Pakistan floods: పాకిస్థాన్‌ వరదల నష్టం అంచనా రూ.2.28 లక్షల కోట్లు!

ఇటీవల పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదలు 28 బిలియన్‌ డాలర్ల (రూ.2.28 లక్షల కోట్లు) నష్టాన్ని కలగజేశాయని ఆ దేశ ప్రభుత్వం అంచనా వేసింది....

Published : 28 Sep 2022 01:27 IST

ఇస్లామాబాద్‌: ఇటీవల పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదలు 28 బిలియన్‌ డాలర్ల (రూ.2.28 లక్షల కోట్లు) నష్టాన్ని కలగజేశాయని ఆ దేశ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ విపత్తులో దెబ్బతిన్న ప్రాంతాల పునర్‌నిర్మాణానికి 2-10 ఏళ్ల సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు వరదల వల్ల దేశంలో పేదరికం 5 శాతం పెరిగిందని.. దాదాపు 90 లక్షల నుంచి 1.20 కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువన ఉన్నారని పేర్కొంది. 18-20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని ‘పోస్ట్‌ డిజాస్టర్‌ నీడ్స్‌ అసెస్‌మెంట్‌ (PDNA)’ నివేదిక వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 23-25 శాతానికి ఎగబాకొచ్చని అంచనా వేసింది.

వ్యవసాయరంగ వృద్ధి -0.7 నుంచి -2.1 శాతానికి దిగజారొచ్చని పాకిస్థాన్‌ ప్రణాళిక సంఘం తెలిపింది. ఈ వరదల్లో అత్యధికంగా ప్రభావితమైన సింధ్‌ ప్రావిన్సులో 5.9 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లినల్లు పేర్కొంది. తర్వాత బలూచిస్థాన్‌లో 3.04 బి.డాలర్లు, పంజాబ్‌లో 0.55 బి.డాలర్లు, ఖైబర్‌ పంఖ్తుంక్వాలో 0.54 బి.డాలర్లు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 0.02 బి.డాలర్లు, గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లో 0.03 బి.డాలర్ల నష్టం జరిగినట్లు అంచనా వేసింది.

మరోవైపు పాక్‌లో ఆహార భద్రతా కార్యక్రమానికి మరో 10 మిలియన్‌ డాలర్లు అందజేస్తామని అమెరికా సోమవారం ప్రకటించింది. ఈ మేరకు వరద బాధితులకు కావాల్సిన సామగ్రితో 17 విమానాలు బయలుదేరాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వెల్లడించారు. గతంలో మాదిరిగానే తామెప్పుడూ పాక్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు పాక్‌కు అమెరికా 53 మి.డాలర్ల సాయాన్ని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని