Stock Market: ఫెడ్‌ ఎఫెక్ట్‌: భారీ లాభాల్లో మొదలైన దేశీయ మార్కెట్లు..

అమెరికా ఫెడ్‌ నిర్ణయం దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. 

Published : 13 Jun 2024 09:38 IST

ఇంటర్నెట్‌డెస్క్: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో గురువారం ఉదయం దేశీయ మార్కెట్లు (Stock Market) ఉత్సాహంగా ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9.23 సమయంలో నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 23,444 వద్ద, సెన్సెక్స్‌ 330 పాయింట్లు పెరిగి 76,937 వద్ద ట్రేడవుతున్నాయి. ఆస్ట్రా మైక్రోవేవ్స్‌, జైకార్ప్‌, జేపీ అసోసియేట్స్‌, మైక్రోటెక్‌ డెవలపర్స్‌, దిలీప్‌ బిల్డ్‌కాన్‌ షేర్ల విలువ పెరగ్గా.. మారికో లిమిటెడ్‌, ఎల్కాన్‌ ఇంజినీరింగ్‌, డాబర్‌ ఇండియా, సన్‌ టీవీ నెట్‌వర్క్‌, హిందూస్థాన్‌ యునిలీవర్‌ షేర్ల ధరలు కుంగాయి.

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని చైనా, జపాన్‌ ప్రధాన సూచీలు మినహా మిగిలిన ముఖ్యమైన మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. వడ్డీ రేట్లపై ఫెడ్‌ నిర్ణయంతో నిన్న అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. డోజోన్స్‌ 51 పాయింట్లు పతనం కాగా.. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 లాభపడ్డాయి. 

ఇక మార్కెట్‌ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్, వరుసగా ఏడో సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25- 5.50 శాతం వద్దే కొనసాగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం స్థిరంగా 2 శాతం వైపునకు చలిస్తోందని గట్టి నమ్మకం కుదిరాకే, వడ్డీ రేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఫెడ్‌ స్పష్టం చేసింది.  అయితే ఈ ఏడాది ఒకసారి మాత్రమే వడ్డీరేట్ల కోతకు అవకాశం ఉందని సంకేతం ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని