. ఎదైనా వ‌స్తువును కొనుగోలు చేసే ముందు ఈఎమ్ఐలో కొనుగోలు చేయ‌డం వ‌ల్ల నెల‌వారిగా ఎంత చెల్లించాలి, వ‌డ్డీ ఎంత ప‌డుతుంది, హిడెన్ ఛార్జీలు ఎమైనా ప‌డుతున్న‌యా, ఎంత కాల‌వ్య‌వ‌ధి ఎంచుకుంటే ఎంత ఈఎమ్ఐ క‌ట్టాలి ఇలాంటి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. గృహ రుణం, కారు, వ్య‌క్తిగ‌త రుణాల విష‌యంలో ఈ కాలిక్యులేష‌న్స్ ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీర్ఘ‌కాలిక రుణాల విష‌యంలో వ‌డ్డీ రేటు, కాల‌వ్య‌వ‌ధులు, మీరు తీసుకున్న రుణ మొత్తం ఆధారంగా ఎంత ఈఎమ్ఐ చెల్లించాల్సి వ‌స్తుందో ముందుగానే లెక్కిస్తే, దానికి త‌గిన‌ట్లు మీ ఆదాయ‌, పెట్టుబ‌డులను ప్లాన్ చేసుకోవ‌చ్చు. రుణాలకు చెల్లించే ఈఎంఐలు అన్నీ కలిపి 30-35 శాతం ఉండవచ్చు. ఇంతకంటే మించితే ఇతర లక్ష్యాల కోసం పొదుపు చేయడం కష్టతరం అవుతుంది.

రూల్ 72..
ఇది ఓ సాధారణ గణిత సూత్రం. ఒక నిర్దిష్టమైన రాబడి ఇచ్చే పథకంలో మనం పెట్టే పెట్టుబడి ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుందో ఈ రూల్ చెబుతుంది. ఇందుకు 72ని ప‌థ‌కం ఇచ్చే వడ్డీరేటుతో భాగిస్తే సరిపోతుంది. ఉదాహరణకు 5 శాతం రాబడి ఇచ్చే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ.లక్ష పెట్టారు అనుకుందాం. ఈ లక్ష రూపాయలు 2 లక్షలు కావడానికి ఎన్నేళ్లు ప‌డుతుందో తెలియాలంటే 72ని 5తో భాగిస్తే సరిపోతుంది. (72/5) = 14.4 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మీరు స్టాక్‌ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడి సగటున 10 శాతం రాబడి ఇస్తుంటే (72/10) 7.2 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు అవుతుంది. ఈ సూత్రాన్ని రివర్స్‌ చేస్తే.. ఒక నిర్దిష్టమైన సమయంలో మన పెట్టుబడి రెట్టింపు కావాలంటే ఎంత రాబడి రావాలో కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మీ దగ్గరున్న డబ్బు ఆరేళ్ల‌లో రెట్టింపు కావాలని అనుకుంటే.. 72ని ఆరుతో భాగించండి. (72/6) = 12. అంటే 12 శాతం రాబడి వస్తే మీ పెట్టుబడి ఆరేళ్లలో రెండింతలు అవుతుంది.

ప‌న్ను త‌రువాత వ‌చ్చే ఆదాయం.. 
పెట్టుబ‌డుల‌పై వ‌ర్తించే ప‌న్నులు..వ‌చ్చే రాబ‌డిపై ప్ర‌భావం చూపుతాయి. కొన్ని పెట్టుబ‌డుల్లో వ‌డ్డీ ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తే, కొన్నింటిలో మెచ్యూరిటి మొత్తంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. మ‌రికొన్నింటిని మెచ్యూరిటి వ‌ర‌కు కొన‌సాగిస్తే ప‌న్ను వ‌ర్తించ‌దు. పెట్టుబ‌డుల‌ను ఎంచుకునేట‌ప్పుడు ప‌న్ను ఏ విధంగా వ‌ర్తిస్తుందో తెలుసుకోవాలి. వ‌డ్డీ రేట్లు అధికంగా ఉన్న‌ప్ప‌టికి, ప‌న్ను వ‌ర్తిస్తే, చివ‌రికి చేతికి అందే మొత్తం త‌గ్గిపోతుంది. అందువ‌ల్ల తుది రాబ‌డి త‌గ్గ‌కుండా ప‌న్ను త‌రువాత వ‌చ్చే ఆదాయాన్ని లెక్కించి మ‌దుపు చేయాలి. 

సిప్ భ‌విష్య‌త్తు విలువ‌..
ల‌క్ష్య సాధ‌న కోసం ప్ర‌తీ నెల కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటాం. ఆ మొత్తం భ‌విష్య‌త్తులో ల‌క్ష్య సాధన‌కు స‌రిపోతుందా.. లేదా.. త‌ప్ప‌క తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు, మీ పిల్ల‌ల ఉన్న‌త విద్య‌కు 10ఏళ్ల త‌రువాత రూ.30 ల‌క్ష‌లు కావాల‌నుకుందాం. మీరు ప్ర‌స్తుతం నెల‌కు రూ.10 వేలు, 12 శాతం రాబ‌డి అంచ‌నాతో మ‌దుపు చేస్తున్నారు అనుకుందాం. ఈ మొత్తం మీ ల‌క్ష్య సాధ‌న‌కు స‌రిపోతుందా, లేదా తెలుసుకోవాలి. పైన తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ల‌క్ష్యం చేరుకునే స‌మ‌యానికి మీకు అందే మొత్తం దాదాపు రూ. 23 ల‌క్ష‌లు. ఇది మీరు అనుకున్న దానికంటే త‌క్కువ‌, పైగా మీరు అంచ‌నా వేసిన రాబ‌డిని మీ సిప్ ఇవ్వ‌లేక‌పోతే ఈ విలువ ఇంకా త‌గ్గుతుంది. ఇలా లెక్కించ‌డం వ‌ల్ల మ‌రికొంత మొత్తాన్ని మీ పెట్టుబ‌డుల‌కు జోడించి మీ ల‌క్ష్య సాధన‌కు కావ‌ల‌సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోగ‌లుగుతారు. 

చివ‌రిగా..
పైన తెలిపిన ప్ర‌కారం పెట్టుబ‌డులు చేసేటప్పుడు ఈ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని పెట్టుబ‌డుల నుంచి వ‌చ్చే రాబ‌డి లెక్కించాలి. వీటికి సంబంధించిన కాలిక్యులేట‌ర్లు ఆన్‌లైన్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ముందే లెక్కించ‌డం వ‌ల్ల మీరు మ‌దుపు చేసిన డ‌బ్బు భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా ఉందా.. అనేది తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని