FlexFuel Car: తొలి ఫ్లెక్స్‌ఫ్యూయెల్‌ కారు.. భారత్‌లో విడుదల చేసిన కేంద్ర మంత్రి

పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తయారైన తొలి ఫ్లెక్స్‌ఫ్యూయెల్‌ కారును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విడుదల చేశారు. 

Updated : 29 Aug 2023 18:21 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyoya) తయారు చేసిన తొలి ఫ్లెక్స్‌ఫ్యూయెల్‌ (FlexFuel) కారును కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం దిల్లీలో ఆవిష్కరించారు. 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఈ కారును ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ARAI)తో కలిసి టయోటా సంస్థ అభివృద్ధి చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌ ఫ్లెక్స్‌ఫ్యూయెల్‌ (Toyota Innova HyCross FlexFuel) పేరుతో తీసుకొస్తున్న ఈ కారును BS-6 (స్టేజ్-II) ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్‌ చేశారు. ధర, అమ్మకాలకు సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్‌ఫ్యూయెల్ నమూనా కారు ఇదేనని గడ్కరీ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ ఏడాది మార్చిలో మార్కెట్లోకి విడుదల చేసిన ఇన్నోవా హైక్రాస్‌ హైబ్రిడ్‌ మోడల్‌లో ఫ్లెక్స్‌ఫ్యూయెల్‌ (ఇథనాల్‌)కు అనుగుణంగా టయోటా మార్పులు చేసింది. ఇందులో రెండు లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు సెల్ఫ్‌ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌, ఈ-డ్రైవ్‌ సీక్వెన్షియల్ సిఫ్ట్‌ సిస్టమ్‌ ఉన్నాయి. ఇది 181 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. వీటితోపాటు టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, రివర్స్‌ కెమెరా, పార్కింగ్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

హీరో కరిజ్మా వచ్చేసింది.. ధర, ఇతర వివరాలు ఇవే..!

‘‘పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. భవిష్యత్తులో ఇథనాల్ ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. దేశంలో అన్ని కార్లు, బైక్‌లు, ఆటోలు వంద శాతం ఇథనాల్‌తో నడవాలనేది నా కల. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం వల్ల వాతావరణంలో 40 శాతం కాలుష్యం తగ్గుతుంది. అంతేకాదు, ఖరీదైన ముడి చమురు దిగుమతులు కూడా తగ్గుతాయి. దానివల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించాలన్న భారత్‌ లక్ష్యం కూడా నెరవేరుతుంది’’ అని నితిన్‌ గడ్కరీ అన్నారు. 

2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపి వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోల్‌, ఇథనాల్‌ను కలిపి వినియోగించడాన్నే ఫ్లెక్స్‌ఫ్యూయెల్‌ సాంకేతికతగా పిలుస్తారు. ఇథనాల్‌ను చెఱకు, మొక్కజొన్న, బార్లీ వంటి వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇతర శిలాజ ఇంథనాలతో పోలిస్తే ఇథనాల్‌ తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే, ఇది తక్కువ మొత్తంలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని