Pre-Budget Meeting: బడ్జెట్‌ 2024.. రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలమ్మ భేటీ

Pre-Budget Meeting: బడ్జెట్‌ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం సమావేశమయ్యారు.

Updated : 22 Jun 2024 11:40 IST

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2024)ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగానే పలు రంగాల ప్రతినిధులతో ఆ శాఖ ముందస్తు బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు (Pre-Budget Meeting) నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం భేటీ అయ్యారు.

దిల్లీలోని భారత్‌ మండపంలో ఈ సమావేశం జరిగింది. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలమ్మ (Nirmala Sitharaman) సంప్రదింపులు జరిపారు. వార్షిక పద్దుపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. నిన్న ఎంఎస్‌ఎంఈ రంగ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సంప్రదింపులు జరిపారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రకటించింది. వచ్చే నెలలో జరగబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ఆహార పదార్థాల ధరల వల్లే ద్రవ్యోల్బణం తగ్గడంలో జాప్యం

మధ్యాహ్నం జీఎస్‌టీ మండలి భేటీ..

మరోవైపు, శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్‌టీ మండలి (GST Council) 53వ సమావేశం జరగనుంది. చివరిసారిగా జీఎస్‌టీ మండలి 2023 అక్టోబరు 7న భేటీ కాగా.. దాదాపు 8 నెలల విరామం తర్వాత మళ్లీ సమావేశం కానుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగానికి 28% జీఎస్‌టీ (GST) అమలుపై ఇందులో ప్రధానంగా సమీక్షించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక, జౌళి, ఎరువులకు ఇన్‌వర్టెడ్‌ సుంకం (తుది ఉత్పత్తిపై కంటే ముడి సరకు పైనే పన్ను రేట్లు ఎక్కువగా ఉండటం) అంశంపైనా చర్చించే అవకాశం ఉంది.

ఇదేకాకుండా పన్ను రేట్ల హేతుబద్దీకరణ అంశం కూడా జీఎస్‌టీ మండలి వద్ద పెండింగ్‌లో ఉంది. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్ల హేతుబద్దీకరణ కమిటీని ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఏడుగురు సభ్యులుండే ఈ మంత్రుల కమిటీకి కన్వీనర్‌గా బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరిని నియమించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని