వాహన బీమా పునరుద్ధరణకు కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ అవసరమా?

పీయూసీ సర్టిఫికేట్ లేని వారికి బీమా పునరుద్ధరణను వాయిదా వేస్తారు

Updated : 30 Dec 2020 15:04 IST

వాహన బీమా పునరుద్ధరణ సమయంలో చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ (పీయూసీ) ను చూపడాన్ని బీమా నియంత్రణ సంస్థ తప్పనిసరి చేసింది. ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. బీమా పునరుద్ధరణ కోసం పీయూసీని తప్పనిసరి చేయడం ద్వారా చట్టం ప్రకారం థర్డ్ పార్టీ బీమా వాహనాల కాలుష్య స్థాయిని తనిఖీ చేయడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే వాహన బీమా పునరుద్ధరణ కోసం పీయూసీ సర్టిఫికేట్తో పాటు, 15 సంవత్సరాలు దాటిన అన్ని రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా చూపడం తప్పనిసరి. అయితే, బీమా పునరుద్ధరణ సమయంలో పీయూసీ సర్టిఫికేట్ లేని వారికి బీమా పునరుద్ధరణను వాయిదా వేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.

కాలుష్య నియంత్రణ:

పెరిగిన వాహన కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని, గతేడాది బీమా సంస్థలకు సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాహనదారులు పీయూసీ సర్టిఫికేట్ ను అందిస్తే తప్ప, వాహనాల బీమా పాలసీని పునరుద్ధరణ చేయవద్దని సుప్రీం కోర్ట్ తెలిపింది. 1985లో పర్యావరణవేత్త ఎంసీ మెహతా దాఖలు చేసిన దావాను పరిశీలించిన న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) లో కొన్ని ఇంధన రిఫిల్లింగ్ అవుట్ లెట్లు పీయూసీ కేంద్రాలను కలిగిలేవని తెలిపింది. అలాగే ఎన్సీఆర్ లో అన్ని ఇంధన రీఫిల్లింగ్ కేంద్రాలలో ఫంక్షనల్ పీయూసీ కేంద్రాలను కలిగి ఉండేలా చూడాలని రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కు సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

పీయూసీ నెట్వర్క్ విస్త‌రించ‌డానికి , మాన్యువల్ టాంపరింగ్ ను నివారించడానికి అన్ని పీయూసీ కేంద్రాలు డేటా సెంటర్ కు ఆన్ లైన్ ద్వారా లింక్ చేయాలని కూడా బెంచ్ పేర్కొంది. కొత్త వాహనాలు ఆరు నెలల పీయూసీ కవర్ తో లభ్యమవుతాయి. అయితే, సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికెట్ ను పొందడానికి ఒక అవుట్ లెట్ కు వెళ్ళడం అవసరం. ఐదు సంవత్సరాల వరకు వయస్సు ఉన్న వాహనాలు ఒక సంవత్సరం పీయూసీ సర్టిఫికేట్ ను పొందుతాయి.

వాహన బీమా:

భారతీయ మోటారు వాహనాల చట్టం ప్రకారం, భారతదేశ రహదారులపై నడిచే ఏ మోటారు వాహనమైనా తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా కవర్ ను కలిగి ఉండాలి. బీమా లేకుండా వాహనాన్ని నడిపినట్లైతే, రూ. 2,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఐఏ) ప్రతి సంవత్సరం థర్డ్ పార్టీ బీమా ధరను నిర్ణయిస్తుంది.

థర్డ్ పార్టీ బాధ్యత, నిర్ణయం న్యాయస్థానం పరిధిలో ఉంటుంది. మరణించిన వారి వయస్సు, సంపాదన సామర్ధ్యం, వేతనాలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. మోటార్ వాహనాలు (సవరణ) చట్టం ప్రమాద బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచింది.

బీమా రెగ్యులేటరీ సంస్థ ఇటీవలే దీర్ఘకాల థర్డ్ పార్టీ బీమా అందించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాల కోసం ఐదు సంవత్సరాలు, నాలుగు చక్రాల వాహనాలకు మూడు సంవత్సరాల పాటు థర్డ్ పార్టీ బీమాను అందించాలని ఆలోచన చేస్తుంది. థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి అయినప్పటికీ, రహదారులపై ప్రయాణించే వాహనాల్లో సగ భాగం వాహనాలు బీమాను కలిగి లేవు.

సమగ్ర కవరేజ్:

వాహ‌ర‌దారులు సమగ్ర కవరేజ్ పై ద్రుష్టి కేద్రీకరించాలి, ముఖ్యంగా సొంతగా కలిగే నష్టం, పేలుడు కారణంగా జరిగే నష్టం, రహదారి లేదా రైలు ప్రమాదాలు, దొంగతనం వంటి వాటి ద్వారా కలిగే నష్టంపై ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి. రైడర్స్ అని పిలిచే ఆప్షనల్ యాడ్ ఆన్ కవర్లు ఇలాంటి నష్టాల నుంచి కాపాడతాయి. అయితే ఇవి ప్రాథమిక కవరేజ్ లో అందుబాటులో ఉండవు. ప్రాథమిక వాహన బీమాకి యాడ్ - ఆన్ కవరేజ్ తీసుకోవచ్చు. ధర కూడా తీసుకున్న బీమా విలువపై ఆధారపడి ఉంటుంది.

సున్నా లేదా నిల్ డిప్రిసియేషన్ కవరేజ్ విధానంలో , వాహనం ప్రమాదానికి గురైన సందర్భంలో ప్లాస్టిక్ వస్తువులు, ఫైబర్, రబ్బరు, విండ్ స్క్రీన్ వంటి భాగాల విలువపై పాలసీదారుడు పూర్తిస్థాయి ప‌రిహారాన్ని పొందుతాడు. కొత్త వాహనం కోసం నిల్ డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవరేజ్ తీసుకోవడంతో పాటు సమగ్ర మోటార్ బీమా పథకంతో పాటు ఐదు సంవత్సరాల వరకు దానిని పునరుద్ధరించాలి.

ఇంజిన్ కవర్ రైడర్, వరదలు సంభవించినప్పుడు ఇంజిన్ కు రక్షణ కల్పిస్తుంది. ఇంజిన్ వైఫల్యానికి హైడ్రో-స్టాటిక్ లాక్ ప్రధాన కారణం. తడిగా ఉన్న ఇంజిన్ ను పదేపదే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు హైడ్రో - స్టాటిక్ లాక్ కారణంగా ఇంజిన్ కు నష్టం వాటిల్లుతుంది. ఇది సాధారణ మోటారు బీమా పాలసీలో కవర్ అవ్వ‌దు. ఇలాంటి సందర్భంలో అదనపు యాడ్ - ఆన్ ఇంజన్ కవర్ చాలా సహాయంగా ఉంటుంది. నామమాత్రపు వ్యయంతో లభించే బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్, వాహనం రోడ్డు మీద బ్రేక్ డౌన్ అవడం లేదా ప్రమాదానికి గురైన సందర్భంలో పాలసీదారుడికి తక్షణ సహాయాన్ని అందించడంలో సహాయపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని