Mercedes- SIP: ‘బెంజ్‌కు సిప్‌ పోటీనా? ఇదేం పోలికా?’.. మెర్సిడెస్‌ ప్రతినిధి వ్యాఖ్యలపై నెటిజన్లు

తమ భవిష్యత్‌ కోసమే కాకుండా.. భవిష్యత్‌ తరాలకు సైతం భారతీయులు పొదుపు చేస్తుంటారని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ హెడ్‌ సంతోష్‌ అయ్యర్‌ అన్నారు.

Updated : 28 Nov 2022 21:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ భవిష్యత్‌ కోసమే కాకుండా.. భవిష్యత్‌ తరాలకు సైతం భారతీయులు పొదుపు చేస్తుంటారని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ హెడ్‌ సంతోష్‌ అయ్యర్‌ అన్నారు. ఈ పొదుపు మనస్తత్వమే భారత్‌లో లగ్జరీ కార్ల విక్రయాలకు అవరోధంగా మారిందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. క్రమానుగుత పెట్టుబడి విధానం (సిప్‌) తమకు ప్రధాన పోటీ అని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదేం పోలిక? అంటూ  పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

మెర్సిడెస్‌ బెంజ్‌- ఇండియా కార్యకలాపాలకు ఎండీగా, సీఈఓగా జనవరిలో సంతోష్‌ అయ్యర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తర్వాత లగ్జరీ కార్ల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందినప్పటికీ.. భారత్‌లో మాత్రం ఆ ధోరణి కనిపించలేదని పేర్కొన్నారు. ఇందుకు భారతీయుల పొదుపు అలవాట్లే కారణమని చెప్పారు. ‘‘ప్రతి నెలా 15 వేల మంది లగ్జరీ కార్ల కోసం ఆరా తీస్తే.. వాస్తవంగా అందులో కేవలం 1500 యూనిట్లకు మాత్రమే ఆర్డర్లు వస్తాయి. మిగిలిన 13,500 మంది కస్టమర్లు బెంజ్‌ కారు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నా.. కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు. దీనికి బదులు సిప్‌లో పొదుపు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు’’ అని సంతోష్‌ అయ్యర్‌ అన్నారు. అందుకే తమకు క్రమానుగత పెట్టుబడి విధానమే ప్రధాన పోటీదారు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, సంతోష్‌ అయ్యర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ట్విటర్‌లో కామెంట్లు వస్తున్నాయి. సిప్‌కూ మెర్సిడెస్‌కూ మధ్య పోలిక తేవడంపట్ల పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని