పెన్ష‌న్ ప్లాన్‌ల అవ‌స‌రం ఎంత‌?

వేగంగా మారుతున్న సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, పెరుగుతున్న జీవన వ్య‌యంతో, ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌నిస‌రి అయ్యింది.

Updated : 30 Dec 2021 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవ‌రైనా ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత జీవించ‌డానికి స‌రైనా పెన్ష‌న్ ప్లాన్లు ఎంచుకోవ‌డం అవ‌స‌రం. ప్ర‌భుత్వ రంగంలో ఎస్‌బీఐ స‌హా అనేక ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ, నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్‌), ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్ కంపెనీలు అనేక పెన్ష‌న్ ప‌థ‌కాల‌ను క‌లిగి ఉన్నాయి. ఇందులో ఎవ‌రైనా పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఈ పెన్ష‌న్ ప‌థ‌కాల వెనుక ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యం ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత పెన్ష‌న‌ర్ల‌కు స‌రైనా ఆదాయ మార్గాన్ని చూపించ‌డ‌మే. వేగంగా మారుతున్న సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, పెరుగుతున్న జీవన వ్య‌యంతో, ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌నిస‌రి అయ్యింది. గ‌తంలో ఉమ్మ‌డి కుటుంబాలు ఉన్నప్పుడు సంపాదిస్తున్న పిల్ల‌లు కుటుంబ పెద్ద‌ల‌ గురించి ప‌ట్టించుకునేవారు. కానీ ప్ర‌స్తుతం యువ‌త‌రం మెరుగైన ఆదాయ అవ‌కాశాల కోసం న‌గ‌రాల‌కు త‌ర‌లిపోతున్నందున పెద్ద‌లు స్వ‌తంత్రంగా బ‌త‌కాల్సి వ‌స్తోంది. అందువ‌ల్ల ప్ర‌తి వ్య‌క్తి  ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత‌ స్వ‌తంత్ర ఆదాయాన్ని క‌లిగి ఉండ‌టం ఇప్పుడు చాలా ముఖ్య‌మైపోయింది.

సంపాద‌న వ‌య‌స్సులో చురుకుగా ఉన్న‌ప్పుడే స‌రైన ప్ర‌ణాళిక, పెట్టుబ‌డుల‌తో ప‌ద‌వీ విర‌మ‌ణ‌ను ప్లాన్ చేసుకుంటే వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్ర‌శాంత‌మైన ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి స‌రిప‌డా ఆదాయాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు అంటున్నారు. అయితే ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ గురించి ఆలోచించ‌ట్లేద‌ని ఇటీవ‌ల ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఇప్ప‌టికీ గ్రామాల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు క‌న‌ప‌డ‌దు. కొంత మందికి రిటైర్మెంట్ కోసం పొదుపు లేదా పెట్టుబ‌డి పెట్ట‌డం ఆర్థిక ల‌క్ష్యాల్లో కీల‌కంగా లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. అంతేకాకుండా 50% మంది వ్య‌క్తులు త‌మ పొదుపు 10 సంవ‌త్స‌రాల్లో అయిపోతుంద‌ని పేర్కొన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం దృష్ట్యా ఉద్యోగ విర‌మ‌ణ ప్లాన్‌లలో పెట్టుబ‌డి పెట్ట‌డం చాలా ముఖ్య‌మైన‌దిగా మారింది. అందువ‌ల్ల‌ బ్యాంక్ ఖాతాలో గ‌ణ‌నీయ‌మైన పొదుపులు ఉన్న‌ప్ప‌టికీ వృద్ధాప్య జీవితాన్ని కొన‌సాగించ‌డానికి పెన్ష‌న్ ప్లాన్ చాలా అవ‌స‌రం.

పెన్ష‌న్ ప్లాన్‌లో పెట్టుబ‌డి పెట్టేవారు మంచి రేటింగ్ ఉన్న సంస్థ‌ల్లో ఏదైనా ప‌ద‌వీ విర‌మ‌ణ పెన్ష‌న్ ప్లాన్‌ని ఎంచుకోవ‌చ్చు. అయితే పెన్ష‌న్ ప్లాన్‌ని ఎంచుకునే ముందు వ‌చ్చే రాబ‌డి, ద్ర‌వ్యోల్బ‌ణం, ప‌న్నుతో స‌హా అనేక అంశాల‌ను గుర్తుంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ద్ర‌వ్యోల్బ‌ణం: ద్ర‌వ్యోల్బ‌ణాన్నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ద్ర‌వ్యోల్బ‌ణ రేటు 6% అయితే, ఈ రోజు  రూ. 100కి స‌మానమైన‌ న‌గ‌దు సంవ‌త్స‌రం త‌ర్వాత రూ. 94 అవుతుంది. అందువ‌ల్ల పెన్ష‌న్ ఫండ్‌లో పెట్టుబ‌డి 6% కంటే త‌క్కువ లేదా స‌మాన‌మైన రాబ‌డిని ఇస్తే, ప‌ద‌వీవిర‌మ‌ణ ప్ర‌ణాళిక‌కు ఇది స‌రైన ప‌థ‌కం కాద‌ని నిపుణులు తెలిపారు.

రిస్క్: ఉద్యోగ విర‌మ‌ణ స‌మ‌యంలో పెట్టుబ‌డిదారులు ఎక్కువ రిస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల్లో పెట్టుబ‌డులు పెట్ట‌కూడ‌ద‌ని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. పెట్టుబ‌డుల‌పై హామీతో కూడిన రాబ‌డికి క‌ట్టుబ‌డి ఉండ‌టం చాలా ముఖ్యం. పెరుగుతున్న మార్కెట్ అస్థిర‌త‌ను ఎదుర్కోవడానికి పెట్టుబ‌డులు త‌క్కువ రిస్క్ కార్ప‌స్‌ను ప్ర‌తిబింబించాలి. ముఖ్యంగా పెట్టుబడిలో సమయం తక్కువ ఉన్నప్పుడు రిస్క్ అస్సలు ఉండకూడదు.

యాన్యుటీ ఎంపిక: వివిధ‌ ప‌ద‌వీ విర‌మ‌ణ పెన్ష‌న్ ప్లాన్‌ల్లో యాన్యుటీప‌రంగా విభిన్నంగా ఉంటాయి. కొన్ని ప్లాన్‌లు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కొంత కాలానికి మాత్ర‌మే యాన్యుటీ చెల్లింపును అందించ‌వ‌చ్చు. కొన్ని వ్య‌క్తి మ‌ర‌ణించే వ‌ర‌కు సాధార‌ణ చెల్లింపులను నిర్ధారించ‌వ‌చ్చు. హామీ పొందిన వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత కూడా నామినీల‌కు యాన్యుటీకి భ‌రోసా ఇచ్చే ప్లాన్‌లు ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవ‌డం మంచిది.

బీమా కంపెనీ లు అందించే పెన్షన్ ప్లాన్లలో అనేక ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. దీని వల్ల రాబడి తగ్గిపోతుంది. కాబట్టి, అలాంటి వాటికీ దూరంగా ఉండడం మంచిది. ఎన్‌పీఎస్‌ లాంటి పథకాల్ని కూడా పరిశీలించవచ్చు. ఇందులో 60 శాతం పెన్షన్ కార్పస్ వెనక్కి తీసుకుని మిగతా మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో తక్కువ చార్జీలతో యాన్యుటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణ తీసుకున్న వారు కార్పస్ మొత్తాన్ని ఎల్ఐసీ వయ వందన యోజన లేదా పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ పథకంలో పెట్టుబడి పెట్టి కూడా పెన్షన్ పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని