Car Loan: కొత్త కారు Vs పాత కారు.. ఏది కొనాలి? 

భారత్ వంటి దేశాలలో ఇప్పటికీ కారు కలగానే ఉంది. ఒకప్పుడు కారు కొనుగోలు అనేది సమాజంలో ఒక గౌరవ సూచికంగా ఉండేది. కానీ కొవిడ్ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా కారు కొనుగోలుకు ఆసక్తి చూపించే వారి సంఖ్య పెరిగింది. అయితే నిధుల కొరత, ఇతర కారణాల వల్ల కారు కొనుగోలును వాయిదా వేసేవారు కొందరైతే.. చాలా మంది పాత కారు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్ భారత్‌లో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఉన్న వృద్ధిని దృష్టిలో పెట్టుకుని, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు కొత్త కార్లకే కాకుండా.. పాత కార్లకూ రుణాలు మంజూరు చేస్తున్నాయి. కారు విలువ వాడేకొద్దీ క్షీణిస్తుంది. భవిష్యత్తులో అమ్మాలనుకుంటే కొనుగోలు చేసిన విలువ రాదు. నిర్వహణకు మరింత ఖర్చుచేయాల్సిందే. కానీ దీన్నుంచి వచ్చే రాబడి ఏమీ ఉండదు కాబట్టి ఇది పెట్టుబడి కాదు. అందువల్ల రుణం తీసుకుని కొనుగోలు చేసే వారు వడ్డీ, ఇతర ఖర్చులు భారం కాకుండా మీ అవసరాలకు తగినట్లు కారును కొనుగోలు చేయాలి. 

కారు కొనడం అంత తేలికైన నిర్ణయం కాదు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో నుంచి మీకు నచ్చిన ఫీచర్లతో, మీ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలంటే కొంత రీసెర్చ్ చేయాల్సిందే. దీనికంటే ముందు అసలు మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? పాత కారు కొనాలనుకుంటున్నారా? ఏది కొనుగోలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవాలి.

కొత్త కారు కొనడం వల్ల ప్రయోజనాలు..

నిర్వహణ ఖర్చులు..

కొత్త కారుకయ్యే నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. కొత్త కారు కొనుగోలు చేసిన నాటి నుంచి ఆరు నెలలు, లేదా ఒక సంవత్సరం లేదా మొదటి వెయ్యి కిలో మీటర్లు తిరిగేంత వరకు నిర్వహణ ఖర్చులు ఉండవు. తరువాత సర్వీసింగులు చేయించాల్సి ఉంటుంది. అయితే కొత్త కారుకు సంస్థ తరఫు నుంచి కొన్ని ఉచిత సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రెండు లేదా మూడు ఉచిత సర్వీసులు ఉండచ్చు. ఇది కారు కొనుగోలు చేసిన కంపెనీపై ఆధారపడి ఉంటుంది.

కానీ కారు పాతది అయ్యే కొద్దీ నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. కారు కొనుగోలు చేసిన మొదటి సంవత్సరంలోనే ఉచిత సర్వీసులు ముగిసిపోతాయి, కాబట్టి పాత కారు కొనుగోలు చేసినవారే స్వయంగా సర్వీసింగ్ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. కారు 3 సంవత్సరాల పాతది అయితే ఎయిర్ ఫిల్టర్లు మార్చ‌డం, క్లీనింగ్, ఇంజిన్ ఆయిల్ మార్పిడి వంటి ఖర్చులు తోడవుతాయి. కారు 5 నుంచి 8 సంవత్సరాల పాతదైతే ఖర్చులు మరిన్ని పెరుగుతాయి. డీజిల్ కారు అయితే కొన్ని అదనపు ఖర్చులు ఉంటాయి. మీరు కొనుగోలు చేసే సమయానికి ఉన్న కారు కండీషన్‌ బట్టి ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఖర్చులన్నీ లెక్కలో వేసుకోవాలి.

టెక్నాలజీ, ఫీచర్లు..

ఈ రోజు మార్కెట్లోకి వచ్చిన టెక్నాలజీ 6 నెలల తర్వాత పాతది అయిపోతుంది. కొత్త కారు సరికొత్త సాంకేతికతతో, అదనపు ఫీచర్లతో వస్తుంది. పైగా టైర్లు, ఇతర పరికరాలు కొత్తవి కాబట్టి ఈ ఫీచర్లతో మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు వీలుంటుంది.

పాత కారులో ఆ కారు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఫీచర్లే అందుబాటులో ఉంటాయి. కొత్త కారు ఫీచర్లు అందుబాటులో ఉండవు. టైర్ల వంటివి పాతవి అయిపోతాయి. అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. కానీ ఈ పరికరాలు మార్చుకునేందుకు అదనపు ఖర్చు అవుతుంది. మీరు కొత్త టెక్నాలజీని కోరుకునే వారు అయితే కొత్త కారును కొనుగోలు చేయడమే మంచిది.

వడ్డీ రేట్లు..

కొత్త కారుకు రుణం పొందడం సులభం. అలాగే పాత కార్లతో పోలిస్తే కొత్త కార్లకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. ఉదాహరణకి, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు, కొత్త, పాత కార్లకి రుణాలు మంజూరు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ కొత్త కార్లకు 7.20 నుంచి 7.90 శాతం వడ్డీ రేటుతో రుణం మంజూరు చేస్తుంటే.. సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లకు 12 నుంచి 14 శాతం వడ్డీ రేటుతో రుణం ఇస్తున్నాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త కార్లకు 7.95 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో రుణం మంజూరు చేస్తుంటే.. సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కార్లకు 13.75 నుంచి 16 శాతం వడ్డీ రేటుతో రుణం ఇస్తున్నాయి. అంటే వడ్డీ రేటులో చాలా వ్యత్యాసం క‌నిపిస్తుంది. పాత కార్లకు వర్తించే వడ్డీ రేటు కారు వయసుపై ఆధారపడి ఉంటుంది.

పాత కారు కొనడం వల్ల ప్రయోజనాలు..

రిజిస్ట్రేషన్ ఫీజు..

కొత్త కారుకి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్, ఆర్టీఓ ఫీజులు వంటివి వర్తిస్తాయి. కానీ పాత కారుకి ఇవి ప్ర‌త్యేకంగా ఉండ‌వు. కానీ అమ్మ‌కం దారుడు కారు ధ‌ర‌తో పాటు రిజిస్ట్రేష‌న్ ఫీజు వంటి ఇత‌ర ఖ‌ర్చుల‌తో క‌లిపి మొత్తంగా అయిన ఖ‌ర్చును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని దానిపైన త‌రుగుద‌ల లెక్కిస్తారు. అందువ‌ల్ల కొనుగోలు ధ‌ర‌లో ఇవ‌న్నీ మిళితం అయ్యి ఉంటాయి. రెండో యజమాని ప్ర‌త్యేకంగా చెల్లించ‌వ‌న‌వ‌సం లేదు. నామమాత్రపు ఫీజుతో కారు రెండో యజమాని పేరుకు బ‌దిలీ చేసుకుంటే సరిపోతుంది.

తరుగుదల..

కారు తరుగుదల ఉన్న ఆస్తి. అయితే పాత కారుతో పోలిస్తే కొత్త కారుకు తరుగుదల ఎక్కువ ఉంటుంది. కారు కొనుగోలు చేసిన మొదటి సంవత్సరం దాని విలువ 20 శాతం తగ్గిపోతుంది. కారు కొన్న మొదటి మూడు సంవత్సరాలలోనే కారు విలువ 40 శాతం వ‌ర‌కు త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది.

అయితే పాత కారు తరుగుదలను కచ్చితంగా ఇంతని చెప్పలేం. ఇది కారుకి అయిన డ్యామేజ్, నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. కానీ కొత్త కారుకి ఉండే తరుగుదలతో పోలిస్తే తక్కువే ఉంటుంది. ఉదాహరణకి మీరు పాత కారు కొనుగోలు చేసి ఒక సంవత్సరం తర్వాత అమ్మేద్దాం అనుకుంటే.. నిర్వహణ సరిగ్గా ఉంటే కొనుగోలు చేసిన ధరకు దగ్గరగానే విక్రయించవచ్చు.

మరి కొత్త కారు కొనాలా? పాత కారు కొనాలా? తెలుసుకుందాం..

విజయ్‌కు 25 సంవత్సరాలు. అతను ఎంచుకున్న కంపెనీ, మోడల్ కొత్త కారు ధర రూ. 6 లక్షలు అనుకుందాం. కారు కొనుగోలు కోసం అతను ఇప్పటి వరకు ఆదా చేసిన మొత్తం రూ. 1 లక్ష. ఒకవేళ అతను కొత్త కారు కొనుగోలు చేస్తే, డౌన్‌పేమెంట్ రూ. 1 లక్ష చెల్లించినా మిగిలిన రూ. 5 లక్షలు బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలి. 5 సంవత్సరాల కాలపరిమితిలో 7 శాతం వడ్డీ రేటుతో రూ. 5 లక్షల రుణం తీసుకుంటే అతను చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ.9,900. ఇక్కడ కాలపరిమితి పూర్తయ్యే నాటికి చెల్లించే మొత్తం వడ్డీ దాదాపు రూ.94 వేలు.

పాతకారైతే..

అదే మోడల్‌లో 3 సంవత్సరాల పాతదైన సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కారును రూ.4 లక్షలకు కొనుగోలు చేశాం అనుకుందాం. డౌన్‌పేమెంట్ రూ. 1 లక్ష చెల్లించినా మిగిలిన రూ. 3 లక్షలు బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలి. 5 సంవత్సరాల కాలపరిమితిలో 13.5 శాతం వడ్డీ రేటుతో రూ. 3 లక్షల రుణం తీసుకుంటే అతను చెల్లించాల్సిన ఈఎమ్ఐ రూ.6,903.  ఇక్కడ కాలపరిమితి పూర్తయ్యే నాటికి చెల్లించే వడ్డీ  దాదాపు రూ. 1.14 లక్షలు. 

పైన తెలిపిన ఉదాహరణలో పాత కారుకి రూ. 3 లక్షల రుణమే తీసుకున్నా వడ్డీ మాత్రం.. కొత్తకారు రుణానికి చెల్లించే వడ్డీకి మించిపోతోంది. అటువంటప్పుడు పాత కారు కంటే కొత్త కారు తీసుకోవడమే మేలు. పైగా ప్రీఓన్డ్ కారులో అంతర్గత పార్టుల రిపేర్లకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా పార్ట్ రిపేర్ వచ్చిందంటే రూ.వేలల్లోనే ఖర్చువుతుంది. కొత్త కారుకు అయ్యే నిర్వహణ ఖర్చుతో పోలిస్తే పాత కారు నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది. అంతేకాదు.. పాత కారుకు సాధారణంగా రుణ మొత్తంలో 70 శాతం వరకు మాత్ర‌మే రుణ మంజూరు చేసే అవకాశం ఉంది. 

పాత కారు ఎప్పుడు కొనవచ్చు?
మీరు ఎందుకోసం కారు కొనుగోలు చేస్తున్నారు? ఎంతకాలం ఉపయోగిస్తారు? అనే అంశంపై ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ మీరు వ్యాపార కార్య‌క‌లాపాల కోసం స్వ‌ల్ప కాల (1-3 సంవ‌త్స‌రాల‌) అవ‌స‌రాల కోసం కొంటే.. పాత కారును కొనుగోలు చేయ‌డం మేలు. ముందు చెప్పుకున్న‌ట్లు పాత కారుతో పోలిస్తే కొత్త కారుకు మొద‌టి మూడు సంవ‌త్స‌రాల‌లో త‌రుగుద‌ల ఎక్కువ ఉంటుంది. ఒక‌వేళ దీర్ఘ‌కాల వినియోగం కోసం కొనుగోలు చేస్తుంటే కొత్త కారు కొనుగోలు చేయ‌డం మేలు. ఎందుకంటే మొద‌టి నుంచి కారును మీరే ఆప‌రేట్ చేస్తారు కాబ‌ట్టి నిర్వ‌హ‌ణ‌లో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోగ‌లుగుతారు.

మీరు కొనుగోలు చేయాలనుకున్న కొత్త కారు ఎక్కువ ధర ఉండి.. కొనుగోలు కష్టం అనిపించినప్పుడు కూడా కొత్త కారుకు బదులు పాత కారుకు వెళ్లచ్చు. అయితే కారు కండీషన్ చూసుకోవాలి. ఒకవేళ కారు కండీషన్ బాగుండి, తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా, అలాగే కారు కొనుగోలు ధర మొత్తం లేదా ఎక్కువ శాతం మీరు స్వయంగా చెల్లించగలిగి.. తక్కువ లోన్ తీసుకునప్పుడు పాత కారు కొనుగోలు చేయవచ్చు. ఇటీవలే డ్రైవింగ్ నేర్చుకున్నా లేక నేర్చుకుంటున్నా పాత కారు తీసుకోవచ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని