Nirav Modi: భారత్‌కు అప్పగింతపై సుప్రీంకోర్టుకు వెళతా.. అనుమతి కోరిన నీరవ్‌ మోదీ!

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోదీ యూకే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. తనని భారత్‌కు అప్పగించొద్దన్ని అభ్యర్థనను లండన్‌ హైకోర్టును తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

Updated : 24 Nov 2022 14:21 IST

లండన్‌: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తనను భారత్‌కు అప్పగించాలన్న తీర్పును యూకే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనుమతి కోరుతూ లండన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మానసిక అనారోగ్యం దృష్ట్యా తనను భారత్‌కు అప్పగించొద్దంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని ఇటీవలే కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే ముప్పు ఉందన్న కారణంతో నీరవ్‌ను భారత్‌కు అప్పగించకుండా ఉండటం సరికాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.11 వేల కోట్ల మేరకు మోసగించి నీరవ్‌ మోదీ బ్రిటన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే.

నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి సమ్మతిస్తూ గతేడాది అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నీరవ్‌ లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీల్‌పై ఈ ఏడాది ఆరంభం నుంచి విచారణ జరిపిన న్యాయస్థానం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. అయితే, హైకోర్టు తీర్పును 14 రోజుల్లోగా నీరవ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసుకునే వెసులుబాటు ఉండడంతో తాజాగా ఆయన అందుకు అనుమతి కోరారు. అక్కడ కూడా ఆయనకు ప్రతికూల నిర్ణయం వెలువడితే.. యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ నుంచి 39వ రూల్‌ను కోరుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవకాశంతో నీరవ్‌ తనను భారత్‌కు అప్పగించకుండా ప్రభుత్వానికి వినతి చేసుకోవచ్చు. దీంతో నీరవ్‌ను భారత్‌కు రప్పించే విషయంలో సందిగ్ధం వీడడానికి మరికొంత కాలం పట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని