New Cars: భలే కారులొస్తున్నాయ్‌.. ఆగండి!

 కార్ల మార్కెట్‌లో రాబోయే మూడు నెలలు చాలా ఆసక్తికరంగా ఉండబోతోందట. ఎందుంటే మార్కెట్‌లోకి

Updated : 24 May 2021 12:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  కార్ల మార్కెట్‌లో రాబోయే మూడు నెలలు చాలా ఆసక్తికరంగా ఉండబోతోందట. ఎందుంటే మార్కెట్‌లోకి  చాలా కొత్త కార్లు రాబోతున్నాయి. వాటిలో మారుతి, హ్యుందాయ్‌, మహీంద్రా, టాటా, ఫోక్స్‌వ్యాగన్‌, స్కోడాకు చెందిన కొత్త మోడళ్లు ఉండబోతున్నాయి. ఇంతకీ ఆ కార్లేంటో చూద్దామా!


కొత్త స్కోడా ఆక్టేవియా

స్కోడా నుంచి ఆక్టేవియా కారు త్వరలోనే వస్తుంది. ఇప్పటికే ఈ కార్ల తయారీని మన దేశంలో ప్రారంభించారు. ఈ కారు కేవలం పెట్రోల్‌ ఇంజిన్‌తోనే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గత ఓక్టావియా కార్లతో పోలిస్తే ఇందులో ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులు చేశారు. స్కోడా ఓక్టావియా సిరీస్‌లో ఇది నాలుగోది కావడం గమనార్హం. జూన్‌లో మార్కెట్‌లోకి తీసుకొస్తారంటున్న ఈ కారు ధర ₹18 లక్షల నుంచి ₹24 లక్షల వరకు ఉంటుందని సమాచారం. 


హ్యుందాయ్‌ అల్కాజార్‌

సిక్స్‌, సెవన్‌ సీటర్‌ కెపాసిటీలో హ్యుందాయ్‌లో కొత్తగా అల్కాజార్‌ అనే కారు రాబోతోంది. క్రెటా కారు తరహాలోనే ఈ కారును సిద్ధం చేశారు. అయితే లేటెస్ట్‌ ట్రెండ్‌కి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఇందులో 1.5 లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ వేరియెంట్స్‌ ఉంటాయి. ₹13 లక్షల నుంచి ₹20 లక్షల మధ్యలో ఈ కారు ధర ఉండొచ్చట. మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌ ఇస్తున్నారు. వచ్చే నెల ఈ కారు మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. 


టయోటా బెల్టా

మారుతి సుజుకి సియాజ్‌ కారును టయోటా బెల్టా పేరుతో రీబ్రాండ్‌ చేసి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. ఇందులో 1.5 లీటర్ల మైల్డ్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండబోతోంది. దాంతోపాటు ఇందులో ఫైవ్‌ స్పీడ్‌ మాన్యువల్‌ లేదా ఫోర్‌ స్పీడ్‌ ఆటో వేరియంట్‌లు ఇస్తున్నారట. మిగిలిన ఫీచర్లు సియాజ్‌లో ఉన్నట్లే ఉంటాయట. బెల్టా కారు మార్కెట్‌లోకి తెచ్చే విషయంలో టయోటా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రెండు, మూడు నెలల్లో రావొచ్చు. అలాగే దీని ధర ₹9 లక్ష ల నుంచి ₹12 లక్షలు ఉండొచ్చు అంటున్నారు. 


స్కోడా కుషాక్‌

స్కోడా నుంచి త్వరలో కుషాక్‌ అనే కారు రాబోతోంది. మిడ్‌ సైజ్‌ కారుగా రూపొందిన ఈ కారు MQB A0 IN ప్లాట్‌ఫామ్‌ కింద తీసుకొస్తున్నారు. జులైలో ఈ కారును అమ్మకాలకు తీసుకొస్తారని సమాచారం. ఇందులో ఒక లీటర్‌ టర్బో పెట్రోల్‌, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటాయి. విజన్‌ ఇన్‌ కాన్సెప్ట్‌లో ఈ కారును రూపొందించారు. ఇందులో ఇన్‌సైడ్‌ కేబిన్‌ కూడా ఉంటుంది. ఈ కారు ధర ₹9 లక్షల నుంచి ₹17 లక్షల వరకు ఉండొచ్చని భోగట్టా. 


మారుతి సుజుకి సెలేరియో

సెలేరియా సిరీస్‌లో రెండో జనరేషన్‌ కారును తీసుకురావాలని మారుతి సుజుకి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా త్వరలో సుజుకి సెలేరియా కొత్త జనరేషన్‌ కారును అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ కారును పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో విడుదల చేస్తారని సమాచారం. కేబిన్‌లో ఎక్కువ స్పేస్‌ ఉండేలా ఈ కారును సిద్ధం చేశారట. జూన్‌, జులైలో ఈ కారు మార్కెట్‌లోకి రావొచ్చు. ఇక ధర సంగతి చూస్తే... ₹5 లక్షల నుంచి ₹6 లక్షలు ఉండొచ్చని సమాచారం. 


ఫోక్స్‌వ్యాగన్‌ టైగన్‌

మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఫోక్స్‌ వ్యాగన్‌ ఓ కారును తీసుకురాబోతోంది. టైగన్‌ పేరుతో ఈ కారును త్వరలో మార్కెట్‌లోకి తీసుకొస్తారట. స్కోడా కుషాక్‌ కారుకు దగ్గరగానే దీని ఫీచర్లు ఉంటాయని అంటున్నారు. ధర విషయంలో ఈ సారి ఫోక్స్‌వ్యాగన్‌ కాంపిటేషన్‌లో ఉండాలని అనుకుంటోందట. సుమారు ధర ₹10 లక్షలుగా ఉన్న కారును ఆగస్టు ఆఖరులో మన దేశంలో మార్కెట్‌లోకి తెస్తారని అంటున్నారు. 


టాటా హెచ్‌బీఎక్స్‌

టాటా నుంచి మరికొద్ది రోజుల్లోనే  మైక్రో ఎస్‌యూవీ సెగ్మంట్‌లో టాటా హెచ్‌బీఎక్స్‌ అనే కారు రాబోతోంది. ఇందులో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ సెగ్మంట్‌లో  ప్రస్తుతం పెద్దగా కార్లు రావడం లేదు. ఈ కారును ఫైవ్‌ స్పీడ్‌, ఫైవ్‌ స్పీడ్‌ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌  వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అక్టోబరులో మార్కెట్‌లోకి వస్తుందంటున్న ఈ కారు ధర ₹5 లక్షల నుంచి ₹7 లక్షల వరకు ఉంటుందట. 


గమనిక: కార్ల విడుదల సమయం అంచనా మాత్రమే. దేశంలో కరోనా  - లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో కార్లను మార్కెట్‌లోకి వచ్చే సమయంలో మార్పులు ఉండొచ్చు. అలాగే ధరలు ప్రచారంలో ఉన్న అంశాల ఆధారంగా ఈ కథనం రాశాం. మార్కెట్‌లోకి వచ్చినప్పుడు మార్పులు జరగొచ్చు. అలాగే ఆ కార్లకు సంబంధించిన  పూర్తి వివరాలను ఆయా కార్ల కంపెనీల వెబ్‌సైట్‌లో పొందొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని