Netflix: డబ్బులు కొట్టు పాస్‌వర్డ్‌ పట్టు.. అకౌంట్‌ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ ‘ఛార్జ్‌’!

Netflix: అకౌంట్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల నష్టపోతున్నామని భావిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌కూ కొంత రుసుము వసూలు చేయాలని యోచిస్తోంది.

Updated : 10 Aug 2022 11:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా పుణ్యమా అని ఓటీటీలకు విపరీతంగా ఆదరణ పెరిగింది. థియేటర్లు మూతపడడంతో చాలా మంది వినోదం కోసం రకరకాల ఓటీటీలను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. అయితే, ఒక ఖాతాతో వివిధ డివైజుల్లో లాగిన్‌ అయ్యే వీలుండడంతో ఒక అకౌంట్‌ తీసుకుని.. తమ స్నేహితులు, బంధువులతో పాస్‌వర్డ్‌ పంచుకుంటున్నారు. దీంతో ఒక సబ్‌స్క్రిప్షన్‌పై పలువురు వినోదం పొందుతున్నారు. అయితే, ఇలాంటి అకౌంట్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల నష్టపోతున్నామని భావిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌కూ కొంత రుసుము వసూలు చేయాలని యోచిస్తోంది.

గతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతమందితో అకౌంట్‌ పంచుకున్నా పరిమితుల మేరకు వినోదాన్ని ఆస్వాదించే వెసులుబాటు ఇచ్చింది. అయితే, ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేకపోవడంతో ఆదాయం పెంచుకునేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాను పంచుకోవడం వల్ల నాణ్యమైన కొత్త కార్యక్రమాల రూపొందించే సామర్థ్యం తమకు తగ్గుతోందని నెట్‌ఫ్లిక్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకే తొలుత చిలీ, కోస్టారికా, పెరూ దేశాల్లో ఒక ఖాతాకు రెండు సబ్‌ అకౌంట్స్‌ను తెరిస్తే అదనంగా నెలకు 2, 3 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

అయితే, తొలుత ఈ మోడల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత మిగిలిన అన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్‌ అదే చేస్తే ఇకపై అకౌంట్‌ను పంచుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారనుంది. మిగిలిన కంపెనీలు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తే ఒకే ఖాతాను ఇక వేర్వేరు వ్యక్తులు వినియోగించడం ఇక కష్టమే. ఓ విధంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ భారం కానుంది. ఇప్పటికే కొన్ని ఓటీటీ కంపెనీలు డివైజ్‌ల లాగిన్‌, స్ట్రీమింగ్‌పై పరిమితి విధించాయి. ఒకేసారి ఇద్దరు/ ముగ్గురు మాత్రమే స్ట్రీమ్‌ చేయగలరు. ఇక లాగిన్‌ విషయంలో ఐదు డివైజ్‌ల పరిమితి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని