Recession: వచ్చే ఏడాదే ఆర్థిక మాంద్యం.. సీఈబీఆర్‌ అంచనా!

Recession: రేట్ల పెంపు మూలంగా వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం తప్పదని సీఈబీఆర్‌ తెలిపింది.

Published : 26 Dec 2022 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచం వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం (Recession)లోకి జారుకుంటుందని ‘సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ (CEBR)’ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని (Inflation) అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు రుణాలను మరింత భారం చేస్తున్నాయని పేర్కొంది. దీంతో చాలా దేశాల ఆర్థిక వృద్ధి వచ్చే సంవత్సరం క్షీణిస్తుందని అంచనా వేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో 100 ట్రిలియన్‌ డాలర్ల మైలురాయిని దాటిందని CEBR తెలిపింది. కానీ, పెరుగుతున్న ధరల్ని అదుపు చేసేందుకు చేపడుతున్న చర్యల వల్ల 2023లో వృద్ధి ఆగిపోతుందని వివరించింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఇంకా ఫలించలేదని పేర్కొంది. ఆర్థికంగా కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా.. 2023లోనూ రేట్ల పెంపు కొనసాగుతుందని అంచనా వేసింది. ధరల్ని అందుబాటు స్థాయిలోకి తీసుకొచ్చేందుకు చేపట్టే చర్యలకు రానున్న కొన్నేళ్ల పాటు బలహీన వృద్ధిరేటు రూపంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది.

సీఈబీఆర్‌ నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు..

అమెరికాను దాటేసి చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడానికి 2036 వరకు వేచి చూడాల్సిందే. గతంలో అంచనా వేసిన దాని కంటే ఇది ఆరేళ్లు ఆలస్యం. జీరో కొవిడ్‌ విధానం, పాశ్చాత్య దేశాలతో వాణిజ్య వివాదాలు చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అడ్డంకిగా మారాయి. ఒకవేళ తైవాన్‌ ఆక్రమణ వంటి చర్యలకు చైనా దిగితే.. అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల వచ్చిన ఇబ్బందులతో పోలిస్తే చైనా, పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగి మాంద్యం మరింత బలంగా ఉంటుంది. ఇదే జరిగితే చైనాకూ తీవ్ర నష్టం తప్పదు. ఆర్థికంగా అగ్రరాజ్యంగా నిలవాలనుకుంటున్న ఆ దేశ ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉంది.

ప్రపంచంలో మూడో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ 2035 నాటికి అవతరిస్తుంది. 2032 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది.

వచ్చే 15 ఏళ్ల పాటు యూకే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఫ్రాన్స్‌ ఏడో స్థానంలో కొనసాగుతుంది. బ్రిటన్‌లో విధానాల రూపకల్పన, దూరదృష్టిలో లోపాలున్నాయి. ఫలితంగా.. ఇతర ఐరోపా దేశాలతో పోలిస్తే వేగంగా వృద్ధి చెందుతున్న బ్రిటన్‌.. ఆ స్థానాన్ని కోల్పోతుంది.

యావత్తు ప్రపంచం స్వచ్ఛ ఇంధనం దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో సహజ వనరులు అధికంగా ఉన్న వర్ధమాన దేశాలు వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తాయి.

80,000 డాలర్ల తలసరి జీడీపీని సాధించడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా చాలా దూరంలో ఉంది. మరోవైపు పారిశ్రామికీకరణకు ముందు నాటి 1.5 డిగ్రీల భూతాప లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశాలు ఇంకా చాలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని