పోస్టాఫీసులో బాగా త‌గ్గిపోయిన‌ నూత‌న డిపాజిట్లు, పొదుపు ఖాతాలు

పోస్టాఫీస్ పొదుపు ఖాతా ఓపెనింగ్స్‌లో గ‌త 3 ఏళ్ల‌లో అత్య‌ధిక ప‌త‌నం న‌మోదైంది.

Published : 14 Dec 2021 11:20 IST

పోస్టాఫీస్‌కు కొత్తగా వ‌చ్చే డిపాజిట్లు, ఇత‌ర కొత్త చిన్న పొదుపు ఖాతాలు 3 సంవ‌త్స‌రాల క‌నిష్టానికి ప‌డిపోయాయి. పోస్టాఫీస్‌లో ప్రారంభించిన చిన్న పొదుపు ఖాతాలు ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టివ‌ర‌కు 2.33 కోట్ల ఖాతాలు ప్రారంభించ‌బ‌డ్డాయి. పోస్టాఫీసుల్లో కొత్త పొదుపు ఖాతాలు, టైమ్ డిపాజిట్లు, అనేక ఇత‌ర చిన్న పొదుపు ప‌థ‌కాలు 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 3 ఏళ్ల క‌నిష్టానికి ప‌డిపోయాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. 2018-19లో 4.65 కోట్ల చిన్న పొదుపు ఖాతాలు తెర‌వ‌బ‌డ్డాయి. ఇవి 2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 4.12 కోట్ల‌కు ప‌డిపోయాయి, 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 4.11 కోట్ల ఖాతాలు మాత్ర‌మే తెరిచారు. 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రం వ‌చ్చేస‌రికి ఇప్ప‌టి వ‌ర‌కు 2.33 కోట్ల ఖాతాలు తెర‌వ‌బ‌డ్డాయి.

పోస్టాఫీస్ పొదుపు ఖాతా ఓపెనింగ్స్‌లో గ‌త 3 ఏళ్ల‌లో అత్య‌ధిక ప‌త‌నం న‌మోదైంది. 2018-19 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 1.18 కోట్ల నూత‌న ఖాతాలు ప్రారంభ‌మ‌యితే 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రం వ‌చ్చే స‌రికి 72.1 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయాయి.

2018-19 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 11.5 ల‌క్ష‌ల ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఖాతాలు ప్రారంభ‌మ‌యితే, 2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 27.2 ల‌క్ష‌ల‌కు పెరిగాయి. కానీ 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 19.6 ల‌క్ష‌ల‌కు త‌గ్గాయి. అయితే 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు పీపీఎఫ్ ఖాతాలు కేవ‌లం 3 ల‌క్ష‌లు మాత్ర‌మే ప్రారంభ‌మ‌య్యాయి.

అయితే 3 ఏళ్ల నుండి గ‌మ‌నిస్తే పోస్టాఫీస్ చిన్న పొదుపు ప‌థ‌కాలకు ఇచ్చే వ‌డ్డీ రేట్లు కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డం జ‌రిగింది. ఒక సంవ‌త్స‌రం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ 2018-19 మొద‌టి త్రైమాసికంలో 6.60% వ‌డ్డీ రేటును క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం 2021-22 మూడ‌వ త్రైమాసికంలో ఇదే టైమ్ డిపాజిట్ 5.50% వ‌డ్డీ రేటును మాత్ర‌మే క‌లిగి ఉంది. 3 ఏళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ రేటు కూడా సంబంధిత కాలంలో 6.90% నుండి 5.50% కి ప‌డిపోయింది. ఈ కాలంలో పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.60% నుండి 7.10%కి ప‌డిపోయింది.

అయితే పోస్టాఫీసు వ‌డ్డీ రేట్లు త‌గ్గించినా కూడా పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు ప్ర‌ముఖ బ్యాంక్‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల కంటే కొద్దిగా ఎక్కువుగానే ఉన్నాయి. బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను బాగా త‌గ్గించిన త‌ర్వాత 2020-21 ఆర్ధిక సంవ‌త్స‌రం మొద‌టి త్రైమాసికం నుండి పోస్టాఫీస్ చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వం త‌గ్గించ‌డం ఆపివేసింది. పోస్టాఫీస్‌ల‌తో పోలిస్తే బ్యాంకుల్లో సాంకేతిక ఆధునిక‌ర‌ణ బాగా పెరిగిన కార‌ణంగా యువ‌త బ్యాంకుల వైపు మొగ్గు చూపి ఉంటార‌ని కొంద‌రి అభిప్రాయం. కోవిడ్ కార‌ణంగా కొంద‌రు ఉపాధి కోల్పోవ‌డం, చాలామంది ఆర్ధిక ప‌రిస్థితి తారుమారు అవ‌డం మూలంగా పోస్టాఫీసుల్లో మ‌దుప‌రులు త‌గ్గార‌ని, ఇంకా పోస్టాఫీస్‌లో మ‌దుపు చేసే పెట్టుబ‌డిదారుల‌లో కొంత మందిని స్టాక్ మార్కెట్ ఆక‌ర్షించి ఉండ‌వ‌చ్చ‌ని మార్కెట్ నిపుణుల అభిప్రాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని