సగం సమావేశాలు దండగమారినవే!.. వర్చువల్‌ మీటింగ్స్‌పై సర్వే

Virtual Meetings: వర్చువల్‌ సమావేశాల కారణంగా సమయం ఆదా అవ్వడం అటుంచితే.. అసలు ఉపయోగమే లేనివే అందులో ఎక్కువ ఉంటున్నాయని ఓ సర్వే తెలిపింది.

Published : 15 Mar 2023 03:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌కు ముందు దాదాపు ముఖాముఖి సమావేశాలే ఉండేవి. కరోనా పుణ్యమా అని వర్చువల్‌ సమావేశాలు పెరిగాయి. వైరస్‌ భయాల వల్ల ఈ తరహా సమావేశాలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా వర్చువల్‌ సమావేశాలు (Virtual Meetings) మాత్రం అలానే కొనసాగుతున్నాయి. ఒక్కోసారి సమావేశం అనగానే ‘పనీపాటా లేని మీటింగులు’ అంటూ ఉద్యోగులు సైతం తిట్టుకునే పరిస్థితి. తాజాగా ఓ సర్వే సైతం దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తంచేసింది. దాదాపు సగం సమావేశాలు ఎలాంటి ప్రభావం లేకుండానే ముగిసిపోతున్నాయని తెలిపింది. సేల్స్‌ఫోర్స్‌ మద్దతు కలిగిన ఫ్యూచర్‌ ఫోరమ్‌ అనే రీసెర్చి కన్షార్షియం ఈ సర్వే నిర్వహించింది.

ఎగ్జిక్యూటివ్‌లు వారంలో సగటున 25 గంటల పాటు మీటింగ్స్‌ నిర్వహిస్తున్నారని, అందులో దాదాపు సగం ఎలాంటి ప్రభావం లేకుండానే ముగుస్తున్నాయని ఫ్యూచర్‌ ఫోరమ్‌ తన సర్వేలో వెల్లడించింది. ఆన్‌లైన్‌ సమావేశాల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేయొచ్చని భావించి ఈ తరహా సమావేశాలను వారు నిర్వహిస్తుంటారని తెలిపింది. వాస్తవంలో ఆ పని వారు చేయలేకపోతుంటారని పేర్కొంది. ఏదో ముఖ్యమైన విషయాన్ని మిస్‌ అవుతున్నామోనని ఆందోళన, తామూ పనిచేస్తున్నామని తమ పైవారికి చూపించుకోవడం కోసమూ ఇలాంటి సమావేశాలు నిర్వహించడానికి కారణాలని సర్వే తెలిపింది.

నాన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ సైతం వారంలో సగటున 10.6 గంటలు సమావేశాల్లో పాల్గొంటున్నారని ఫ్యూచర్‌ ఫోరమ్‌ తెలిపింది. అందులో దాదాపు 43 శాతం ఇలాంటి సమావేశాలను తగ్గించుకోవాలని అభిప్రాయపడినట్లు తెలిపారు. ఇలాంటి అనవసర సమావేశాల వల్ల పెద్ద పెద్ద సంస్థల్లో దాదాపు ఏడాదికి దాదాపు 100 మిలియన్‌ డాలర్లు వృథా అవుతున్నాయని మరో సర్వే అభిప్రాయపడింది. 2020లో కేవలం 17 శాతంగా ఉన్న వర్చువల్‌ మీటింగ్‌ల సంఖ్య గతేడాది నాటికి 42 శాతానికి పెరిగాయని వ్యోప్టా అనే సంస్థ తెలిపింది. వర్చువల్‌ సమావేశాల వల్ల సమయం వృథా అవుతున్నాయని గుర్తించిన కొన్ని కంపెనీలు మాత్రం ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉంటున్నాయి. కెనడాకు చెందిన ఇ-కామర్స్‌ సంస్థ షాపిఫై ఈ ఏడాది నిర్వహించిన తలపెట్టిన అన్ని ముందుగా నిర్ణయించిన సమావేశాలను రద్దు చేసి.. ఉద్యోగులకు కాస్త ఫ్రీ టైమ్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని