Income Tax: కొత్త పన్ను విధానంతో లబ్ధిపొందలేని వారు తక్కువే: CBDT ఛైర్మన్‌

Income Tax: తాజా బడ్జెట్‌లో ఆదాయ పన్నులో ప్రతిపాదించిన మార్పుల ద్వారా కొత్త, పాత పన్ను విధానాల్లో అంతరం తగ్గిందని సీబీడీటీ ఛైర్మన్‌ అన్నారు. 

Published : 02 Feb 2023 15:35 IST

దిల్లీ: కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) తాజా బడ్జెట్‌ (Budget 2023)లో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని ‘కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా అన్నారు. కొత్త స్లాబులు, పన్ను రేట్ల ద్వారా క్రమంగా మినహాయింపులు, రాయితీలను ఎత్తివేయడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. తద్వారా పన్నుల భారాన్ని తగ్గించాలన్న వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారుల డిమాండ్‌ సైతం నెరవేరుతుందన్నారు.

కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) ప్రభుత్వం రెండేళ్ల క్రితమే తీసుకొచ్చినట్లు నితిన్‌ గుప్తా గుర్తుచేశారు. ఆ ప్రయోజనాలు ఇంకా అందరూ వినియోగించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలోనే స్లాబులు, పన్ను రేట్లను ప్రభుత్వం సవరించిందన్నారు. ఇప్పుడు ప్రయోజనాలు పన్ను చెల్లింపుదారులకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కొత్త పన్ను విధానం (New Tax Regime) ద్వారా లబ్ధిపొందలేనివారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని పేర్కొన్నారు. అలాంటి వారు పాత పన్ను విధానం (Old Tax Regime)లోనే కొనసాగొచ్చన్నారు.

కొత్త పన్ను విధానంలోని అన్ని అంశాలను ప్రభుత్వం లోతుగా పరిశీలించిందని నితిన్‌ గుప్తా తెలిపారు. తర్వాతే తాజా బడ్జెట్‌లో మార్పులను ప్రతిపాదించిందని పేర్కొన్నారు. కొత్త, పాత విధానాల మధ్య అంతరాన్ని తగ్గించిందన్నారు. ప్రామాణిక తగ్గింపు (standard deduction)ను కొత్త విధానంలోనూ ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కొత్త విధానాన్ని ఎంచుకున్న ఉద్యోగులకు పాత విధానంతో సమానంగా ప్రయోజనం ఉంటుందని తెలిపారు.

కొత్త విధానాన్ని డీఫాల్ట్‌ చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని నితిన్‌ గుప్తా తెలిపారు. ఏ విధానమైనా ఎంచుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. డీఫాల్ట్‌ అనేది కేవలం ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ తెరపై కనిపించేంత వరకే పరిమితమని తెలిపారు. దాన్ని మార్చుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ కాలిక్యులేటర్‌ కూడా ఉంటుందన్నారు. రెండు విధానాల్లో ఎంత పన్ను కట్టాల్సి వస్తుందో అక్కడే చూసుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: రూ.7 లక్షల వరకు ఆదాయపన్ను పడదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని