పాత పన్ను వ్యవస్థ vs కొత్త పన్ను వ్యవస్థ..

పాత పన్ను వ్యవస్థ 3 టైర్ పన్ను రేటు స్లాబ్‌లను అందిస్తుంది.. ఈ సంవత్సరం టీడీఎస్ వద్ద పన్ను మినహాయింపుల కోసం యజమానులకు వారి ఆదాయపు పన్ను డిక్లరేషన్ చేస్తున్నప్పుడు, పన్ను మినహాయింపులను ..

Published : 24 Dec 2020 16:48 IST

పాత పన్ను వ్యవస్థ 3 టైర్ పన్ను రేటు స్లాబ్‌లను అందిస్తుంది.. ఈ సంవత్సరం టీడీఎస్ వద్ద పన్ను మినహాయింపుల కోసం యజమానులకు వారి ఆదాయపు పన్ను డిక్లరేషన్ చేస్తున్నప్పుడు, పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసే సాంప్రదాయ పాత పన్ను వ్యవస్థను ఎన్నుకోవాలా లేదా ఫైనాన్స్ యాక్ట్ 2020 లో ప్రవేశపెట్టిన కొత్త ఆప్షనల్ పన్ను వ్యవస్థలో తగ్గింపులు, తక్కువ పన్ను రేట్లను క్లెయిమ్ చేసుకోవాలా అని పన్ను చెల్లింపుదారులు గందరగోళానికి గురవుతున్నారు.

పాత పన్ను వ్యవస్థ : పాత పన్ను వ్యవస్థ 3 టైర్ పన్ను రేటు స్లాబ్‌లను అందిస్తుంది. వాటిలో ఒకటి, సంవత్సరానికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయానికి 5 శాతం, రెండవది, సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయానికి 20 శాతం, ఇక మూడవది సంవత్సరానికి రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయానికి 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత పథకం కింద పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, వ్యక్తులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ), హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), కొన్ని ఇతర అలవెన్సులు వంటి పన్ను రహిత భత్యాలను పొందవచ్చు. అదనంగా, రూ. 50000 ప్రామాణిక మినహాయింపు, గృహ రుణంపై చెల్లించే వడ్డీకి తగ్గింపు, సెక్షన్ 80సీ కింద పేర్కొన్న నిర్దిష్ట పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ పన్ను అవుట్‌గోను తగ్గించుకునేందుకు అనుమతిస్తారు. ఈ పన్ను మినహాయింపులు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

కొత్త పన్ను వ్యవస్థ: ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం (ఎల్‌టీసీ, హెచ్‌ఆర్‌ఏ, ప్రామాణిక మినహాయింపు, చాప్టర్ VI కింద తగ్గింపు మొదలైనవి) అందుబాటులో ఉన్న 70 మినహాయింపులు, తగ్గింపులను పన్ను చెల్లింపుదారులు విరమించుకుంటే, తక్కువ పన్ను రేట్లతో కొత్త పన్ను వ్యవస్థ ఆరు స్లాబ్‌లను అందిస్తుంది. కొత్త పన్ను రేట్లు: సంవత్సరానికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల ఆదాయానికి 5 శాతం, సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 7. 5 లక్షల ఆదాయానికి 10 శాతం, సంవత్సరానికి రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల ఆదాయానికి 15 శాతం, సంవత్సరానికి రూ. 10 లక్షల నుంచి రూ. 12. 5 లక్షల ఆదాయానికి 20 శాతం, సంవత్సరానికి రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయానికి 25 శాతం, సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 లక్షల వరకు వచ్చే ఆదాయానికి రెండు పన్నుల పరిధిలో మినహాయింపు ఉంది.

ఎంపిక : కొత్త పన్ను వ్యవస్థలోని తక్కువ పన్ను రేట్లు తక్కువ పన్నులకు దారి తీస్తుంది. ఏదేమైనా, తగ్గిన రేట్ల రూపంలో అందించే ప్రయోజనాలు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి, ఎందుకంటే మినహాయింపులు, తగ్గింపులను తొలగించడం ద్వారా ఇది ప్రతికూలంగా ఉంటుంది. పన్ను ఉపశమనం పొందటానికి పెట్టుబడులు పెట్టిన వారికి కొత్త పన్ను వ్యవస్థ ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. గృహ రుణం లేని పన్ను చెల్లింపుదారులు, రెంట్ ఫ్రీ యకామిడేషన్ లో ఉండడం, చిన్న పెట్టుబడులు లేదా పెట్టుబడులు పెట్టకుండా ఉండడానికి ఇష్టపడటం కొత్త పథకానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

లెక్కల ఆధారంగా, రూ. 2.5 లక్షలకు మించి మొత్తం తగ్గింపులు / మినహాయింపులను క్లెయిమ్ చేసే పన్ను చెల్లింపుదారులు పాత పథకం కింద ప్రయోజనం పొందుతారు. ఏదేమైనా, పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను వ్యవస్థలో వారి పన్ను బాధ్యతపై విశ్లేషణ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను మినహాయింపులు పొందుతుంటే, పాత పన్ను వ్యవస్థలోనే పన్ను చెల్లించడం కొనసాగించడం మంచిది.

ఎప్పుడు ఎంపిక చేసుకోవాలి : వ్యాపార ఆదాయం లేని వ్యక్తులకు ప్రతి సంవత్సరం పాత లేదా క్రొత్త పథకాలలో ఒకదాన్ని ఎంచుకోవడానికి ఆప్షన్ ఇస్తారు, అందువలన ప్రతి సంవత్సరం జాగ్రత్తగా మూల్యాంకనం చేసిన తరువాత ప్రయోజనకరమైన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఏదేమైనా, వ్యాపార ఆదాయం ఉన్న వ్యక్తులు ఒకసారి ఎంపిక చేసుకున్న ఆప్షనే అంతిమంగా ఉంటుంది. నెలవారీ జీతం పొందే వారు, టీడీఎస్ ప్రయోజనం కోసం యజమానికి పన్ను డిక్లరేషన్ చేసేటప్పుడు పాత, కొత్త పథకాలలో ఒకదాన్ని ఎంచుకోవడానికి ఒక ఆప్షన్ ను అందిస్తారు. టీడీఎస్ కోసం యజమానికి డిక్లరేషన్ చేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా ఒక ఆప్షన్ ను ఎంచుకున్నప్పటికీ, ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో ఆప్షన్‌ను మార్చడానికి లేదా మరొకదాన్ని ఎంచుకోవడానికి అతనికి అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని