IPO: నెట్‌వెబ్‌ టెక్‌.. ఎస్‌పీసీ లైఫ్‌ ఐపీఓకి దరఖాస్తు

IPO: సర్వర్ల తయారీ సంస్థ నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ సహా ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే పదార్థాలను అందించే ఎస్‌పీసీ లైఫ్‌సైనెన్స్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకున్నాయి.

Published : 29 Mar 2023 20:04 IST

దిల్లీ: సర్వర్ల తయారీ సంస్థ నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ ఇండియా లిమిటెడ్ ఐపీఓ (IPO)కి సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు ప్రాథమిక పత్రాలను సమర్పించి సెబీ వద్ద దరఖాస్తు చేసుకుంది. మొత్తం రూ.700 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్ ఇష్యూ (IPO)లో రూ.257 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 85 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తున్నారు. 

రూ.51 కోట్లు విలువ చేసే షేర్లను ముందస్తు ఐపీఓ (IPO) ప్లేస్‌మెంట్‌లో విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. అదే జరిగితే మొత్తం ఐపీఓ (IPO) పరిమాణం తగ్గుతుంది. సమకూరిన నిధుల్లో రూ.32.77 కోట్లను మూలధన వ్యయాలకు, రూ.128.02 కోట్లు నిర్వహణ మూలధనానికి, రూ.22.5 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనున్నట్లు కంపెనీ తెలిపింది. మిగిలిన నిధులను జనరల్‌ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న నెట్‌వెబ్‌.. దేశీయంగా హైఎండ్‌ కంప్యూటింగ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తున్న కంపెనీల్లో ఒకటి. ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు ఈ కంపెనీ ఎంపికైంది.

ఎస్‌పీసీ లైఫ్‌సైనెన్స్‌..

ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే పదార్థాలను అందించే ఎస్‌పీసీ లైఫ్‌సైనెన్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ (IPO)కి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు బుధవారం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. రూ.300 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 89.39 లక్షల ప్రమోటర్ల ఈక్విటీ షేర్లను ఐపీఓలో విక్రయానికి ఉంచారు. ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్‌లో రూ.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించే అవకాశం ఉంది. ఐపీఓలో సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, మూలధన వ్యయాలు, నిర్వహణ మూలధన ఖర్చులు, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనున్నారు. కార్డియోవాస్కులార్‌, యాంటీ-ప్లేట్‌లెట్‌, యాంటీ సైకోటిక్‌, యాంటీ డిప్రెసెంట్స్‌లో వినియోగించే పలు కీలక పదార్ధాలను ఎస్‌పీసీ వవిధ ఔషధ కంపెనీలకు అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని