Quiet Hiring: క్వైట్‌ హైరింగ్‌.. కార్పొరేట్‌లో ఇప్పుడిదో కొత్త ట్రెండ్‌!

Quiet Hiring: కంపెనీలో అప్పటికే ఉన్న నిపుణులను అత్యవసర విభాగాల్లో ఉపయోగించుకోవడం.. అంతగా ఉత్పాదకతలేని విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకోవడం.. ఇలా కంపెనీలు క్వైట్‌ హైరింగ్‌ ద్వారా సమతుల్యతను సాధిస్తున్నాయి.

Updated : 27 Feb 2023 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కారణంగా కార్పొరేట్‌ రంగంలో కొత్త కొత్త ట్రెండ్‌లు పుట్టుకొచ్చాయి. గ్రేట్‌ రెసిగ్నేషన్‌, క్వైట్‌ క్విట్టింగ్‌, మూన్‌లైటింగ్‌, రేజ్‌ అప్లయింగ్‌.. అందులో భాగమే. తాజాగా క్వైట్‌ హైరింగ్‌ (Quiet Hiring) అనే కొత్త ట్రెండ్‌ వెలుగులోకి వచ్చింది.

కంపెనీ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో క్వైట్‌ హైరింగ్‌ (Quiet Hiring)కు ప్రాధాన్యం పెరుగుతోంది. కొత్త వారిని నియమించుకోకుండానే  కంపెనీలోనే కావాల్సిన నైపుణ్యాలున్న వ్యక్తిని కనిపెట్టడాన్నే క్వైట్‌ హైరింగ్‌ (Quiet Hiring)గా వ్యవహరిస్తున్నారు. సంస్థలో అంతర్గతంగా ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయడమే ఈ కొత్త ట్రెండ్‌.

కంపెనీలో ఉద్యోగుల కొరత ఉండి, టార్గెట్‌లు అందుకోవడానికి గడువు సమీపిస్తున్న సమయంలో క్వైట్‌ హైరింగ్‌ (Quiet Hiring) చాలా ఉపయోగకరంగా ఉంటుందని టెక్నికల్‌ కన్సల్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ కంపెనీ గార్ట్‌నర్‌ తెలిపింది. సంస్థలో ఇతర విభాగాల్లో ఉండే ఉద్యోగులకు కొత్త విధులను అప్పగించడం ద్వారా కొరతను భర్తీ చేస్తున్నారు. అవసరమైతే వారికి నైపుణ్య శిక్షణను కూడా అందిస్తున్నారు. ఇలా కంపెనీలో అప్పటికే ఉన్న నిపుణులను అత్యవసర విభాగాల్లో ఉపయోగించుకోవడం.. అంతగా ఉత్పాదకత లేని విభాగాల్లోని వారిని తగ్గించుకోవడం.. ఇలా కంపెనీలు క్వైట్‌ హైరింగ్‌ ద్వారా సమతుల్యతను సాధిస్తున్నాయి.

ఉదాహరణకు.. వార్షిక లక్ష్యాలను అందుకోవడానికి కంపెనీకి మరో ఐదుగురు డేటా సైంటిస్ట్‌లు అవసరం అనుకుందాం. కొత్త వారిని ఆ స్థానాల్లో భర్తీ చేసేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అలా అయితే, లక్ష్యాలను అందుకోవడం కష్టం. అలాంటప్పుడు కంపెనీలో ఇతర విభాగాల్లో ఉన్న ఐదుగురు ఉద్యోగులను ఖాళీ స్థానాల్లో భర్తీ చేస్తారు. మానవ వనరులు, మార్కెటింగ్‌ విభాగాల్లో ఉండే డేటా అనలిస్ట్‌లను ఆ స్థానాల్లో వాడుకుంటారు. దీన్నే క్వైట్‌ హైరింగ్‌గా వ్యవహరిస్తారు.

ఈ కొత్త ట్రెండ్‌ ఉద్యోగులకు కూడా ప్రయోజనకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి, సవాళ్లతో కూడిన పనిని చేపట్టి టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ఇదో అవకాశం. అలాగే కొన్ని బోనస్‌లు, అదనపు వేతనం, పనివేళల్లో కావాల్సిన మార్పుల వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. 2022లో గూగుల్‌లో ఈ కొత్త ట్రెండ్‌ బాగా ఉపయోగపడినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని