Anand Mahindra: 40శాతం మందికే పని.. నిరుద్యోగంపై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు

Anand Mahindra on unemployment: దేశంలో నిరుద్యోగ సమస్యపై మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 06 Aug 2022 13:28 IST

దిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్యపై (unemployment) మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయని, ఆ ఫలాలు అందుకోవాలంటే నిరుద్యోగ సమస్యను అధిగమించాల్సి ఉందన్నారు. అందుకోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని లభిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ప్రస్తుత పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కొన్ని లోపాలను సరిదిద్దుకోవాలి. అందులో నిరుద్యోగ సమస్య ఒకటి. భారత్‌లో నిరుద్యోగిత 7-8 శాతానికి చేరినట్లు CMIE (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ) లెక్కలు చెబుతున్నాయి. జీడీపీ వృద్ధి చెందినంత వేగంగా ఉద్యోగాలు వృద్ధి చెందడం లేదు. పనిచేయగల, పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని దొరుకుతోంది. ఉపాధి అవకాశాలు లేక యువత, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’’ అని ఆనంద్‌ మహీంద్రా అన్నారు.

ప్రపంచంలో యువ జనాభా కలిగిన భారత్‌లో ఉద్యోగాభివృద్ధి జరగకపోతే సామాజిక అశాంతికి దారి తీసే అవకాశం ఉంటుందని ఆనంద్‌ మహీంద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులు ఊహించలేమన్నారు. ప్రభుత్వం కొంతమేర తన వంతు కృషి చేస్తున్నా.. ఇంకా జరగాల్సింది చాలా ఉందన్నారు. 2023 నాటికి 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉబర్‌ డ్రైవర్లు, జొమాటో డెలివరీ బాయ్‌ల రూపంలో గిగ్‌ ఎకానమీలోనే ఉద్యోగాలు సృష్టి జరుగుతోందన్నారు. ఇది ఏమాత్రం సరిపోదన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ముఖ్యంగా స్థానికంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించ గల ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాని ఆనంద్‌ మహీంద్రా సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని