LIC Jeevan Azad: ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్‌.. జీవన్‌ ఆజాద్‌ పూర్తి వివరాలివీ..

LIC unveils Jeevan Azad: జీవన్‌ ఆజాద్‌ పేరిట ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాల కలయికతో ఈ పాలసీని వస్తోంది.

Updated : 20 Jan 2023 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త పాలసీని ప్రారంభించింది. జీవన్ ఆజాద్ (Jeevan azad) (ప్లాన్‌ నం. 868) పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది. వ్యక్తిగత పొదుపు, జీవిత బీమాల కలయికతో ఈ ప్లాన్‌ వస్తోంది. ఎల్‌ఐసీ జీవన్‌ ఆజాద్‌ (LIC Jeevan Azad).. లిమిటెడ్‌ పీరియడ్‌ పేమెంట్‌ ఎండోమెంట్‌ ప్లాన్‌. పాలసీదారుడు పాలసీ కాలవ్యవధిలో మరణిస్తే కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే.. గ్యారెంటీ ఇచ్చిన మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తారు. ఈ పాలసీలో రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది.

హామీ మొత్తం..

ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్.. కనీస ప్రాథమిక హామీ రూ.2 లక్షలు. గరిష్ఠ ప్రాథమిక హామీ రూ.5 లక్షలు. పాలసీ గరిష్ఠ కాలపరిమితి 20 ఏళ్లు.

ప్రీమియం వ్యవధి..

ప్రీమియం చెల్లింపు వ్యవధి పాలసీ కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. పాలసీ కాలపరిమితి నుంచి 8 ఏళ్లు తీసివేస్తే వచ్చిన కాలవ్యవధి పాటు ప్రీమియం చెల్లింపులు చేయాలి. ఉదా: ఒకవేళ మీరు 20 సంవత్సరాల పాలసీ కాలవ్యవధిని ఎంచుకుంటే ప్రీమియం చెల్లింపు వ్యవధి 12 ఏళ్లు (20-8) ఉంటుంది.

డెత్ బెనిఫిట్..

రిస్క్ ప్రారంభమైన తేదీ తర్వాత గానీ, మెచ్యూరిటీ తేదీకి ముందు గానీ పాలసీ వ్యవధిలో పాలసీదారుడు మరణిస్తే డెత్ బెనిఫిట్ చెల్లిస్తారు. ఇది 'బేసిక్ సమ్ అష్యూర్డ్' లేదా వార్షిక ప్రీమియం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డెత్ బెనిఫిట్ అనేది మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.

గమనిక: సాధారణంగా సంప్రదాయ బీమా పాలసీలలో రాబడి కాస్త తక్కువగా ఉండొచ్చు. పాలసీ ఎంచుకునే ముందు పాలసీ డాక్యుమెంట్ చదివి దాని గురించి వివరంగా తెలుసుకోవడం మేలు. వీలయితే ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని