Netflix: 23 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబర్లు.. వైదొలగనున్న సీఈఓ

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సీఈఓ రీడ్‌ హేస్టింగ్స్‌ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అంచనాలకు మించి రాణించినప్పటికీ.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 20 Jan 2023 13:13 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: గత ఏడాది ఆరంభంలో గడ్డుకాలం ఎదుర్కొన్న అమెరికా వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix).. ఎట్టకేలకు సంవత్సరాంతానికి పుంజుకుంది. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను మించి రాణించింది. ఈ తరుణంలో సంస్థ కీలక ప్రకటన చేసింది. సహ- వ్యవస్థాపకుడు రీడ్‌ హేస్టింగ్స్‌ ‘ముఖ్య కార్యనిర్వాహణాధికారి (CEO)’ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది.

మొత్తంగా 2022 చివరకు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) చందాదారుల సంఖ్య అనూహ్యంగా 23 కోట్ల పైకి చేరింది. ఏడాది ఆరంభంలో సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్రమంగా పడిపోవడంతో కంపెనీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. కానీ, ‘వెడ్నస్‌డే’, ‘హ్యారీ అండ్‌ మేఘన్‌’ వంటి ప్రముఖ షోలు కొత్త చందాదారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో సంవత్సరాంతానికి సబ్‌స్క్రైబర్ల సంఖ్య తిరిగి గాడిలో పడింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో 77 లక్షల కొత్త చందాదారులను జత చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ప్రకటించింది.

మెయిల్‌ డీవీడీలను అద్దెకు ఇచ్చే సాధారణ కంపెనీ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజంగా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) రూపాంతరం చెందడంలో రీడ్‌ హేస్టింగ్స్‌ నాయకత్వం చాలా ఉపయోగపడింది. సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు తాజాగా ఆయనే స్వయంగా బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించారు. సుదీర్ఘకాలంగా ఆయనకు  దగ్గరగా పనిచేస్తున్న సీఎఫ్‌ఓ గ్రెగ్‌ పీటర్స్‌, టెడ్‌ శారండోస్‌కు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను అప్పగించారు. తాను ఇకపై ఇతర టెక్‌ దిగ్గజ వ్యవస్థాపకుల తరహాలోనే కార్యనిర్వాహక ఛైర్మన్‌గా కొనసాగుతానని హేస్టింగ్స్‌ తెలిపారు. గతంలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ సహ- వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ధరల పెరుగుదలతో పాటు ఆర్థికంగా అస్థిర పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఎంటర్‌టైన్‌మెంట్‌పై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) తక్కువ ధరతో ‘బేసిక్‌ విత్‌ యాడ్స్‌’ అనే సబ్‌స్క్రిప్షన్‌ పాలసీని తీసుకొచ్చింది. కొత్తగా వచ్చిన అనేక షోలు చందాదారులను ఈ విభాగంలోకి ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి. గత ఏడాది చివరి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం అంచనాలకు అనుగుణంగా 7.85 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దీంతో కంపెనీ షేరు గురువారం 6 శాతం పెరిగింది. ఇకపై కంపెనీ వృద్ధికి చందాదారుల సంఖ్య ప్రాతిపదిక కాబోదని.. ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని కంపెనీ ప్రకటించింది. ఏళ్లుగా వీడియో స్ట్రీమింగ్‌ రంగంలో దూసుకుపోతున్న నెట్‌ఫ్లిక్స్‌కు ఇటీవల పోటీ తీవ్రమైంది. డిస్నీ+ వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు