Neuralink: మరింతమందికి న్యూరాలింక్‌ బ్రెయిన్‌ చిప్‌.. ఏఐ ముప్పును ఎదుర్కోవడమే లక్ష్యం: మస్క్‌

Neuralink: మానవ మెదడులో చిప్‌ను అమర్చే ప్రయోగాలను న్యూరాలింక్‌ వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. మరొకరిలో ఈ పరికరాన్ని అమర్చనున్నట్లు వెల్లడించింది. దీర్ఘకాలంలో ఏఐ ముప్పు సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యమని మస్క్‌ వెల్లడించారు.

Published : 11 Jul 2024 12:39 IST

Neuralink | వాషింగ్టన్‌: మానవ మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చే ప్రయోగాలను ఎలాన్‌ మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌ (Neuralink) మరింత వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఓ పక్షవాత బాధితుడికి చిప్‌ అమర్చిన ఆ సంస్థ వారం రోజుల్లో మరో వ్యక్తిలోనూ దాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మస్క్‌ (Elon Musk) బుధవారం స్వయంగా వెల్లడించారు. ఈ ఏడాది చివరకల్లా మరింతమంది మెదడులో దీన్ని అమర్చుతామని ప్రకటించారు.

మస్క్‌తో పాటు న్యూరాలింక్‌కు (Neuralink) చెందిన పలువురు ఉద్యోగులు ఎక్స్‌లో జరిగిన ఓ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు. బ్రెయిన్‌ చిప్‌ సామర్థ్యం, రాబోయే రోజుల్లో దాని ఉపయోగాలు, మానవ జీవితంపై దాని ప్రభావం వంటి కీలక అంశాలపై చర్చించారు. తొలి ప్రయోగంలో నోలాండ్‌ అర్బాగ్‌కు అమర్చిన సమయంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా తీసుకోనున్న జాగ్రత్తలను వివరించారు. తమ ప్రయోగాలతో భవిష్యత్తులో డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌తో పోటీ పడగలిగే సామర్థ్యం మనిషికి వస్తుందని మస్క్‌ వివరించారు. మనుషులకు ‘సూపర్‌ పవర్స్‌’ ఇవ్వడమే తమ ఆలోచన అని పేర్కొన్నారు. అప్పుడే కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతల వల్ల దీర్ఘకాలంలో తలెత్తే ముప్పును ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు.

స్వల్పకాలంలో మెదడు, వెన్నెముక వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపయోగకరంగా మారేలా చేస్తామని మస్క్‌ (Musk) తెలిపారు. చిప్‌ అమరికలో భాగంగా మెదడు కణజాలంలోకి ప్రవేశపెట్టే ఎలక్ట్రోడ్లు బయటకు వస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ సమస్యను రానున్న రోజుల్లో చేపట్టబోయే చికిత్సల్లో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. శస్త్ర చికిత్స సమయంలో ఉపయోగిస్తున్న ఎయిర్‌ పాకెట్లను తొలగించడం ద్వారా అది సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు వివరించారు.

మెదడు సైజుకు శరీర బరువుతో సంబంధం లేదు

మానవ మెదడులో విజయవంతంగా చిప్‌ను అమర్చినట్లు జనవరి చివర్లో న్యూరాలింక్‌ ప్రకటించింది. చిప్‌ను అమర్చిన వ్యక్తి నోలాండ్‌ అర్బాగ్‌ను మార్చిలో ప్రజల ముందుకుతీసుకొచ్చింది. పక్షవాతంతో బాధపడుతున్న ఆయనతో వీడియో గేమ్‌ సివిలైజేషన్‌ VI, చెస్‌ ఆడించింది. దాన్ని ‘ఎక్స్‌’లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఎవరి సాయం లేకుండా ఆయన గేమ్‌ ఆడినట్లు వెల్లడించింది. లైవ్‌ స్ట్రీమ్‌ సమయంలో అర్బాగ్‌ మాట్లాడారు. తన జీవితంలో ఇక చేయలేననుకున్న చాలా పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నానని సంతోషం వ్యక్తంచేశారు. ఈ అధునాతన సాంకేతికతలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని తెలిపారు. దీన్ని మరింత మెరుగుపరిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని వివరించారు.

ఎలా పని చేస్తుందంటే..

న్యూరాలింక్‌ ‘బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ (BCI)’లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లు ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గారిథమ్‌లుగా మారుస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని