Updated : 20 Jul 2022 12:23 IST

Netflix loses subscribers: నెట్‌ఫ్లిక్స్‌కు 10 లక్షల సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై.. కారణాలివే!

వాషింగ్టన్‌: ప్రపంచ వీడియో స్ట్రీమింగ్‌ రంగంలో రారాజుగా కొనసాగుతున్న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్‌-జులై మధ్య నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఏకంగా 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల (Subscribers)ను కోల్పోయింది. ఈ వేదికను వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

అయితే, కంపెనీ వాదన మాత్రం భిన్నంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) నుంచి వెళ్లిపోతున్నవారి సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిందని సీఈఓ రీడ్‌ హేస్టింగ్స్‌ తెలిపారు. కొత్తగా ప్రారంభించిన డ్రామాలకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. బహుశా అందువల్లే నిష్క్రమణలు తగ్గాయని వివరించారు. 2011 తర్వాత తొలిసారి ఈ ఏడాది ఏప్రిల్‌లో సబ్‌స్క్రైబర్లు తగ్గినట్లు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మార్జిన్లను కాపాడుకునేందుకు వెంటనే ఉద్యోగాల్లో కోత విధించింది.

కెనడా, అమెరికాలో అత్యధిక మంది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నారు. తర్వాత ఐరోపా దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి. మార్కెట్‌లోని ప్రత్యర్థి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ, సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగడమే సబ్‌స్క్రైబర్ల తగ్గుదలకు కారణంగా పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. మరోవైపు కొవిడ్‌కు మునుపటి పరిస్థితులు క్రమంగా నెలకొనడం కూడా మరోకారణంగా వివరించారు.

కరోనా లాక్‌డౌన్‌లు అమల్లో ఉన్న 2020లో స్క్విడ్‌ గేమ్‌, ది క్రౌన్‌ వంటి సూపర్‌ హిట్‌ ప్రోగ్రామ్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్యోగులు ఆఫీసులకు వెళుతున్నారు. పిల్లలు, యువకులు తమ చదువులపై శ్రద్ధ వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్ట్రీమింగ్‌పై ఆదరణ తగ్గిందన్నది ఓ అంచనా. అదే సమయంలో ఆకర్షణీయమైన కంటెంట్‌తో ప్రత్యర్థి సంస్థల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. యాపిల్‌ టీవీ, హెచ్‌బీఓ మ్యాక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ+ వంటి సంస్థలు నెట్‌ఫ్లిక్స్‌కు సవాల్‌ విసురుతున్నాయి. ఈ క్రమంలో ఏళ్లుగా ఈ రంగాన్ని ఏలుతున్న నెట్‌ఫ్లిక్స్‌కు ఆదరణ తగ్గడం సహజమేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

జూన్‌ చివరినాటికి నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్కైబర్ల సంఖ్య 220 మిలియన్లుగా ఉంది. ఇతర పోటీ సంస్థలతో పోలిస్తే ఇది ఎక్కువే. మరోవైపు ఏప్రిల్‌-జూన్‌లో 7.9 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదైంది. వార్షిక ప్రాతిపదికన 8.6 శాతం వృద్ధి రికార్డయ్యింది. కంపెనీ షేరు విలువ ఈ ఏడాది ఆరంభం నుంచి 60 శాతం పడిపోవడం గమనార్హం. కానీ, సబ్‌స్క్రైబర్ల తగ్గుదల అంచనాల కంటే తక్కువే ఉండడంతో మంగళవారం మాత్రం షేరు విలువ ఏడు శాతం ఎగబాకింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని