Budget 2023: కొత్త ఆదాయ పన్ను విధానంతో లబ్ధి.. మారాలో, లేదో మీ ఇష్టమన్న నిర్మలమ్మ!
ప్రత్యక్ష పన్నుల్లో సరళీకరణ కోసం దేశమంతా ఎదురుచూసిందని.. అందువల్ల తాము తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం ఇప్పుడు అధిక ప్రోత్సాహకాలతో ఆకర్షణీయంగా మారినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.
దిల్లీ: ఆదాయపు పన్ను(income tax)లో చేసిన గణనీయమైన మార్పులు మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంతో ప్రస్తుతం కొత్త పన్నుల విధానం అధిక ప్రోత్సాహకాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. వేతనజీవులు నిస్సందేహంగా పాత విధానం నుంచి కొత్తదానికి మారొచ్చని సూచించారు. అయితే, తాము ఎవరినీ బలవంత పెట్టబోమన్నారు. కానీ కొత్త విధానం గొప్ప రాయితీలు కల్పిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్(union budget 2023)ను ప్రవేశ పెట్టిన అనంతరం ఆమె దిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాత విధానంలోనే కొనసాగాలనుకొనే వారు కొనసాగవచ్చన్నారు. కొత్త పన్ను విధానం ద్వారా ఆదాయ పన్ను చెల్లింపులో శ్లాబుల్నికుదించడంతో పాటు.. రూ.7లక్షల వరకూ రాయితీ కల్పించిన విషయం తెలిసిందే.
గోధుమల ధర తగ్గుతుంది..
ప్రత్యక్ష పన్నుల్లో సరళీకరణ కోసం దేశమంతా ఎదురుచూసిందని.. అందువల్ల రెండు మూడేళ్ల క్రితం తాము తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం ఇప్పుడు అధిక ప్రోత్సాహకాలతో ఆకర్షణీయంగా మారిందన్నారు. అందువల్ల కొత్త విధానంలోకి నిస్సంకోచంగా మారొచ్చని సూచించారు. మన దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోందన్నారు. మహిళా సాధికారత, పర్యాటరంగంలో కార్యాచరణ ప్రణాళిక, విశ్వకర్మలు, హరిత వృద్ధి వంటివి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యతా అంశాలుగా తీసుకున్నట్టు తెలిపారు. మరోవైపు, గోధుమల ధరల నియంత్రణకు మరిన్ని గోధుమలను మార్కెట్లోకి విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించిందని.. అందువల్ల వాటిధరలు తగ్గుతాయని చెప్పారు. కేంద్రం బడ్జెట్‌కు ముందే గోధుమ ధరల్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు కొనసాగుతున్నాయన్న నిర్మలా సీతారామన్.. మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం కల్పించామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం పదో స్థానం నుంచి ఐదో స్థానానికి దూసుకెళ్లిందన్నారు.
మరోవైపు, ఆదాయ పన్ను చెల్లింపులకు సంబంధించి ప్రస్తుతం రెండు విధానాలు ఉన్నాయి. పాత, కొత్త విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకొనే సౌలభ్యం అందుబాటులో ఉంది. కొత్త విధానం ప్రకారం రూ.7లక్షల లోపు ఆదాయానికి కేంద్రం పూర్తిగా పన్ను మినహాయింపు కల్పించింది. కొత్త విధానంలో రూ.7లక్షలు పైబడిన ఆదాయానికే పన్ను వర్తిస్తుంది. కొత్త విధానంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. పాత విధానంలో మినహాయింపులు క్లెయిమ్ చేసుకొనే అవకాశం ఉంది. పాత విధానం ఎంచుకుంటే రూ.2.5లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు
-
Sports News
భారత్‌తో బంధం ప్రత్యేకమైంది: ఏబీ డివిలియర్స్
-
Ap-top-news News
సీఎం జగన్ కోసం 2 గంటలు వాహనాల మళ్లింపు