Millennials: కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!

కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Published : 11 Jul 2024 17:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి తరం యువతకు 22 ఏళ్ల వయస్సులోనే మెరుగైన వేతనంతో ఉద్యోగాలొస్తున్నాయి. దీంతో వారి ఆర్థిక స్వేచ్ఛ మరింత పెరుగుతోంది. చిన్న వయసులోపెద్ద మొత్తంలో సొమ్ములు చేతికి అందడం వల్ల తక్షణ తృప్తి కోసం ఆరాటపడడం వీరికి ఉత్సాహం కలిగిస్తుంది. అలాంటి వారు సంపాదనను ఆస్వాదిస్తూ వారి ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వయసులోనే భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుని ఆర్థిక సమతుల్యతను సాధించడం చాలా కీలకం. యువ సంపాదపరుడిగా, డబ్బు విలువ, బడ్జెట్‌, పొదుపునకు సంబంధించిన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఉద్యోగ కెరీర్‌ ప్రారంభంలో ఆర్థిక తప్పిదాలు చేయకుండా ముందుకెలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం..

ప్రాధాన్యత ఇవ్వాల్సినవి..

మీకు విద్యార్థి రుణాలు, క్రెడిట్‌ కార్డు, వ్యక్తిగత రుణాలు వంటివి ఇప్పటికే ఉన్నట్లయితే వాటి రుణ చెల్లింపులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వండి. అప్పులను చెల్లించడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల వడ్డీ ఛార్జీలు పెరగడమే కాకుండా, క్రెడిట్‌ హిస్టరీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ ఆర్థిక పురోగతికి ఆటంకం కలగకుండా ఉండడానికి ప్రతి నెలా మీ ఆదాయంలో కొంత భాగాన్ని రుణ చెల్లింపుల కోసం కేటాయించండి. ముందుగా అధిక వడ్డీతో కూడిన రుణాలు తీర్చేయడంపై దృష్టి పెట్టండి. జాబ్‌ కెరీర్‌ కొత్తగా ప్రారంభించినవారు తమ ఆర్థిక వృద్ధిని పెంచే నిర్ణయాలు తీసుకోవాలి. వివాహం, గృహ నిర్మాణం, పదవీ విరమణ మొదలైన కీలక, పెద్ద లక్ష్యాల కోసం నిధులను సమకూర్చుకోవడానికి తమ కెరీర్‌ను ఉపయోగించాలి.

వృత్తిపరమైన అభివృద్ధి

యువత జాబ్‌ కెరీర్‌లోకి ప్రవేశించిన తర్వాత కూడా తమ నైపుణ్యాలను మరింత పెంచుకోవడానికి కృషి చేయాలి. వృత్తిపరమైన నైపుణ్యాలను మరింత పెంచుకోవడానికి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టడం చాలా మంచిది. దీనివల్ల జాబ్‌ కెరీర్‌ వృద్ధి చెందడమే కాకుండా తద్వారా సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి యజమాని అందించే శిక్షణా కార్యక్రమాలు కూడా ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయి. వాటిపై కూడా దృష్టి పెట్టాలి. నిరంతరం యువత తమంతట తాము వృత్తిపరంగా మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్తులో కెరీర్‌ వృద్ధితో పాటు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు.

క్రెడిట్‌ హిస్టరీ

ఒకసారి సంపాదన ప్రారంభమయితే ఆ వ్యక్తికి సంబంధించిన ఆర్థికపరమైన కార్యకలాపాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇందులో కీలకమైంది మంచి క్రెడిట్‌ హిస్టరీ సంపాదించడం. ఈ క్రెడిట్‌ హిస్టరీతోనే అనేక ఆర్థిక కార్యకలాపాలు ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా వ్యక్తిగత, గృహ, విద్యా రుణాలు వంటివి వేగంగా మంజూరవ్వడానికి మెరుగైన క్రెడిట్‌ స్కోరు చాలా కీలకం. దీన్ని సంపాదించడానికి మీ పొదుపు ఖాతా ఆధారంగా క్రెడిట్‌ కార్డు తీసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు వినియోగం, తిరిగి చెల్లింపులు సరిగ్గా ఉంటే క్రెడిట్‌ స్కోరు దానికదే మెరుగవుతుంది. కాబట్టి యువ ఉద్యోగులు తమ కెరీర్‌ మొదలైనప్పటి నుంచి ఆఖరి వరకు మెరుగైన క్రెడిట్‌ స్కోరును నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆర్థిక కార్యకలాపాలను భవిష్యత్తులో మరింత మెరుగుపరచుకోవడానికి ఇది చాలా అవసరం.

బడ్జెట్‌

చాలా మంది ఉద్యోగ కెరీర్‌ ప్రారంభంలో చేసే అత్యంత సాధారణ తప్పుల్లో ఒకటి బడ్జెట్‌ను రూపొందించడంలో నిర్లక్ష్యం చేయడం. సరైన బడ్జెట్‌ రూపొందించకపోతే.. ఆదాయం, ఖర్చులపై స్పష్టమైన అవగాహన లేకుండా అతిగా ఖర్చు చేయడం జరుగుతుంది. అందుచేత జీతం, ఏవైనా అదనపు ఆదాయ వనరులతో సహా మీ నెలవారీ ఆదాయాన్ని అంచనా వేయడానికి సమయాన్ని వెచ్చించండి. ఆపై ఇంటి అద్దె, యుటిలిటీలు, కిరాణా సామాగ్రి, రవాణా, ఇతర ఖర్చులతో సహా అన్నింటిని జాబితా రాయండి. బడ్జెట్‌ను రూపొందించడం వల్ల మీ ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థంగా నిర్వహించడమే కాకుండా, మీ ఆర్థిక పరిస్థితిపై ఒక స్పష్టత వస్తుంది. నెలవారీగా బడ్జెట్‌ రూపొందించుకోవడం వల్ల అనవసరమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయాలనే కోరిక చాలా వరకు తగ్గితుంది.

పొదుపు

సంపాదన మొదలుపెట్టినవారిలో చాలామంది పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వడంలో విఫలమవుతుంటారు. చాలా మంది కొత్త ఉద్యోగులు భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును కేటాయించకుండా వారి తక్షణ ఖర్చులను కవర్‌ చేయడంపై మాత్రమే దృష్టి పెడతారు. ఇది సరికాదు. సంపాదన ప్రారంభమైన తర్వాత కనీసం 6-12 నెలలకు సరిపడా అత్యవసర నిధిని సమకూర్చుకోవడం, పదవీ విరమణ కోసం దీర్ఘకాలం పాటు ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌లో సిప్‌ చేయడం, ఇల్లు కొనుగోలుకు 20% వరకు డౌన్‌ పేమెంట్‌ను సమకూర్చుకోవడం లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. ఇవన్నీ భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపడానికి ఉపయోగపడేవి అని తెలుసుకోవాలి. ప్రతి నెలా ఈ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మీ ఆదాయంలో కనీసం 25% పొదుపు కోసం కేటాయించండి. యువకులుగా ఉన్నప్పుడే పొదుపు ప్రారంభిస్తే క్రమశిక్షణతో కూడిన ఆర్థిక జీవితంలోకి ప్రవేశించినట్లవుతుంది. సంపాదన ప్రారంభమయిన యువతకు మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ ద్వారా మదుపు సరైనా ఎంపికగా చెప్పొచ్చు. క్రిప్టో కరెన్సీ వంటి అధిక రిస్క్‌ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం సరైన ఎంపిక కాదు.

ఇలాంటి ఖర్చులొద్దు

సంపాదన ప్రారంభంలో చాలామంది యువత తమ జీవనశైలిని ఒక్కసారిగా మార్చేస్తారు. తరచూ బయట రెస్టరంట్లకు వెళ్లి భోజనం చేయడం, బయట నుంచి ఫుడ్‌ ఆర్డర్లను ఇంటికే తెప్పించుకోవడం, వీకెండ్‌ విహారాలు లాంటివి చేస్తారు. కొత్త ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్లపై విపరీతమైన ఆసక్తి పెంచుకోవడం కూడా అనవసర ఖర్చుగానే భావించాలి. ఫ్యాన్సీయర్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం, హై టెక్నాలజీతో కూడిన ఖరీదైన కార్లు వంటి వాటిపై ఖర్చు చేయడం వల్ల ఆర్థిక స్ధితి క్రమంగా తగ్గడమే కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు ఆటంకం కలుగుతుంది. అలవాట్ల కంటే భవిష్యత్‌ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మేలు. భవిష్యత్‌ అవసరాలపై ప్రాధాన్యం ఇస్తూనే ఆదాయంలో తక్కువ భాగాన్ని విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కేటాయించండి.

బీమా

చాలా మంది యువ ఉద్యోగులు ఆరోగ్యంతో ఉత్సాహవంతులుగా ఉండడం వల్ల బీమా కవరేజ్‌ ప్రాముఖ్యతను విస్మరిస్తుంటారు. ప్రమాదాలు, ఊహించని సంఘటనలు ఎప్పుడైనా జరగొచ్చు. జీవిత బీమా కలిగి ఉండడం 2-3 నెలలు ఆలస్యమయినా పర్వాలేదు గానీ, ఆరోగ్య బీమా వెంటనే తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య బీమాకు చెందిన ప్రీమియాన్ని ఆరోగ్యం మీద పెట్టుబడిగా, జీవిత బీమా ప్రీమియాన్ని జీవితంపై పెట్టుబడిగా భావించాలి. ఖర్చుగా భావించకూడదు.

పన్ను ప్రణాళిక

మీ ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించడంలో పన్ను ప్రణాళిక అనేది ఒక ముఖ్యమైన అంశం. అయినప్పటికీ చాలా మంది యువ ఉద్యోగులకు పన్నులపై అవగాహన ఉండదు. పన్ను చట్టాలు ఎంతవరకు ఉపయోగపడతాయో తెలుసుకోవడానికి కొద్దిగా సమయాన్ని వెచ్చించాలి. ఈక్విటీ-లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీంలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌), పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సీ) లేదా పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఆరోగ్య బీమా పథకాలు వంటి అందుబాటులో ఉన్న వివిధ పన్ను ఆదా పెట్టుబడి ఎంపికల గురించి అవగాహన పెంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని