హర్‌ సర్కిల్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించిన నీతా అంబానీ

Nita ambani: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త కార్యక్రమాన్ని నీతా అంబానీ ప్రారంభించారు. అందరి మహిళలనూ సమానంగా చూడడం దీని ఉద్దేశం.

Published : 08 Mar 2023 18:15 IST

ముంబయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ‘హర్‌ సర్కిల్‌ ఎవ్రిబడీ’ (Her Circle, EveryBODY ) పేరిట కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వయసు, రంగు, మతం, శరీరతత్వం వంటి భౌతిక వివక్షకు తావు లేకుండా అందరి మహిళల్ని సమానంగా చూడాలన్నదే ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశం. మహిళల కోసం 2021లో ప్రత్యేకంగా హర్‌ సర్కిల్‌ సోషల్‌మీడియాను నీతా అంబానీ ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫాం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో సమాజంలో సానుకూల మార్పు తెచ్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్‌లో అందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నీతా అంబానీ పిలుపునిచ్చారు.

హర్‌ సర్కిల్‌  గురించి నీతా అంబానీ మాట్లాడుతూ.. అందరినీ సమానంగా చూడాలన్నదే కొత్త ప్రాజెక్ట్‌ ఉద్దేశమని తెలిపారు. చాలా మంది సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు, అవమానాలకు గురవ్వడం చూస్తున్నాం అని చెప్పారు. వారు ఎలాంటి వైద్య సమస్యలతో బాధపడుతుంటారో, జన్యు పరమైన ఇబ్బందులతో సతమతమవుతుంటారో తెలీకుండా తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తుంటారు. దీనివల్ల యువ హృదయాలు బాధపడుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంలో ఓ విధంగా తమ ఈ ప్రాజెక్ట్‌ సహాయపడుతుందని తెలిపారు. ట్రోలింగ్‌కు గురయ్యేవారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకూ ఉపయోగపడుతుందన్నారు.

సోషల్ మీడియా ద్వారా మహిళలకు సంబంధించిన కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా హెర్‌ సర్కిల్‌ను 2021లో ప్రారంభించారు. ఇందులో వెల్‌నెస్, ఫైనాన్స్, పర్సనల్ డెవలప్‌మెంట్, కమ్యూనిటీ సర్వీస్, బ్యూటీ, ఫ్యాషన్, ఎంటర్‌టైన్‌మెంట్ సహా అనేక రకాల విషయాలపై వీడియోలను అందిస్తుంటారు. కథనాలనూ ఇస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు, మహిళలు నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లోనూ ఇందులోని సభ్యులు పాల్గొనొచ్చు. హర్‌ సర్కిల్‌లో ఆంగ్ల, హిందీ భాషల్లో కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో హర్‌ సర్కిల్‌ను ప్రారంభించామని నీతా అంబానీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. రెండేళ్ల కాలంలో చాలా ముందుకొచ్చామని, అయినా ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని