Stock Market: అక్టోబరు నెలకు నష్టాలతో స్వాగతం!

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అక్టోబరు నెలను నష్టాలతో ప్రారంభించాయి.

Published : 03 Oct 2022 09:33 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు అక్టోబరు నెలకు నష్టాలతో స్వాగతం పలికాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మార్కెట్లు గతవారం భారీ నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. సెప్టెంబరులో విదేశీ మదుపర్లు తిరిగి నికర అమ్మకందారులుగా నిలవడం మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీసింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం కూడా సూచీలపై ప్రభావం చూపుతోంది.  మరోవైపు శుక్రవారం నాటి భారీ ర్యాలీ నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న ఆర్‌బీఐ ధీమాతో మార్కెట్లలో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 141 పాయింట్ల నష్టంతో 57,285 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 17,067 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.78 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎలద్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, బజాజ్ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, ఏషియన్ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అపోలో ట్యూబ్స్‌ విక్రయాలు భారీ స్థాయిలో పెరిగి 6.02 లక్షల టన్నులకు చేరింది. త్రైమాసికం ప్రాతిపదికన 42 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 10.25 లక్షల టన్నుల విక్రయాలు జరిగాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో అమ్మకాలు 8 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.

ఐషర్‌ మోటార్స్‌: ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయిన వీఈ కమర్షియల్ వెహికల్స్‌ సెప్టెంబరులో 6,631 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాదితో పోలిస్తే 9.2 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో విక్రయాలు 67.6 శాతం భారీ వృద్ధితో 35,085 యూనిట్లకు చేరాయి.

కోల్‌ ఇండియా: సెప్టెంబరులో బొగ్గు ఉత్పత్తి 12.3 శాతం పెరిగి 45.7 మిలియన్‌ టన్నులకు చేరినట్లు కోల్‌ ఇండియా వెల్లడించింది.

ఇండియాబుల్స్‌ హౌసింగ్ ఫైనాన్స్‌: ఈ కంపెనీ రుణరేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. అక్టోబరు 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని