
Netflix: షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ గుడ్‌న్యూస్.. ప్రతిభను చాటుకునే సదావకాశం!
ఇంటర్నెట్ డెస్క్: షార్ట్‌ఫిల్మ్ రూపొందించడంలో అనుభవం ఉందా? మీ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నారా? అయితే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ అలాంటి వారికి సదావకాశం కల్పిస్తోంది. తర్వాతి తరం కథకులను అన్వేషించడంలో భాగంగా ‘టేక్ టెన్’ పేరిట షార్ట్‌ఫిల్మ్ వర్క్‌షాప్, పోటీని నిర్వహిస్తోంది. దేశ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ‘టేక్ టెన్’కు ఎంపికైన వారు వర్క్‌షాప్‌నకు హాజరవ్వడమే కాకుండా 10వేల డాలర్లతో షార్ట్‌ఫిల్మ్ రూపొందించే అవకాశం దక్కనుంది. ఇలా రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంచనున్నారు.
18 ఏళ్లు నిండిన భారత పౌరులు ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. పోటీలో పాల్గొనాలంటే ‘మై ఇండియా’ అంశంపై రెండు నిమిషాల నిడివి గల షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించి నెట్‌ఫ్లిక్స్‌కు పంపాల్సి ఉంటుంది. అది కూడా మొబైల్‌తో తీసి ఉండాలి. ఫిబ్రవరి 7 నుంచి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోటీకి ఎంపికైన వారు రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వంటి విభాగాల గురించి నేర్చుకునే అవకాశాన్ని పొందొచ్చని నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాని వారి కోసం ఈ కార్యక్రమాన్ని నెట్‌ఫ్లిక్స్ చేపడుతోంది. ఇందుకోసం ఏడాదికి 100 మిలియన్ డాలర్ల చొప్పున రాబోయే ఐదేళ్ల చొప్పున దీని కింద ఖర్చు చేయనుంది. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికుల కోసమే ‘టేక్ టెన్’కు శ్రీకారం చుట్టినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.