Google Vs CCI: 10 శాతం జరిమానా చెల్లించండి.. గూగుల్‌కు NCLAT ఆదేశం

NCLAT On CCI penalty: సీసీఐ విధించిన జరిమానాలో 10 శాతం మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని ఎన్‌సీఎల్‌ఏటీ గూగుల్‌ను ఆదేశించింది. పూర్తి స్టే నిరాకరించింది. 

Updated : 04 Jan 2023 17:13 IST

దిల్లీ: కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) విధించిన రూ.1337.76 కోట్ల జరిమానాలో 10 శాతం మొత్తాన్ని చెల్లించాలని ది నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (NCLAT) గూగుల్‌ను ఆదేశించింది. గూగుల్‌ అప్పీల్‌ను విచారణకు స్వీకరించిన ఇద్దరు సభ్యుల బెంచ్‌.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఇతరుల వాదనలు కూడా విన్నాక పూర్తి స్థాయి ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సీసీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది.
 
ఆండ్రాయిడ్‌ మొబైల్‌ విభాగంలో తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ గతేడాది అక్టోబర్‌లో గూగుల్‌కు సీసీఐ రూ.1337.76 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని సూచించింది. దీనిపై గూగుల్‌ NCLATని ఆశ్రయించింది. పెనాల్టీపై స్టే విధించించాలని కోరింది. ఆండ్రాయిడ్‌ వల్ల భారత యూజర్లు, మొబైల్‌ తయారీ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయని, భారత డిజిటల్‌ ప్రయాణంలో ఆండ్రాయిడ్‌ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది. సీసీఐ ఉత్వర్వులతో ఆ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. దేశంలో ఎలాంటి విచారణా జరపకుండా యూరోపియన్‌ కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను సీసీఐ డైరెక్టర్‌ జనరల్‌ కాపీ కొట్టారని తీవ్ర ఆరోపణలు చేసింది. కాబట్టి సీసీఐ ఆదేశాలను కొట్టివేయాలని కోరింది. అయితే, గూగుల్‌ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న ట్రైబ్యునల్‌.. స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని