Updated : 26 Jul 2022 17:28 IST

UPI-RuPay credit cards: త్వరలో క్రెడిట్‌కార్డు-యూపీఐ చెల్లింపులు..వ్యాపారులపై ఎండీఆర్‌ భారం!

MDR on UPI-RuPay credit cards: డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి ‘‘ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ - యూపీఐ (UPI)’’ ఖాతాలకు క్రెడిట్‌ కార్డులను కూడా అనుసంధానించేందుకు అనుమతించనున్నట్లు జూన్‌, 2022లో ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే, ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. మరి క్రెడిట్‌ కార్డులతో చేసే యూపీఐ చెల్లింపులకు కూడా ఇదే వర్తిస్తుందా? అనే అనుమానం తలెత్తింది. అదే జరిగితే ‘క్రెడిట్‌ ప్రొడక్ట్‌’ అయిన క్రెడిట్‌ కార్డుపై వచ్చే లాభదాయకతపై ప్రభావం పడుతుందని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనికోసం ప్రత్యేక కమర్షియల్ మోడల్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని బ్యాంకు వర్గాలు డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో ‘‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NCPI)’’తో గతవారం సుదీర్ఘ చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఇరు వర్గాల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 

క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై వ్యాపారులు రెండు శాతం ‘మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR)’ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌సీపీఐ నిర్ణయించినట్లు సమాచారం. దీంట్లో 1.5 శాతం కార్డు జారీ సంస్థలకు వెళ్లనుండగా.. మిగిలిన 0.5 శాతం ఛార్జీ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ సదుపాయం కల్పిస్తున్న సంస్థలు- ఉదాహరణకు పేటీఎం, ఎంస్వైప్‌కు వెళ్లనుంది. వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షల వరకు మాత్రమే ఉన్న వ్యాపార కేంద్రాల వద్ద రూ.2,000-5,000 విలువ చేసే లావాదేవీలకు మాత్రం ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆర్‌బీఐకి పంపనున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు మూడోవారం నుంచి యూపీఐ-క్రెడిట్‌కార్డు చెల్లింపులు ప్రారంభం కావొచ్చునని అంచనా వేశాయి. 

ప్రస్తుతం యూపీఐకి అనుసంధానం చేసిన డెబిట్‌కార్డు చెల్లింపులు కొనసాగుతున్నాయి. దీంట్లో రూ.2000 విలువ చేసే లావాదేవీల వరకు ఉచితంగా అందిస్తున్నారు. అంటే ఎలాంటి ఎండీఆర్‌ విధించడం లేదు. కానీ, క్రెడిట్‌కార్డు-యూపీఐ చెల్లింపులు మాత్రం భిన్నంగా చూడాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌ వర్గాలు వాదిస్తున్నాయి. ఒకరకంగా క్రెడిట్‌ కార్డు చెల్లింపులను 45 రోజుల వడ్డీరహిత రుణంగా భావించవచ్చు. మరి తమ రుణం ద్వారా లబ్ధిపొందుతున్న వ్యాపారులు ఛార్జీలు చెల్లించడం ‘ధర్మబద్ధమైన కర్తవ్యం’ అన్నది బ్యాంకుల వాదన. లేదంటే క్రెడిట్‌ కార్డు బిజినెస్‌ దెబ్బతింటుందని వివరిస్తున్నారు.

వ్యాపారులు బ్యాంకుల చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకొన్నందుకు ఎండీఆర్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. భారత ప్రభుత్వం రూపే కార్డు నెట్‌వర్క్‌ను ఉపయోగించి చేసే చెల్లింపులపై గతంలో ఛార్జీలను రద్దు చేసింది. అయితే, అది క్రెడిట్‌ కార్డు చెల్లింపులకు కూడా వర్తింపజేయొద్దన్నది తాజాగా బ్యాంకులు, ఎన్‌సీపీఐ చర్చలకు దారితీసింది. 

యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కి క్రెడిట్‌ కార్డుని అనుసంధానించడం వల్ల కార్డు స్వైప్‌ చేయకుండానే చెల్లింపులు చేసేయొచ్చు. కేవలం క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం లేదా మొబైల్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేసి క్రెడిట్‌ కార్డు చెల్లింపులు చేసేయొచ్చు. అయితే, రిజిస్టర్డ్‌ మొబైల్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేసి లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జీపే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ ఆధారిత యాప్‌లన్నీ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డు చెల్లింపులను అనుమతిస్తున్నాయి. అయితే, కేవలం వ్యాపార సంస్థలకు మాత్రమే చెల్లించడానికి ఈ సదుపాయం అందుబాటులో ఉంది. తాజాగా ఆర్‌బీఐ చేసిన ప్రకటనతో త్వరలో వ్యక్తిగత లావాదేవీలు కూడా చేసేందుకు ఈ వెసులుబాటు అందుబాటులోకి రానుంది.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని